బోనాల జాతరలో పోతతురాజులు
చార్మినార్: తెలంగాణ ప్రాంతంలో జరిగే ఆషాఢ మాసం బోనాల జాతరకు ఎంతో ప్రత్యేకత ప్రాధాన్యత ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో తప్పనిసరిగా ఉండేది ‘పోతురాజు’ విన్యాసాలు. ఉత్సవం సాగుతుంటే ముందు వరుసలో పోతురాజుల ఆటలు ఉంటాయి. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. నిజాం పాలనలో ఈ ఆటలతో గుర్తింపు పొంది బహుమానాలు అందుకున్నవారు కూడా ఉన్నారు. అప్పట్లో మీరాలంమండి మహంకాళి దేవాలయానికి పోతురాజుగా వ్యవహరించిన కాసుల పెంటయ్య నిజాం ప్రభువు నుంచి బంగారు పతకంతో సత్కారం అందుకున్నాడు. బోనాల జాతరలో పోతురాజే ప్రధాన ఆకర్షణ. అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు పోతురాజు చేసే నృత్యాలు, కొరడా విన్యాసాలు అందరినీ అలరిస్తాయి.
అమ్మవార్ల సోదరుడు..
జనబాహుళ్యంలో ఉన్న కథనం ప్రకారం.. అమ్మవార్లు ఏడుగురు అక్కచెల్లెళ్లు. వీరందరికీ ముద్దుల తమ్ముడు ఈ పోతురాజు. అమ్మవారిని పొలిమేర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తుంటాడు. ఆయన సూచించిన మార్గంలో అమ్మవారు నడుస్తూ ఆలయానికి తరలి వస్తారు. పోతురాజు వేషధారణ దీక్షతో కూడుకున్నది. ఘటాలను ఆలయంలో ప్రతిష్టించిన నాటి నుంచి దీక్షతో ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. పోతురాజు వేషధారణలో ఉన్నవారు శాంతి అయ్యే వరకు ఎలాంటి మత్తు పదార్థాలను కాని ఆహారాన్ని కాని తీసుకోరు. పోతురాజు కొరడా దెబ్బలను తింటే దుష్టశక్తులు ఆవహించవని భక్తుల నమ్మకం.
వేషధారణ వంశ పారంపర్యం..
నగరంలో కొన్ని కుటుంబాల వారే పోతురాజులుగా వంశ పారంపర్యంగా వ్యవహరిస్తున్నారు. పాతబస్తీ డబీర్‌పురాకు చెందిన పోతురాజుల కుటుంబం 1908 నుంచి కొనసాగుతోంది. నిజాం కాలంలో ఏర్పుల బాబయ్య పోతురాజుగా వ్యవహరించారు. ఆయన శిషు్యలు కాసుల పెంటయ్య, జంగులయ్య, రాజయ్య, చెన్నయ్య, గోదాం పెంటయ్య పోతురాజులుగా కొనసాగారు. వీరి తర్వాత ఈ కుటుంబానికి చెందిన శివ, లక్ష్మణ్, మల్లేష్, సత్యనారాయణ, రాము, నరేందర్ తదితరులు ప్రస్తుతం పోతురాజులుగా ఆషాఢమాసం బోనాల జాతరలో పాల్గొంటున్నారు.