ఘన టెకీ..బోనమెత్తి.. | it bonalu festival celebrations | Sakshi
Sakshi News home page

ఘన టెకీ..బోనమెత్తి..

Published Fri, Feb 6 2015 1:00 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

ఘన టెకీ..బోనమెత్తి.. - Sakshi

ఘన టెకీ..బోనమెత్తి..

ఒంటినిండా పసుపు పూసుకుని.. కాళ్లకు గజ్జెలు కట్టుకుని.. జుట్టు అమాంతం వెనక్కి లాగి కట్టి.. నిక్కరు తరహాలో పంచె ఎగ్గట్టి,  తనంత ఎత్తున్న కొరడా చేత పట్టి..‘హుహ్హహ్హ’ అని హూంకరిస్తూ.. మెలితిరిగిన మీసాలతో ‘మాయదారి మైసమ్మ’ పాడుతూ చిందులేస్తుంటే.. చూపరులు కళ్లార్పడంమరచిపోయారు. కంప్యూటర్లు తప్ప వీళ్లకేం తెలుసనుకున్న నోళ్లు మూతపడటం మరచిపోయాయి. సిటీలో తొలిసారి సాఫ్ట్‌వేర్ నిపుణులు బోనాలు థీమ్‌తో ప్రదర్శించిన నృత్యహేల.. ఐటీ సర్కిల్‌లో  హాట్ టాపిక్.
 ..:: ఎస్.సత్యబాబు/వాంకె శ్రీనివాస్
 
బోనమెత్తుకు నడిచే మహిళా జన తరంగం.. పోతురాజుల వీ‘రంగం’.. నారీమణి వినిపించే భవిష్యవాణి .. అందులో భాగంగా ఆటలు, పాటలు.. ఇవ న్నీ రాష్ట్ర సంస్కృతిలో భాగం. పొద్దున్న లేస్తే కంప్యూటర్లతో కుస్తీపట్టే నవజనానికి బోన‘భాగ్యాలు’ ఏం తెలుస్తాయ్? అని నిట్టూర్చేవారే ఆశ్చర్యపోయేలా చేశారా సాఫ్ట్‌వేర్ నిపుణులు. డీఎస్టీ ఇండియా ఉద్యోగుల వార్షిక సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన తెలంగాణ జానపద సంబురాలు.. ఆద్యంతం ఆచార వ్యవహారలపై టెకీలకు ఉన్న ఆసక్తిని కళ్లకుకట్టాయి. ఆధునికత ఒంటబట్టినా.. ఆచారం వెనుకబడదని చాటి చెప్పాయి.
 
నేపథ్యమిదీ..

ఐటీ కంపెనీలు ఈవెంట్స్ నిర్వహించడం మామూలే. పాప్ డ్యాన్సులు, ఫ్యాషన్ షోలు, రాక్‌బ్యాండ్స్, క్విజ్‌లు, బ్యూటీ కాంటెస్ట్‌లు.. ఈ హడావిడి తెలిసిందే. అయితే ఐటీ ఈవెంట్లో ‘బోనాలు’ భాగం కావడం మాత్రం ఇదే తొలిసారి. దీనికి  కారణం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాది ఇది. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి, విదేశీయులకు తమ సంస్కృతీ సంప్రదాయాల్లోని గాఢతను, వాటిపై తమకు ఉన్న గౌరవాన్ని తెలియజెప్పాలి అనుకోవడమే ఈ ఈవెంట్ ఉద్దేశమని నిర్వాహకులు చెప్పారు. జంటనగరాల్లో 1869లో అంటువ్యాధి కారణంగా ఎంతో మంది చనిపోతే.. దానికి అమ్మవారి ఆగ్రహమే కారణమనే నమ్మకం బోనాలు వేడుకకు నాంది పలికించింది. అందుకే అమ్మవారికి ఆగ్రహం రావడం అనే అంశాన్ని నేపథ్యంగా సాగిన సాఫ్ట్‌వేర్ సందడి ఆకట్టుకుంది.
 
సాగిన విధమిదీ..

సాక్షాత్తూ మహంకాళి అమ్మవారుగా మోనీ ప్రియ ఆగ్రహంతో ఊగిపోతే.. పోతురాజులుగా నర్సింహ, సందీప్‌లు శివాలెత్తారు. పండుగ సంబురాలకు హాజరయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్రలో కిషోర్‌కుమార్ ఒదిగిపోయారు. వీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే.. జంటనగరాల బోనాల సందడిని ప్రతిబింబింపజేయడానికి ఒక లేడీ ఎస్సై పాత్రను సైతం ఒక మహిళా ఉద్యోగి చేత ధరింపజేశారు. సమూహాన్ని నియంత్రించే పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. మరో ఇద్దరు పోలీసులు ఊరేగింపునకు ఎస్కార్ట్‌గా, మరో ఉద్యోగి పురోహితుడిగా మారిపోయారు. మహిళా ఉద్యోగినులు ఇళ్ల దగ్గర భక్తి శ్రద్ధలతో వండి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా ఈ బోనాల సందడి మొత్తం జంటనగరాల్లో జరిగే సిసలైన వేడుకను ప్రతిబింబించింది. మాయదారి మైసమ్మ అంటూ అన్నదమ్ములు నర్సింహ, సందీప్‌లు పోతురాజుల్లా చిందులేస్తుంటే నేపథ్యంలోని డ్రమ్స్ రిథిమ్‌కు సహచర సిబ్బంది కాలు కలపకుండా ఉండలేకపోయారు. ‘చరిత్రపై పూర్తి అవగాహన లేకున్నా ఆడియో-విజువల్-కమ్-లైవ్ పెర్ఫార్మెన్స్ ద్వారా అచ్చమైన బోనాలకు పట్టం కట్టడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించాం’ అని కంపెనీ ఉద్యోగి మౌనిక చెప్పారు.
 
వాట్సప్‌లో భవిష్యవాణి..

కొరడాలు ఝళిపిస్తూ, నడుముకు ఆకులు చుట్టుకుని డ్రమ్స్ దరువు, డప్పుల మోతలకు అనుగుణంగా చిందేస్తూ అమ్మవారి పాత్రలో మోనిప్రియ భవిష్యవాణి చెబుతున్నప్పుడు.. మన కంపెనీ ఫ్యూచర్ ఏమిటి అని ఒక ఉద్యోగి అడిగితే... వాట్సప్‌లో పంపిస్తానని బదులివ్వడం ఈ థీమ్‌లోని గాంభీర్యం నుంచి ఉపశమనం కలిగించింది. ఈ థీమ్‌ను అనుకున్నప్పుడు కొంచెం గాబరాపడ్డామని, కొరడాలు ఝళిపిస్తూ చిందులేయడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం వంటివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సాధ్యమేనా అని అనుమానించామని.. అయితే రంగంలోకి దిగిన దగ్గర్నుంచి పోటీపడుతూ ఎవరి పాత్రను వారు రక్తికట్టించడం విశేషమని నిర్వాహకుల్లో ఒకరైన ప్రవీణ్ అంటున్నారు.
 
రేపటి ఆచారానికి నాంది...

ఇదొక అద్భుతమైన అనుభవం అని ఈ ఈవెంట్‌కు హాజరైన విదేశీ ప్రతినిధులు వేడ్ ఫ్రీమ్యాన్, గాయ్రీ వెల్స్ చెప్పడం ఈ సందడి ఆకట్టుకున్న తీరుకు ఓ నిదర్శనం. ఈ బోనాల థీమ్‌ని కంపెనీకి చెందిన సీనియర్ ఐటీ అసోసియేట్  లోకేష్ డిజైన్ చేశారు. ‘ఈ థీమ్ కాన్సెప్టులైజేషన్, ఎగ్జిక్యూషనంతా కేవలం మూడు రోజుల్లో పూర్తయింది. దీని కోసం 25 మంది సిబ్బంది విభిన్న అవసరాల రీత్యా పాత్రధారులుగా మారారు’ అని చెప్పారాయన. ఆధునిక వ్యవస్థ కోసం నిన్నటి ఆచారాన్ని కళ్లకు కట్టిన ఈ ఐటీ ఉద్యోగులు ఇకపై సాఫ్ట్‌వేర్ ప్రాంగణాల్లోనూ బోనాల సందడిని ఒక ఆచారంగా మార్చడానికి నాంది పలికారు.
 
పోతురాజు కథ తెలీదు..
అసలు పోతురాజంటే ఏమిటో, దాని వెనుక ఉన్న క థ ఏమిటో తెలీదు. అలాంటిది సడెన్‌గా నన్ను ఆ పాత్ర పోషించమని అడిగితే... తొలుత ఇబ్బంది పడ్డాను. అయితే లోకేష్ (నిర్వాహక కమిటీ ప్రతినిధి) నాకు వివరించి చెప్పడంతో ఒప్పుకున్నాను. పలు దఫాలు రిహార్సల్స్ తర్వాత ఈవెంట్‌లో సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాను.
- నరసింహ
 
 గొప్ప అవకాశం..
పోతురాజు పాత్ర పోషించడం మరువలేని అనుభూతి ఇచ్చింది. ఇదొక గమ్మత్తయిన అనుభూతి. ఈ అవకాశం ఇచ్చిన రిక్రియేషన్ కమిటీకి థ్యాంక్స్.
 - సందీప్
 
అంతా అమ్మవారి కృప..
గతంలో నేను పాశ్చాత్య నృత్యాలు ప్రదర్శించాను. అయితే ఎప్పుడూ నాకు సరైన గుర్తింపు లభించలేదు. అమ్మవారిగా ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఈ పాత్ర నేను పోషించడం, దీనికి  నలుగురి ప్రశంసలు లభించడం అంతా అమ్మవారి కృపే అనుకుంటున్నాను.
 - ప్రవల్లిక
 
తమిళం నా భాష..
నా మాతృభాష తమిళం. కుండ తల మీద బ్యాలెన్స్ చేసుకోవడం వంటి ఫీట్లు ఉన్నాయి. భవిష్యవాణి చెప్పేటప్పుడు ఫ్యూచర్ గురించి జనం ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? వాటికి సమాధానాలు ఎలా ఉండాలి? వంటివన్నీ నేను స్వయంగా స్క్రిప్ట్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. పదేళ్లుగా ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ఈ పాత్ర తాలూకు అనుభూతి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
 - మోనీప్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement