poturaju
-
ఫలించిన పోతురాజు పోరాటం
– సాగుభూమిని రిజిస్టర్ చేసే విధంగా కలెక్టర్ ఆదేశాలు – దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు కర్నూలు (హాస్పిటల్)/రుద్రవరం: తమ కుటుంబం 80 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇతరులు ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ పోతురాజు చేసిన పోరాటం ఫలించింది. సాగుభూమిని బాధితుని కుటుంబానికి రిజిస్టర్ చేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ రుద్రవరం తహసీల్దార్నుఆదేశించారు. తన భూమిని తనకు ఇప్పించాలంటూ దళిత రైతు కిరణ్ బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో క్రిమసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి విదితమే. ఈ విషయమై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం చేసింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణతో కలిసి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోతురాజు కిరణ్‌ను పరామర్శించారు. ఆలమూరులో దాడికి సంబంధించిన ఉదంతాన్ని కలెక్టర్, ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.10వేలు చెల్లించాలని ఆర్డీఓ రఘుబాబును కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం వారు సాగు చేసుకుంటున్న భూమిని వారికే చెందేటట్లు రిజిస్టర్ చేయాలని చెప్పారు. కిరణ్‌పై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి సూచించారు. -
అంగ రంగ వైభవం
సాక్షి, సిటీబ్యూరో: అంబారీపై అమ్మవారి ఊరేగింపు..పోతురాజుల విన్యాసాలు...కళాకారుల ప్రదర్శనలు..ఫలహారం బండ్ల ఊరేగింపు... అశేష భక్తజన వాహిని కోలాహలం మధ్య సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సోమవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు రంగం వైభవంగా నిర్వహించారు. -
ఏడుగురు తల్లుల ముద్దుల తమ్ముడు
చార్మినార్: తెలంగాణ ప్రాంతంలో జరిగే ఆషాఢ మాసం బోనాల జాతరకు ఎంతో ప్రత్యేకత ప్రాధాన్యత ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో తప్పనిసరిగా ఉండేది ‘పోతురాజు’ విన్యాసాలు. ఉత్సవం సాగుతుంటే ముందు వరుసలో పోతురాజుల ఆటలు ఉంటాయి. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. నిజాం పాలనలో ఈ ఆటలతో గుర్తింపు పొంది బహుమానాలు అందుకున్నవారు కూడా ఉన్నారు. అప్పట్లో మీరాలంమండి మహంకాళి దేవాలయానికి పోతురాజుగా వ్యవహరించిన కాసుల పెంటయ్య నిజాం ప్రభువు నుంచి బంగారు పతకంతో సత్కారం అందుకున్నాడు. బోనాల జాతరలో పోతురాజే ప్రధాన ఆకర్షణ. అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు పోతురాజు చేసే నృత్యాలు, కొరడా విన్యాసాలు అందరినీ అలరిస్తాయి. అమ్మవార్ల సోదరుడు.. జనబాహుళ్యంలో ఉన్న కథనం ప్రకారం.. అమ్మవార్లు ఏడుగురు అక్కచెల్లెళ్లు. వీరందరికీ ముద్దుల తమ్ముడు ఈ పోతురాజు. అమ్మవారిని పొలిమేర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తుంటాడు. ఆయన సూచించిన మార్గంలో అమ్మవారు నడుస్తూ ఆలయానికి తరలి వస్తారు. పోతురాజు వేషధారణ దీక్షతో కూడుకున్నది. ఘటాలను ఆలయంలో ప్రతిష్టించిన నాటి నుంచి దీక్షతో ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. పోతురాజు వేషధారణలో ఉన్నవారు శాంతి అయ్యే వరకు ఎలాంటి మత్తు పదార్థాలను కాని ఆహారాన్ని కాని తీసుకోరు. పోతురాజు కొరడా దెబ్బలను తింటే దుష్టశక్తులు ఆవహించవని భక్తుల నమ్మకం. వేషధారణ వంశ పారంపర్యం.. నగరంలో కొన్ని కుటుంబాల వారే పోతురాజులుగా వంశ పారంపర్యంగా వ్యవహరిస్తున్నారు. పాతబస్తీ డబీర్‌పురాకు చెందిన పోతురాజుల కుటుంబం 1908 నుంచి కొనసాగుతోంది. నిజాం కాలంలో ఏర్పుల బాబయ్య పోతురాజుగా వ్యవహరించారు. ఆయన శిషు్యలు కాసుల పెంటయ్య, జంగులయ్య, రాజయ్య, చెన్నయ్య, గోదాం పెంటయ్య పోతురాజులుగా కొనసాగారు. వీరి తర్వాత ఈ కుటుంబానికి చెందిన శివ, లక్ష్మణ్, మల్లేష్, సత్యనారాయణ, రాము, నరేందర్ తదితరులు ప్రస్తుతం పోతురాజులుగా ఆషాఢమాసం బోనాల జాతరలో పాల్గొంటున్నారు. -
కాపీ హాసన్!
ఆ సీన్ - ఈ సీన్ ‘పంచతంత్రం’... రిటన్ బై కమల్ హాసన్. ‘పోతురాజు’... డెరెక్టైడ్ బై కమల్ హాసన్. విశ్వనాయకుడు ముఖ్యపాత్రల్లో నటించి రూపొందించిన సినిమాలు ఇవి. మొదటిది 2002లో వచ్చింది. మరోటి 2004లో వచ్చింది. ఇవి సూపర్‌హిట్ సినిమాలు. ఇంకో పోలిక ఏమిటంటే.. రెండు సినిమాల్లోనూ విదేశీ సినిమాల ప్రభావం కనిపిస్తుంది. కమల్ విదేశీ సినిమాల స్ఫూర్తితో సినిమాలు రూపొందిస్తాడనే వాదనకు బలాన్ని ఇస్తాయివి. అయితే కమల్ ఎలాంటి కథనైనా లోకలైజ్ చేయగలడు.. మూలాల ప్రభావం లేకుండా తన సృజనాత్మకతను చాటగలడు అనే మాటకు కూడా రుజువులు ఈ సినిమాలు. తమిళనాడు గ్రామీణ సంప్రదాయాలను కళ్లకు కట్టిన సినిమా ‘పోతురాజు’. తమిళంలో ‘వీరుమాండి’ పేరుతో రూపొందిన ఈ సినిమా అంతర్లీనంగా ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఉరిశిక్షపై గొప్ప చర్చలా సాగుతుంది. అత్యంత వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఉరి రద్దు డిమాండ్‌ను వినిపించే కమల్ దర్శకత్వ ప్రతిభకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. ఈ అద్భుత సినిమా కథ, కథనాల క్రెడిట్ పూర్తిగా కమల్‌కే దక్కుతాయి. అయితే ఈ కథా కథనాలను వినిపించే విధానంలోనే కమల్‌పై ‘రషోమన్ ఎఫెక్ట్’ కనిపిస్తుంది. జపాన్ దర్శకుడు అకిరా కురసోవా ‘రషోమన్’ సినిమా కథను చెప్పిన పద్ధతిలోనే కమల్ ‘పోతురాజు’ కథను వివరించాడు. ‘నీకు తెలిసింది ఒకటి.. నాకు తెలిసింది మరోటి.. అసలు నిజం ఇంకోటి’ అనే తాత్వికతను తెరపై ఆవిష్కరించేదే ‘రషోమన్ ఎఫెక్ట్’. అకిరా కురసోవా తన ‘రషోమన్’ స్క్రిప్ట్ విషయంలో తొలిసారి ఈ ప్రక్రియను అనుసరించాడు. దీంతో దీనికి రషోమన్ ఎఫెక్ట్‌గా పేరు. ఇదెలా ఉంటుందంటే పోతురాజు సినిమాలో చూపినట్టుగా... మొదట కథ అంతా విలన్ పశుపతి పాత్ర ద్వారా చెప్పిస్తారు. ఆ తర్వాత అవే సంఘటనల గురించి కమల్ చేసిన పోతురాజు పాత్ర చేత చెప్పిస్తారు. పరస్పర విరుద్ధమైన తీరున కథను వివరిస్తాయి ఆ పాత్రలు. 1950లో వచ్చిన రషోమన్ సినిమాతో ఇలా కథను వివరించాడు అకిరా. తర్వాత ఆ పద్ధతిని అనుకరిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిలో ‘పోతురాజు’ కూడా ఒకటి. ఇక్కడ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే.. కథ చెప్పే విధానంలో కమల్ అకిరాను ఫాలో అయ్యాడేమో కానీ, అసలు కథ, కథనాల విషయంలో మాత్రం అణువణువునా కమల్ శ్రమ కనిపిస్తుంది. అది పోతురాజు వెనుక ఉన్న కథ. ఇక ‘పంచతంత్రం’ సంగతి. ఐదుగురు స్నేహితులు. ఉల్లాసంగా గడపడానికి బయలుదేరతారు. బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఒక కాల్గాళ్తో ఆనందించాలనేది వారి ప్రణాళిక. ఈ ప్రయత్నంలో వారు అనుకోని చిక్కుల్లో పడతారు. ఈ చిన్న పాయింట్‌ను మాత్రమే అమెరికన్ సినిమా ‘వెరీ బ్యాడ్ థింగ్స్’ నుంచి తెచ్చుకొన్నారు కమల్. దాన్ని గొప్ప కామెడీ ఎంటర్ టైనర్‌గా మార్చి లోకలైజ్ చేస్తూ ‘పంచ తంత్రం’ కథను తీర్చిదిద్దాడు. ఎలాంటి బ్యాడ్ మూడ్‌నైనా మార్చేసి మనసును తేలిక పరిచే సినిమా ‘పంచతంత్రం’. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో కమల్‌తో సహా నలుగురు దక్షిణాది నటులు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ఇది. ఆద్యంతం నవ్వులు పండించే ఈ సినిమాకు కమల్, క్రేజీ మోహన్‌లు రచ నా బాధ్యతలు తీసుకున్నారు. ‘వెరీ బ్యాడ్ థింగ్స్’ అనేది ఒక ట్రాజెడీ మూవీ. అయితే పంచతంత్రం మాత్రం ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ట్రీట్మెంట్ విషయంలో రెండు సినిమాలకూ ఎక్కడా పోలిక ఉండదు. అయితే మూల కథ కాపీ అనే ముద్ర మాత్రం మిగిలిపోయింది. - బి.జీవన్‌రెడ్డి -
హత్యచేసి తలతీసుకెళ్లారు
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ పినకిల్తారి గ్రామానికి చెందిన వంజరి పోతురాజు (45) ఆదివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. అతడిని హత్య చేసినవాళ్లు తలను నరికి తీసుకెళ్లారు. జి.మాడుగుల-నర్సీపట్నం రోడ్డులో పినకిల్తారి,పెదకిల్తారి జంక్షన్ కర్రిమామిడి వద్ద ఈ మొండేన్ని సోమవారం ఉదయం కనుగొన్నారు. పోతురాజుకు ఇంకా పెళ్లి కాలేదు. మద్యం తాగే అలవాటు ఉంది. అన్నయ్య కొడుకు వంజరి నాయుడుతో కలసి జీవిస్తున్నాడు. రోజూ గ్రామంలో ఎవరో ఒకరి ఇంటి వద్ద నిద్రపోతుంటాడని తెలుస్తోంది. -
ఘన టెకీ..బోనమెత్తి..
ఒంటినిండా పసుపు పూసుకుని.. కాళ్లకు గజ్జెలు కట్టుకుని.. జుట్టు అమాంతం వెనక్కి లాగి కట్టి.. నిక్కరు తరహాలో పంచె ఎగ్గట్టి, తనంత ఎత్తున్న కొరడా చేత పట్టి..‘హుహ్హహ్హ’ అని హూంకరిస్తూ.. మెలితిరిగిన మీసాలతో ‘మాయదారి మైసమ్మ’ పాడుతూ చిందులేస్తుంటే.. చూపరులు కళ్లార్పడంమరచిపోయారు. కంప్యూటర్లు తప్ప వీళ్లకేం తెలుసనుకున్న నోళ్లు మూతపడటం మరచిపోయాయి. సిటీలో తొలిసారి సాఫ్ట్వేర్ నిపుణులు బోనాలు థీమ్‌తో ప్రదర్శించిన నృత్యహేల.. ఐటీ సర్కిల్లో హాట్ టాపిక్. ..:: ఎస్.సత్యబాబు/వాంకె శ్రీనివాస్ బోనమెత్తుకు నడిచే మహిళా జన తరంగం.. పోతురాజుల వీ‘రంగం’.. నారీమణి వినిపించే భవిష్యవాణి .. అందులో భాగంగా ఆటలు, పాటలు.. ఇవ న్నీ రాష్ట్ర సంస్కృతిలో భాగం. పొద్దున్న లేస్తే కంప్యూటర్లతో కుస్తీపట్టే నవజనానికి బోన‘భాగ్యాలు’ ఏం తెలుస్తాయ్? అని నిట్టూర్చేవారే ఆశ్చర్యపోయేలా చేశారా సాఫ్ట్వేర్ నిపుణులు. డీఎస్టీ ఇండియా ఉద్యోగుల వార్షిక సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన తెలంగాణ జానపద సంబురాలు.. ఆద్యంతం ఆచార వ్యవహారలపై టెకీలకు ఉన్న ఆసక్తిని కళ్లకుకట్టాయి. ఆధునికత ఒంటబట్టినా.. ఆచారం వెనుకబడదని చాటి చెప్పాయి. నేపథ్యమిదీ.. ఐటీ కంపెనీలు ఈవెంట్స్ నిర్వహించడం మామూలే. పాప్ డ్యాన్సులు, ఫ్యాషన్ షోలు, రాక్‌బ్యాండ్స్, క్విజ్లు, బ్యూటీ కాంటెస్ట్‌లు.. ఈ హడావిడి తెలిసిందే. అయితే ఐటీ ఈవెంట్లో ‘బోనాలు’ భాగం కావడం మాత్రం ఇదే తొలిసారి. దీనికి కారణం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాది ఇది. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి, విదేశీయులకు తమ సంస్కృతీ సంప్రదాయాల్లోని గాఢతను, వాటిపై తమకు ఉన్న గౌరవాన్ని తెలియజెప్పాలి అనుకోవడమే ఈ ఈవెంట్ ఉద్దేశమని నిర్వాహకులు చెప్పారు. జంటనగరాల్లో 1869లో అంటువ్యాధి కారణంగా ఎంతో మంది చనిపోతే.. దానికి అమ్మవారి ఆగ్రహమే కారణమనే నమ్మకం బోనాలు వేడుకకు నాంది పలికించింది. అందుకే అమ్మవారికి ఆగ్రహం రావడం అనే అంశాన్ని నేపథ్యంగా సాగిన సాఫ్ట్వేర్ సందడి ఆకట్టుకుంది. సాగిన విధమిదీ.. సాక్షాత్తూ మహంకాళి అమ్మవారుగా మోనీ ప్రియ ఆగ్రహంతో ఊగిపోతే.. పోతురాజులుగా నర్సింహ, సందీప్‌లు శివాలెత్తారు. పండుగ సంబురాలకు హాజరయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్రలో కిషోర్‌కుమార్ ఒదిగిపోయారు. వీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే.. జంటనగరాల బోనాల సందడిని ప్రతిబింబింపజేయడానికి ఒక లేడీ ఎస్సై పాత్రను సైతం ఒక మహిళా ఉద్యోగి చేత ధరింపజేశారు. సమూహాన్ని నియంత్రించే పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. మరో ఇద్దరు పోలీసులు ఊరేగింపునకు ఎస్కార్ట్‌గా, మరో ఉద్యోగి పురోహితుడిగా మారిపోయారు. మహిళా ఉద్యోగినులు ఇళ్ల దగ్గర భక్తి శ్రద్ధలతో వండి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా ఈ బోనాల సందడి మొత్తం జంటనగరాల్లో జరిగే సిసలైన వేడుకను ప్రతిబింబించింది. మాయదారి మైసమ్మ అంటూ అన్నదమ్ములు నర్సింహ, సందీప్‌లు పోతురాజుల్లా చిందులేస్తుంటే నేపథ్యంలోని డ్రమ్స్ రిథిమ్కు సహచర సిబ్బంది కాలు కలపకుండా ఉండలేకపోయారు. ‘చరిత్రపై పూర్తి అవగాహన లేకున్నా ఆడియో-విజువల్-కమ్-లైవ్ పెర్ఫార్మెన్స్ ద్వారా అచ్చమైన బోనాలకు పట్టం కట్టడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించాం’ అని కంపెనీ ఉద్యోగి మౌనిక చెప్పారు. వాట్సప్‌లో భవిష్యవాణి.. కొరడాలు ఝళిపిస్తూ, నడుముకు ఆకులు చుట్టుకుని డ్రమ్స్ దరువు, డప్పుల మోతలకు అనుగుణంగా చిందేస్తూ అమ్మవారి పాత్రలో మోనిప్రియ భవిష్యవాణి చెబుతున్నప్పుడు.. మన కంపెనీ ఫ్యూచర్ ఏమిటి అని ఒక ఉద్యోగి అడిగితే... వాట్సప్‌లో పంపిస్తానని బదులివ్వడం ఈ థీమ్‌లోని గాంభీర్యం నుంచి ఉపశమనం కలిగించింది. ఈ థీమ్‌ను అనుకున్నప్పుడు కొంచెం గాబరాపడ్డామని, కొరడాలు ఝళిపిస్తూ చిందులేయడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం వంటివి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సాధ్యమేనా అని అనుమానించామని.. అయితే రంగంలోకి దిగిన దగ్గర్నుంచి పోటీపడుతూ ఎవరి పాత్రను వారు రక్తికట్టించడం విశేషమని నిర్వాహకుల్లో ఒకరైన ప్రవీణ్ అంటున్నారు. రేపటి ఆచారానికి నాంది... ఇదొక అద్భుతమైన అనుభవం అని ఈ ఈవెంట్‌కు హాజరైన విదేశీ ప్రతినిధులు వేడ్ ఫ్రీమ్యాన్, గాయ్రీ వెల్స్ చెప్పడం ఈ సందడి ఆకట్టుకున్న తీరుకు ఓ నిదర్శనం. ఈ బోనాల థీమ్‌ని కంపెనీకి చెందిన సీనియర్ ఐటీ అసోసియేట్ లోకేష్ డిజైన్ చేశారు. ‘ఈ థీమ్ కాన్సెప్టులైజేషన్, ఎగ్జిక్యూషనంతా కేవలం మూడు రోజుల్లో పూర్తయింది. దీని కోసం 25 మంది సిబ్బంది విభిన్న అవసరాల రీత్యా పాత్రధారులుగా మారారు’ అని చెప్పారాయన. ఆధునిక వ్యవస్థ కోసం నిన్నటి ఆచారాన్ని కళ్లకు కట్టిన ఈ ఐటీ ఉద్యోగులు ఇకపై సాఫ్ట్వేర్ ప్రాంగణాల్లోనూ బోనాల సందడిని ఒక ఆచారంగా మార్చడానికి నాంది పలికారు. పోతురాజు కథ తెలీదు.. అసలు పోతురాజంటే ఏమిటో, దాని వెనుక ఉన్న క థ ఏమిటో తెలీదు. అలాంటిది సడెన్‌గా నన్ను ఆ పాత్ర పోషించమని అడిగితే... తొలుత ఇబ్బంది పడ్డాను. అయితే లోకేష్ (నిర్వాహక కమిటీ ప్రతినిధి) నాకు వివరించి చెప్పడంతో ఒప్పుకున్నాను. పలు దఫాలు రిహార్సల్స్ తర్వాత ఈవెంట్లో సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాను. - నరసింహ గొప్ప అవకాశం.. పోతురాజు పాత్ర పోషించడం మరువలేని అనుభూతి ఇచ్చింది. ఇదొక గమ్మత్తయిన అనుభూతి. ఈ అవకాశం ఇచ్చిన రిక్రియేషన్ కమిటీకి థ్యాంక్స్. - సందీప్ అంతా అమ్మవారి కృప.. గతంలో నేను పాశ్చాత్య నృత్యాలు ప్రదర్శించాను. అయితే ఎప్పుడూ నాకు సరైన గుర్తింపు లభించలేదు. అమ్మవారిగా ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఈ పాత్ర నేను పోషించడం, దీనికి నలుగురి ప్రశంసలు లభించడం అంతా అమ్మవారి కృపే అనుకుంటున్నాను. - ప్రవల్లిక తమిళం నా భాష.. నా మాతృభాష తమిళం. కుండ తల మీద బ్యాలెన్స్ చేసుకోవడం వంటి ఫీట్లు ఉన్నాయి. భవిష్యవాణి చెప్పేటప్పుడు ఫ్యూచర్ గురించి జనం ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? వాటికి సమాధానాలు ఎలా ఉండాలి? వంటివన్నీ నేను స్వయంగా స్క్రిప్ట్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. పదేళ్లుగా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ఈ పాత్ర తాలూకు అనుభూతి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. - మోనీప్రియ -
రాజీవ్‌నగర్‌లో పూరిల్లు దగ్ధం
ములకలపల్లి, న్యూస్‌లైన్: విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా ఓ పూరిల్లు కాలిబూడిద కాగా మరో ఇల్లు పాక్షికంగా దగ్ధమైన సంఘటన మండలంలోని రాజీవ్‌నగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తిమ్మంపేట పంచాయతీలోని రాజీవ్‌నగర్ గ్రామానికి చెందిన తుర్రం వీరస్వామి పూరింట్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వీరాస్వామికి చెందిన 8 క్వింటాల పత్తి, 25 బస్తాల ధాన్యం, రూ.10 వేల నగదు, వంట సామగ్రి, దుస్తులు కాలిబూడిదయ్యాయి. మొత్తం రూ. 80 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వీరాస్వామి తెలిపాడు. ఈ మంటలు పక్కనే ఉన్న ఊకె పోతురాజు ఇంటికి కూడా వ్యాపించడంతో ఆ ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని తహశీల్దార్ రమాదేవి సందర్శించి పంచనామా నిర్వహించారు. తక్షణసాయంగా వీరస్వామికి రూ. 5 వేలు, పోతురాజుకు రూ.4 వేల నగదు, 10 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఎస్సై ఎం. రాజు, స్థానిక సర్పంచ్ కారం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల నాయకులు తాండ్ర కృపాకర్, ఆదివాసీ చైతన్య సమాఖ్య నాయకుల సోడె కేశవరావు బాధితులను పరామర్శించారు.