సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రంగాలు, విభాగాల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణుల్లో 55 శాతం మంది పని ప్రదేశాల్లో ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. గత 18 నెలలుగా కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, ఎదురైన ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిళ్లకు కారణమవుతున్నట్లు లింక్‌డ్‌ఇన్ సంస్థ చేపట్టిన ‘ద వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్’ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జూలై 31 నుంచి సెస్టెంబర్ 24 వరకు దేశవ్యాప్తంగా వృత్తి నిపుణులపై నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
దేశంలోని మొత్తం వృత్తి నిపుణుల్లో (ఉద్యోగాలు చేస్తున్న వారు) 55 శాతం మంది పనిచేసే చోట్ల ఒత్తిళ్లకు గురవుతున్నట్లు ఈ పరిశీలన తేల్చింది. ఈ 55 శాతం మందిలో వృత్తిధర్మంలో భాగంగా చేసే పనులు–వ్యక్తిగత అవసరాల మధ్య తగిన సమన్వయం, పొంతన సాధించకపోవడం వల్ల 34 శాతం మంది, ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాల్లో తగినంతగా సంపాదించలేకపోతున్నం దువల్ల 32 శాతం మంది, వృత్తిపరంగా పురోగతి చాలా నెమ్మదిగా సాగడం వల్ల 25 శాతం మంది వృత్తినిపుణులు ఒత్తిళ్లకు గురవుతున్నారు.
నిత్యం ఆఫీసుల్లో పనిని నిర్ణీత కాలానికి ముగించాలని 47 శాతం మంది భావించినా పనిఒత్తిళ్ల కారణంగా వారిలో 15 శాతం మందే అనుకున్న సమయానికి పని ముగించుకోగలుగుతున్నట్టు సర్వే తెలిపింది. అయితే ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలు, పనిప్రదేశాలపట్ల ప్రతి ముగ్గురిలో ఒకరు (36 శాతం) సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తున్న ఖర్చులపై పట్టు పెంచుకోగలిగామని 30 శాతం మంది తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న క్రమంలో మార్కెట్‌లో ఉద్యోగాలు సాధించే విషయంలో పోటీ పెరిగినా క్రమంగా పరిస్థితులు మెరుగవుతున్నాయనే భావనను పలువురు వెలిబుచ్చారు.
పని–జీవితం మధ్య సమతూకం సాధించాలి
వృత్తి నిపుణులు, ఇతర ఉద్యోగుల పని ఒత్తిళ్లను పైస్థాయిలో యజమానులు అర్థం చేసుకొని వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ సర్వే ద్వారా వెల్లడైందని లింక్‌డ్‌ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ ఘోష్ పేర్కొన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి వృత్తి నిపుణుల ప్రాధాన్యతలు మారుతుంటాయని, రాబోయే కాలానికి అనుగుణంగా భారతీయ వృత్తి నిపుణులు తమ పని–జీవితం మధ్య సమతూకాన్ని సాధించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment