సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి. రెండేళ్లుగా బాగానే ఉన్నా ఇటీవల తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనైంది. ఆస్పత్రిలో చేర్చినా భయాందోళనతో బయటికి వెళ్లిపోయింది. తన పేరేమిటో కూడా సరిగా చెప్పలేని స్థితికి చేరుకుంది. చివరికి ఆకలితో అలమటిస్తూ అక్కడి వీధుల్లో తిరుగుతోంది. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతానికి చెందిన సయ్యదా లులూ మిన్హాజ్ జైదీ దీన గాథ. ఆమెను గమనించిన ఓ హైదరాబాదీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఎవరన్నది తెలిసింది. ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఆకలితో అలమటిస్తూ..
లులూ జైదీ 2021 ఆగస్టులో ఎంఎస్ ఇంజనీరింగ్ చేసేందుకు అమెరికాలోని డెట్రాయిట్‌కు వెళ్లింది. అక్కడి ట్రినీ యూనివర్సిటీలో చదువుతోంది. తరచూ తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. కానీ కొన్ని నెలల కింద మానసిక ఒత్తిడికి లోనైంది. నాలుగు నెలల నుంచి తల్లికి ఫోన్ చేయడం కూడా మానేసింది. ఆమె ప్రవర్తనలో విపరీత మార్పును చూసిన తోటి విద్యార్థులు తల్లికి సమాచారం ఇచ్చారు. ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. లులూ జైదీ తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయినట్టు గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. కానీ ఆమె ఆస్పత్రిలోంచి వెళ్లిపోయింది.
వీధుల్లో తిరుగుతూ, ఎవరేమైనా పెడితే తింటూ గడుపుతోంది. ఈ క్రమంలో షికాగో నగరానికి చేరుకుంది. అక్కడ ఓ వీధిలో ఆకలితో ఆలమటిస్తున్న లులూ జైదీని అక్కడే ఉంటున్న హైదరాబాదీ గమనించి మాట్లాడారు. ఆమె పేరు కూడా చెప్పలేని పరిస్థితి, ఆకలితో అలమటిస్తున్న తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో హైదరాబాద్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అమెరికాలోని హైదరాబాదీలు, తోటి విద్యార్థులు ఇది చూసి.. లులూ జైదీని షికాగోలోని సురక్షిత ప్రాంతానికి తరలించి, వైద్యం అందిస్తున్నారు.
హైదరాబాద్‌కు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు
లులూ జైదీ దుస్థితి గురించి తెలిసిన ఆమె తల్లి.. తన కుమార్తెను కాపాడి, తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆమెను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన జైశంకర్.. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో షికాగోలోని భారత కాన్సులేట్ జనరల్.. లులూ జైదీ ఎవరి వద్ద ఉందో తమతో టచ్‌లోకి రావాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment