Software professionals
-
సాఫ్ట్వేర్ నిపుణులకు ‘పార్ట్‌టైమ్’ ఆఫర్!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ కొలువులిస్తామంటూ ఇంజినీరింగ్ కాలేజీల వెంటపడే ఐటీ కంపెనీలు కామన్! కట్ చేస్తే... పాఠాలు చెప్పాలంటూ సాఫ్ట్ వేర్ నిపుణుల కోసం వేట మొదలెట్టాయి కాలేజీలు. ఫ్యాకల్టీగా చేరాలని.. కనీసం పార్ట్‌టైమ్‌గా అయినా విద్యార్థులకు బోధించాలంటూ ఇంజనీరింగ్ కాలేజీలు వారిని ఆహ్వానిస్తున్నాయి. ఆన్లైన్లోనైనా శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాయి. మంచి వేతనాలివ్వడానికీ సిద్ధపడుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. మరోపక్క సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. విద్యార్థుల నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను డిమాండ్ పెరగడమే దీనికి కారణం. అయితే, వీటిని బోధించే ఫ్యాకల్టీకి మాత్రం తీవ్రంగా కొరత నెలకొంది. ఈ విభాగాల్లో ఎంఎస్ చేసిన వాళ్లు కూడా బోధన వైపు ఆసక్తి చూ పడం లేదు. దీంతో ఇప్పటివరకూ సీఎస్సీ బోధించే వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారు. దీనివల్ల నాణ్య త పెరగడం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) గుర్తించింది. సాఫ్ట్వేర్ రంగం లో నిపుణులతో బోధించే ఏర్పాటు చేయాలని సూ చించింది. ఈ తరహా బోధన ఉంటే తప్ప వచ్చే ఏ డాది నుంచి కంప్యూటర్ కోర్సులకు అనుమతించవ ద్దని రాష్ట్రాల కౌన్సిళ్లకు తెలిపింది. దీంతో సాఫ్ట్వేర్ నిపుణులకు గాలంవేసే పనిలోపడ్డాయి కాలేజీలు. వాళ్లెవరో చెప్పాల్సిందే... రాష్ట్రంలోని 174 కాలేజీల్లో కంప్యూటర్ కొత్త కోర్సులను బోధించే వారి జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్శిటీకి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆయా ఫ్యాకల్టీ అర్హతలను యూనివర్సిటీ కమిటీలు పరిశీలిస్తాయి. ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీకి ఆయా రంగాల్లో నిష్ణాతులను నియమించాలని ఏఐసీటీఈ సూచించింది. అయితే, వాళ్ల అర్హతలేంటనేది స్పష్టం చేయలేదు. దీని స్థానంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌తో బోధన చేయించాలని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58 శాతం కంప్యూటర్ కోర్సులున్నాయి. ప్రతీ కాలేజీలోనూ ఒక ఏఐ బ్రాంచీ ఉంటోంది. ఈ లెక్కన ఈ ఏడాది ప్రతీ కాలేజీ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇతర కోర్సుల కోసం కనీసం ఐదుగురి చొప్పున ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి రాష్ట్రంలో దాదాపు 250 మంది సాఫ్ట్వేర్ నిపుణులకు అవకాశాలు దక్కే వీలుంది. ఆన్లైన్ క్లాసులు... ఫుల్‌టైమ్ ఫ్యాకల్టీ కొరత నేపథ్యంలో... ఆన్లైన్ ద్వారా కొత్త కోర్సులను బోధించేందుకు యూనివర్సిటీలు, ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యా మండళ్లు అనుమతిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారిని బోధనకు ఒప్పించేందుకు కాలేజీలు కృషి చేస్తున్నాయి. వారానికి కనీసం 10 క్లాసులు చెప్పించే ఏర్పాటు చేస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు కాలేజీలు కూడా ఇదే బాట పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారికి శని, ఆదివారాల్లో సెలవులుంటాయి. అయితే, కోవిడ్ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులను కంపెనీలు తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఈ కారణంగా వారాంతపు సెలవుల్లో బోధనకు నిపుణులు సిద్ధపడటం లేదని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకుడు తెలిపాడు. దీంతో అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ నిపుణుడిని ఏఐ కోసం నియమించినట్టు తెలిపారు. సాధారణ ఫ్యాకల్టీకి ఇచ్చే వేతనం కన్నా పార్ట్‌టైమ్ పనిచేసే నిపుణులు రెండింతలు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. -
బుర్ర వేడెక్కి, కాలిపోతుంది.. బర్న్ ఔట్ సిండ్రోమ్, మూన్‌లైటింగ్ అంటే?
విపరీతంగా ఆలోచించినప్పుడు బుర్ర వేడెక్కిపోయింది అంటుండటం సాధారణం. మరి అంతకంటే ఎక్కువ తీవ్రతతో కూడిన ఒత్తిడితో పని చేస్తుంటే దాన్ని కాలిపోవడంతో పోల్చవచ్చా అంటే అవునంటున్నారు వైద్యనిపుణులు. నియంత్రణ ఏమాత్రం లేకుండా, తీవ్ర ఒత్తిడితో పనిచేస్తే కలిగే దుష్ప్రభావాలను ‘‘బర్న్ ఔట్ సిండ్రోమ్’’గా చెబుతున్నారు. దీనికి ఒకింత తీవ్రత ఎక్కువగా ఉన్న మరో స్థితి కూడా ఉంది. దాని పేరే ‘మూన్‌లైటింగ్’ ఎఫెక్ట్. ఈ మాటలిప్పుడు మరింత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఉంది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ విధించడంతో కొన్ని వృత్తులవారు... ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఆమాటకొస్తే డాక్టర్లు, నర్సుల వంటి వారూ ఈ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’ బారిన పడ్డట్లుగా అధ్యయనాల్లో తేలడంతో వాటి ప్రభావమిప్పుడు చర్చనీయాంశమైంది. ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’పై అవగాహన కల్పించే కథనమిది. లాక్డౌన్ లేని సమయంలో సాఫ్ట్వేర్ వృత్తుల వారు ఎవరి ఆఫీసుల్లో వారు.. వారి సంస్థకు చెందిన పనులు చేసుకునేవారు. లాక్డౌన్ విధించాక ఇంట్లోనే ఉండి పనిచేసుకోవచ్చనే వెసులుబాటు రావడంతో.. కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి పనులు స్వీకరించి పనిచేయడం మొదలుపెట్టారు. మామూలుగానే ఒత్తిడితో కూడిన వృత్తి.. దానికి తోడు మరిన్ని సంస్థలకు పనిచేయాల్సి రావడంతో ఏర్పడ్డ అదనపు ఒత్తిడి కారణంగా ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఎక్కువయ్యింది. ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థలో పనిచేస్తూ.. ఒకటి కంటే ఎక్కువ సంస్థలకు చెందిన కార్యకలాపాలు నిర్వహించడంతో.. అనూహ్యంగా పెరిగిపోయిన తీవ్రమైన ఒత్తిడిని ‘మూన్లైట్ ఎఫెక్ట్’గా వైద్యులు పేర్కొంటున్నారు. వీటివల్ల మెదడులో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలనూ, ఉపాధిని కోల్పోవడమూ జరిగిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా... లక్షణాలు ►తీవ్రమైన నిస్సత్తువ, పని పైన ఆసక్తి లేకపోవడం ►పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం ►వృత్తికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రతికూల ధోరణి (నెగెటివిజమ్) ►భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా ఆలోచించడం ►తనను తాను ప్రోత్సహించుకుని, పని చేయడానికి పురిగొల్పుకునే ధోరణి (మోటివేటెడ్‌గా) లేకపోవడం. ‘బర్న్ఔట్’ తాలూకు తీవ్రతలూ – దశలు... ఈ దుష్ప్రభావల తీవ్రత... ఒకేసారి కాకుండా దశలవారీగా కనిపిస్తుంది. అవే... 1. హనీమూన్ ఫేజ్ : పని పెరిగినప్పటికీ అదనపు ఆదాయం సమకూరుతుండటం, డబ్బు కళ్లబడుతుండటంతో మొదట్లో చాలా ప్రోత్సాహకరంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. అందుకే దీన్ని ‘హనీమూన్ ఫేజ్’గా చెబుతారు. 2. అర్లీ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి తాలూకు మొదటి దశ ఇది. 3. క్రానిక్ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి మొదటి దశ దాటిపోయి... ఎల్లప్పుడూ అదే ఒత్తిడితో ఉండటం జరుగుతుంది. అందుకే దీన్ని ‘క్రానిక్ స్ట్రెస్ ఫేజ్’గా చెబుతారు. 4. ఎస్టాబ్లిష్డ్ బర్న్ ఔట్ : నిత్యం ఒత్తిడి కారణంగా కనిపించే దుష్ప్రభావాలు స్పష్టంగా వెల్లడవుతూ ఉండటం (ఎస్టాబ్లిష్ అవుతుండటం) వల్ల దీన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఇదీ చదవండి: పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి? 5. హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్ : నిత్యం కనిపించే ఒత్తిడికి పూర్తిగా అలవాటు పడిపోయి, దాన్లోంచి తప్పించుకోలేక, ఒప్పుకున్న పనినుంచి తప్పుకోలేక ఒకరకమైన నిస్పృహకూ, నిరాసక్తతకూ లోనుకావడాన్ని ‘హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్’ దశగా చెప్పవచ్చు. పైగా ఈ దశలన్నీ వ్యక్తుల్లో మంచి అభివృద్ధికి తోడ్పడే కీలకమైన వయసులో అంటే 30 నుంచి 35 ఏళ్ల మధ్యన కలగడంతో తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోను కావడంతో ఆ కుటుంబం అతలాకుతలం కావడం, ఛిన్నాభిన్నమైపోవడం లాంటి పరిణామాలు సంభవిస్తుంటాయి. ఎవరిలో ఎక్కువంటే... సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాకుండా, కోవిడ్ సమయంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వైద్యవర్గాలూ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఆసక్తికరమైన అంశం. గణాంకాల్ని చూసినప్పుడు ఈ వైద్యవర్గాల్లోనూ ఎమర్జెన్సీ వైద్య విభాగాల్లో పనిచేసేవారు 65%, కార్డియాలజీ విభాగానికి చెందిన వారు 43%, న్యూరోసర్జరీ విభాగాల్లో పనిచేసే వైద్యుల్లో 21% మంది దీని బారిన పడ్డారని తేలింది. వీళ్లే కాదు... ఫాస్ట్‌ఫుడ్ డెలివరీ వర్కర్లు, ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ ఫైటర్లూ దీనికి గురవుతుంటారు. మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. దీనికి తోడు వ్యాయామం చేయనివాళ్లూ, ఊబకాయం ఉన్నవారూ, ఒంటరివాళ్లూ, బాగా ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారిలోనూ బర్న్ఔట్ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు మరీ ఎక్కువ. మూన్‌లైటింగ్ ఎఫెక్ట్ అంటే... తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పెంచుకోవాలనే కోరికతో, ఎలాగూ తమపై ఆఫీసు నిఘా ఉండదు కాబట్టి పలుచోట్ల పనులను ఒప్పుకున్నవారు మరింత ఎక్కువ ఒత్తిడికి గురికావడాన్ని ‘మూన్‌లైటింగ్ ఎఫెక్ట్’ అంటారు. మామూలుగా మనం పగలు పనిచేస్తుంటాం. అదనపు పనిని ఒప్పుకున్నందున నిద్రమానేసి విశ్రాంతి లేకుండా రాత్రుళ్లూ పని చేస్తూ పోవడాన్ని ‘మూన్‌లైటింగ్’గా చెబుతున్నారు. మొదట్లో దీన్ని ఓ వైవిధ్యమైన పరిస్థితిగా అనుకున్నప్పటికీ విస్తృత అధ్యయనం తర్వాత ‘మూన్‌లైటింగ్’ కూడా ‘బర్న్ఔట్’ తాలూకు మరో రూపమనీ, దానికంటే ఒకింత తీవ్రత ఎక్కువని తేలింది. దీనివల్ల ఆఫీసులో జరిగే తప్పులే కాకుండా... భవిష్యత్తులో హైబీపీ, గుండెజబ్బులకూ, డిప్రెషన్‌కూ దారితీయవచ్చని పరిశోధనల్లో తేలింది. విముక్తి ఎలా... ఈ సమస్యల నుంచి బయటపడటం కూడా తేలికే. అవసరమైనంత విశ్రాంతి తీసుకోవడం, వీలైనంతవరకు మధ్యాహ్నాలు ఓ అరగంట నిద్ర (పవర్‌న్యాప్), రాత్రుళ్లు కంటి నిండా కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వీలైనంతవరకు చక్కెర పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్కహాల్‌కూ, నిద్రపట్టనప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడేవారు వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయాలి. తమ పట్ల తాము జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాకుండా... ఇతరులకు సహాయం చేయడంలోని ఆనందమూ వారిని బర్న్ ఔట్ నుంచి రక్షిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. అప్పటికీ నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, అనాసక్తి వంటి లక్షణాలు చాలాకాలం పాటు కనిపిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. మెదడుపైనా దుష్ప్రభావాలు ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలో : బర్న్ ఔట్ కారణంగా మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలోని ‘గ్రే మ్యాటర్’ బాగా పలచబారినట్లు ఇటీవలి తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి బాగా తగ్గడం, ఏ విషయాన్నైనా సమగ్రంగా ఆకళింపు చేసుకోవడంలో లోపాలు, చేసిన తప్పిదాలే మళ్లీ మళ్లీ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో నైపుణ్యాలు తగ్గడం వంటి లోపాలు కనిపించాయి. టెంపోరల్ లోబ్ ప్రాంతంలో : మెదడులోని మధ్య (మీడియల్) టెంపోరల్ లోబ్ అనే చోట బాదం కాయ ఆకృతిలో ‘ఎమిగ్దలా’ అనే ఓ ప్రదేశం ఉంటుంది. (నిజానికి గ్రీకు భాషలో ఎమిగ్దలే అంటే బాదం కాయ అనే అర్థం. అందుకే దానికా పేరు). భయాలూ, ఆందోళనల్లాంటి అనేక ఉద్వేగాలకు కారణమయే, ఆవిర్భవించే ప్రదేశమది. బర్న్ ఔట్‌కు లోనైన వారిని పరిశీలించినప్పుడు వాళ్లలో ‘అమిగ్దలా’ బలంగా మారినట్లు తేలింది. ఫలితంగా తమ చుట్టూ ఉన్న ప్రపంచమంతా భయంకరంగా అనిపించడం లాంటి అనుభవాలకు గురిచేస్తుందన్న మాట. ఒకవైపు గ్రేమ్యాటర్ పలచబారడం, మరోవైపు ఎమిగ్దలా బలపడటం... ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడంతో బర్న్ఔట్ తీవ్రత మరింతగా పెరుగుతోంది. -
సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌కు అమెజాన్ ఉద్యోగాలు
బెంగళూరు : అమెజాన్ తన రెండో అతిపెద్ద వర్క్‌ఫోర్స్ సెంటర్ అయిన భారత్‌లో ఉద్యోగవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. 1000 మందికి పైగా ఉద్యోగులను భారత్‌లో నియమించుకోవాలని చూస్తోంది. వీరిలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. కంపెనీ భిన్నమైన వెర్షన్లు అంటే అమెజాన్.కామ్, అమెజాన్.ఇన్, డివైజ్‌ల బిజినెస్‌లలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు, క్లౌడ్ కంప్యూటింగ్ డివిజిన్ అమెజాన్ వెబ్ సర్వీసుల్లో ఈ నియామకాల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. సంబంధిత టెక్నాలజీల్లో ప్రతిభ ఉన్న వారికే ఈ నియామకాలను పరిమితం చేయాలని కంపెనీ నిర్ణయించినట్టు ఓ ఆంగ్ల సైటు రిపోర్టు చేసింది. బుధవారం సాయంత్రం అమెజాన్ తన వెబ్‌సైట్‌లోని కెరీర్ పేజీలో భారత్‌లో 1,245 స్థానాలను లిస్టు చేసింది. ప్రస్తుతం అమెజాన్‌కు భారత్‌లో దాదాపు 50వేల మంది వరకు ఉద్యోగులున్నారు. అమెరికా తర్వాత అమెజాన్ రెండో అతిపెద్ద వర్క్‌ఫోర్స్ సెంటర్ భారతే. గ్లోబల్‌గా ఈ సంస్థకు 3,41,000 మంది ఉద్యోగులున్నారు. రీసెర్చ్ సైంటిస్టులు, డేటా అనాలిటిక్స్లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలపర్స్ వంటి టెక్నాలజీల్లో ప్రతిభ ఉన్నవారి కోసం అమెజాన్ చూస్తున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ అత్యంత లాభాదాయక వ్యాపార యూనిట్, ఏడబ్ల్యూఎస్, 195 మందిని నియమించుకోవాలనుకుంటుండగా.. బెంగళూరులో 557 మందిని, హైదరాబాద్‌లో 403 మందిని, చెన్నైలో 149 మందిని నియమించుకోవాలని చూస్తున్నట్టు అమెజాన్ ఇండియా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ దలే వాజ్ చెప్పారు. బెంగళూరు సెంటర్ అమెజాన్‌కు అతిపెద్దది. కిండ్లీ, ఫైర్ లాంటి డివైజ్‌లపై చెన్నై సెంటర్ ఎక్కువగా ఫోకస్ చేసింది. అమెరికా మినహా మిగతా అన్ని సెంటర్లలో కెల్లా బెంగళూరులోనే అమెజాన్ ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటోంది. -
ఘన టెకీ..బోనమెత్తి..
ఒంటినిండా పసుపు పూసుకుని.. కాళ్లకు గజ్జెలు కట్టుకుని.. జుట్టు అమాంతం వెనక్కి లాగి కట్టి.. నిక్కరు తరహాలో పంచె ఎగ్గట్టి, తనంత ఎత్తున్న కొరడా చేత పట్టి..‘హుహ్హహ్హ’ అని హూంకరిస్తూ.. మెలితిరిగిన మీసాలతో ‘మాయదారి మైసమ్మ’ పాడుతూ చిందులేస్తుంటే.. చూపరులు కళ్లార్పడంమరచిపోయారు. కంప్యూటర్లు తప్ప వీళ్లకేం తెలుసనుకున్న నోళ్లు మూతపడటం మరచిపోయాయి. సిటీలో తొలిసారి సాఫ్ట్వేర్ నిపుణులు బోనాలు థీమ్‌తో ప్రదర్శించిన నృత్యహేల.. ఐటీ సర్కిల్లో హాట్ టాపిక్. ..:: ఎస్.సత్యబాబు/వాంకె శ్రీనివాస్ బోనమెత్తుకు నడిచే మహిళా జన తరంగం.. పోతురాజుల వీ‘రంగం’.. నారీమణి వినిపించే భవిష్యవాణి .. అందులో భాగంగా ఆటలు, పాటలు.. ఇవ న్నీ రాష్ట్ర సంస్కృతిలో భాగం. పొద్దున్న లేస్తే కంప్యూటర్లతో కుస్తీపట్టే నవజనానికి బోన‘భాగ్యాలు’ ఏం తెలుస్తాయ్? అని నిట్టూర్చేవారే ఆశ్చర్యపోయేలా చేశారా సాఫ్ట్వేర్ నిపుణులు. డీఎస్టీ ఇండియా ఉద్యోగుల వార్షిక సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన తెలంగాణ జానపద సంబురాలు.. ఆద్యంతం ఆచార వ్యవహారలపై టెకీలకు ఉన్న ఆసక్తిని కళ్లకుకట్టాయి. ఆధునికత ఒంటబట్టినా.. ఆచారం వెనుకబడదని చాటి చెప్పాయి. నేపథ్యమిదీ.. ఐటీ కంపెనీలు ఈవెంట్స్ నిర్వహించడం మామూలే. పాప్ డ్యాన్సులు, ఫ్యాషన్ షోలు, రాక్‌బ్యాండ్స్, క్విజ్లు, బ్యూటీ కాంటెస్ట్‌లు.. ఈ హడావిడి తెలిసిందే. అయితే ఐటీ ఈవెంట్లో ‘బోనాలు’ భాగం కావడం మాత్రం ఇదే తొలిసారి. దీనికి కారణం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాది ఇది. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి, విదేశీయులకు తమ సంస్కృతీ సంప్రదాయాల్లోని గాఢతను, వాటిపై తమకు ఉన్న గౌరవాన్ని తెలియజెప్పాలి అనుకోవడమే ఈ ఈవెంట్ ఉద్దేశమని నిర్వాహకులు చెప్పారు. జంటనగరాల్లో 1869లో అంటువ్యాధి కారణంగా ఎంతో మంది చనిపోతే.. దానికి అమ్మవారి ఆగ్రహమే కారణమనే నమ్మకం బోనాలు వేడుకకు నాంది పలికించింది. అందుకే అమ్మవారికి ఆగ్రహం రావడం అనే అంశాన్ని నేపథ్యంగా సాగిన సాఫ్ట్వేర్ సందడి ఆకట్టుకుంది. సాగిన విధమిదీ.. సాక్షాత్తూ మహంకాళి అమ్మవారుగా మోనీ ప్రియ ఆగ్రహంతో ఊగిపోతే.. పోతురాజులుగా నర్సింహ, సందీప్‌లు శివాలెత్తారు. పండుగ సంబురాలకు హాజరయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్రలో కిషోర్‌కుమార్ ఒదిగిపోయారు. వీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే.. జంటనగరాల బోనాల సందడిని ప్రతిబింబింపజేయడానికి ఒక లేడీ ఎస్సై పాత్రను సైతం ఒక మహిళా ఉద్యోగి చేత ధరింపజేశారు. సమూహాన్ని నియంత్రించే పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. మరో ఇద్దరు పోలీసులు ఊరేగింపునకు ఎస్కార్ట్‌గా, మరో ఉద్యోగి పురోహితుడిగా మారిపోయారు. మహిళా ఉద్యోగినులు ఇళ్ల దగ్గర భక్తి శ్రద్ధలతో వండి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా ఈ బోనాల సందడి మొత్తం జంటనగరాల్లో జరిగే సిసలైన వేడుకను ప్రతిబింబించింది. మాయదారి మైసమ్మ అంటూ అన్నదమ్ములు నర్సింహ, సందీప్‌లు పోతురాజుల్లా చిందులేస్తుంటే నేపథ్యంలోని డ్రమ్స్ రిథిమ్కు సహచర సిబ్బంది కాలు కలపకుండా ఉండలేకపోయారు. ‘చరిత్రపై పూర్తి అవగాహన లేకున్నా ఆడియో-విజువల్-కమ్-లైవ్ పెర్ఫార్మెన్స్ ద్వారా అచ్చమైన బోనాలకు పట్టం కట్టడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించాం’ అని కంపెనీ ఉద్యోగి మౌనిక చెప్పారు. వాట్సప్‌లో భవిష్యవాణి.. కొరడాలు ఝళిపిస్తూ, నడుముకు ఆకులు చుట్టుకుని డ్రమ్స్ దరువు, డప్పుల మోతలకు అనుగుణంగా చిందేస్తూ అమ్మవారి పాత్రలో మోనిప్రియ భవిష్యవాణి చెబుతున్నప్పుడు.. మన కంపెనీ ఫ్యూచర్ ఏమిటి అని ఒక ఉద్యోగి అడిగితే... వాట్సప్‌లో పంపిస్తానని బదులివ్వడం ఈ థీమ్‌లోని గాంభీర్యం నుంచి ఉపశమనం కలిగించింది. ఈ థీమ్‌ను అనుకున్నప్పుడు కొంచెం గాబరాపడ్డామని, కొరడాలు ఝళిపిస్తూ చిందులేయడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం వంటివి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సాధ్యమేనా అని అనుమానించామని.. అయితే రంగంలోకి దిగిన దగ్గర్నుంచి పోటీపడుతూ ఎవరి పాత్రను వారు రక్తికట్టించడం విశేషమని నిర్వాహకుల్లో ఒకరైన ప్రవీణ్ అంటున్నారు. రేపటి ఆచారానికి నాంది... ఇదొక అద్భుతమైన అనుభవం అని ఈ ఈవెంట్‌కు హాజరైన విదేశీ ప్రతినిధులు వేడ్ ఫ్రీమ్యాన్, గాయ్రీ వెల్స్ చెప్పడం ఈ సందడి ఆకట్టుకున్న తీరుకు ఓ నిదర్శనం. ఈ బోనాల థీమ్‌ని కంపెనీకి చెందిన సీనియర్ ఐటీ అసోసియేట్ లోకేష్ డిజైన్ చేశారు. ‘ఈ థీమ్ కాన్సెప్టులైజేషన్, ఎగ్జిక్యూషనంతా కేవలం మూడు రోజుల్లో పూర్తయింది. దీని కోసం 25 మంది సిబ్బంది విభిన్న అవసరాల రీత్యా పాత్రధారులుగా మారారు’ అని చెప్పారాయన. ఆధునిక వ్యవస్థ కోసం నిన్నటి ఆచారాన్ని కళ్లకు కట్టిన ఈ ఐటీ ఉద్యోగులు ఇకపై సాఫ్ట్వేర్ ప్రాంగణాల్లోనూ బోనాల సందడిని ఒక ఆచారంగా మార్చడానికి నాంది పలికారు. పోతురాజు కథ తెలీదు.. అసలు పోతురాజంటే ఏమిటో, దాని వెనుక ఉన్న క థ ఏమిటో తెలీదు. అలాంటిది సడెన్‌గా నన్ను ఆ పాత్ర పోషించమని అడిగితే... తొలుత ఇబ్బంది పడ్డాను. అయితే లోకేష్ (నిర్వాహక కమిటీ ప్రతినిధి) నాకు వివరించి చెప్పడంతో ఒప్పుకున్నాను. పలు దఫాలు రిహార్సల్స్ తర్వాత ఈవెంట్లో సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాను. - నరసింహ గొప్ప అవకాశం.. పోతురాజు పాత్ర పోషించడం మరువలేని అనుభూతి ఇచ్చింది. ఇదొక గమ్మత్తయిన అనుభూతి. ఈ అవకాశం ఇచ్చిన రిక్రియేషన్ కమిటీకి థ్యాంక్స్. - సందీప్ అంతా అమ్మవారి కృప.. గతంలో నేను పాశ్చాత్య నృత్యాలు ప్రదర్శించాను. అయితే ఎప్పుడూ నాకు సరైన గుర్తింపు లభించలేదు. అమ్మవారిగా ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఈ పాత్ర నేను పోషించడం, దీనికి నలుగురి ప్రశంసలు లభించడం అంతా అమ్మవారి కృపే అనుకుంటున్నాను. - ప్రవల్లిక తమిళం నా భాష.. నా మాతృభాష తమిళం. కుండ తల మీద బ్యాలెన్స్ చేసుకోవడం వంటి ఫీట్లు ఉన్నాయి. భవిష్యవాణి చెప్పేటప్పుడు ఫ్యూచర్ గురించి జనం ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? వాటికి సమాధానాలు ఎలా ఉండాలి? వంటివన్నీ నేను స్వయంగా స్క్రిప్ట్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. పదేళ్లుగా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ఈ పాత్ర తాలూకు అనుభూతి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. - మోనీప్రియ