సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు అమెజాన్ ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు అమెజాన్ ఉద్యోగాలు
Published Thu, Aug 10 2017 10:33 AM | Last Updated on Sat, Sep 16 2017 4:19 PM
బెంగళూరు : అమెజాన్ తన రెండో అతిపెద్ద వర్క్‌ఫోర్స్ సెంటర్ అయిన భారత్‌లో ఉద్యోగవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. 1000 మందికి పైగా ఉద్యోగులను భారత్‌లో నియమించుకోవాలని చూస్తోంది. వీరిలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. కంపెనీ భిన్నమైన వెర్షన్లు అంటే అమెజాన్.కామ్, అమెజాన్.ఇన్, డివైజ్‌ల బిజినెస్‌లలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు, క్లౌడ్ కంప్యూటింగ్ డివిజిన్ అమెజాన్ వెబ్ సర్వీసుల్లో ఈ నియామకాల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. సంబంధిత టెక్నాలజీల్లో ప్రతిభ ఉన్న వారికే ఈ నియామకాలను పరిమితం చేయాలని కంపెనీ నిర్ణయించినట్టు ఓ ఆంగ్ల సైటు రిపోర్టు చేసింది. బుధవారం సాయంత్రం అమెజాన్ తన వెబ్‌సైట్‌లోని కెరీర్ పేజీలో భారత్‌లో 1,245 స్థానాలను లిస్టు చేసింది.
ప్రస్తుతం అమెజాన్‌కు భారత్‌లో దాదాపు 50వేల మంది వరకు ఉద్యోగులున్నారు. అమెరికా తర్వాత అమెజాన్ రెండో అతిపెద్ద వర్క్‌ఫోర్స్ సెంటర్ భారతే. గ్లోబల్‌గా ఈ సంస్థకు 3,41,000 మంది ఉద్యోగులున్నారు. రీసెర్చ్ సైంటిస్టులు, డేటా అనాలిటిక్స్‌లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలపర్స్ వంటి టెక్నాలజీల్లో ప్రతిభ ఉన్నవారి కోసం అమెజాన్ చూస్తున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ అత్యంత లాభాదాయక వ్యాపార యూనిట్, ఏడబ్ల్యూఎస్, 195 మందిని నియమించుకోవాలనుకుంటుండగా.. బెంగళూరులో 557 మందిని, హైదరాబాద్‌లో 403 మందిని, చెన్నైలో 149 మందిని నియమించుకోవాలని చూస్తున్నట్టు అమెజాన్ ఇండియా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ దలే వాజ్ చెప్పారు. బెంగళూరు సెంటర్ అమెజాన్‌కు అతిపెద్దది. కిండ్లీ, ఫైర్ లాంటి డివైజ్‌లపై చెన్నై సెంటర్ ఎక్కువగా ఫోకస్ చేసింది. అమెరికా మినహా మిగతా అన్ని సెంటర్‌లలో కెల్లా బెంగళూరులోనే అమెజాన్ ఎక్కువగా రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ ఉంటోంది.
Advertisement