Fashion shows
-
వైరల్ వీడియో: 68 మంది కవలలతో ఫ్యాషన్ షో
-
68 మంది కవలలతో ఫ్యాషన్ షో: వీడియో వైరల్
ఇప్పటి వరకు పలు రకాల ఫ్యాషన్ షోలు చూసి ఉంటాం. వాటిల్లో వారు ధరించిన బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ సాగేవి. ఇక్కడోక ఫ్యాషన్ షో మాత్రం అత్యంత విభిన్నంగా రూపొందించారు. మాగ్జిమమ్ ఎవరి ఇంట్లోనైనా ఇద్దరు అక్కచెల్లెళ్లు, లేదా అన్నాదమ్ములు లేదా కవలలు ఉంటే ఒకేలాంటి డ్రస్‌లు వేస్తారు. దీన్నే థీమ్‌గా తీసుకుని కవలలతో ఫ్యాషన్ షో నిర్వహించింది ఓ ప్రముఖ కంపెనీ వివరాల్లెకెళ్తే... ఈ షోలో ఇద్దరో లేదా ఐదోగురో కవలలు కాదు. ఏకంగా 68 మంది కవలలతో ఫ్యాషన్ షోని ప్రదర్శించారు. ఈ షోని ఇటాలియన్ దుస్తుల, జ్యువెలరీకి సంబంధించిన బ్రాండ్ గుస్సీ 'గుస్సీ ట్విన్బర్గ్' పేరుతో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించింది. అలెశాండ్రో మిచెల్ అనే ప్రముఖ డిజైనర్ 2022-23 స్ప్రింగ్ సమ్మర్ సీజన్ పేరిట మిలాన్ ఫ్యాషన్ షోలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. ఈ షోకి సంబంధించిన వీడియోలను గుస్సీ బ్రాండ్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట చేసింది. ఆ వీడియోలో ఒకే రకమైన దుస్తులు, జువైలరీని ధరించిన కవలల మోడళ్లు నడుస్తూ వస్తుంటారు. మిచెలల్ తన ఫ్యాషన్ షోలో పురాతన కాలం నాటి దుస్తులు, సింబల్స్‌ను ఉపయోగించి అప్పటి నాగరికతను ప్రతిబింబించేలా రూపొందించారు. పాతకాలం నాటి సినిమాల్లో ఉపయోగించిన దుస్తులను కూడా కవలల మోడళ్లు ఈ ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఈ వీడియోకి ఏడు వేలకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: పుతిన్ ప్రకటన సృష్టిస్తున్న ప్రకంపనం...గాయపడ్డ కమాండర్: వీడియో వైరల్) -
నిల్చునీ పనిచేస్తున్నారు..!
►వర్క్ కల్చర్‌ను మార్చేస్తున్న ►ఐటీ, స్టార్టప్ సంస్థలు ► పనితో పాటు ఉద్యోగుల ► ఆరోగ్యమూ ముఖ్యమే ► అందుకే ఉద్యోగులకు పెట్టే ఫుడ్ విషయంలోనూ శ్రద్ధ ► ఆఫీసులోనే ఫ్యాషన్ షోలు.. ► ప్రొడక్ట్ లాంచింగ్‌లు కూడా... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ ఉద్యోగం.. అంటే ముందుగా గుర్తొచ్చేది ‘‘గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవటం. ఒత్తిడితో కూడిన జాబ్. వీకెండ్స్ పార్టీలు’’. కానీ ఇపుడీ జాబితాను సవరించక తప్పదు. ఎందుకంటే ‘గంటల తరబడి కూర్చోవటం’ అనేదిపుడు తగ్గుతోంది. ఎందుకంటే నడుస్తూ పనిచేయడం, సమావేశాల్లో ఆసాంతం నిల్చునే ఉండటం వంటివి చేరుతున్నాయి. ఫ్యాషన్ షోలు, ప్రొడక్ట్ లాంచింగ్లూ దీనికి తోడవుతున్నాయి. ఉద్యోగుల మానసికోల్లాసం కోసం ఆఫీసులోనే జిమ్, మెడిటేషన్, యోగ వంటి సెంటర్లనూ ఏర్పాటు చేస్తున్నాయి యాజమాన్యాలు. ఉద్యోగుల పనితీరనేది వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది కనక బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి మెట్రోల్లోని ఐటీ, స్టార్టప్ కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. యాహూ, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సిస్కో, క్యాపిటల్ ఐక్యూ, ప్రొగ్రెసివ్ వంటి సంస్థలు దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పాశ్యాత్య దేశాల్లో మాదిరి కూర్చొని పనిచేసే బదులు.. నిల్చుని పనిచేసే సంస్కృతికి తెరలేపాయి. గంటల తరబడి ఒకే సీట్లో కూర్చొని పనిచేయడం బదులు నిల్చుని పనిచేయటాన్ని ఉద్యోగులు బాగా ఇష్టపడుతున్నారని చెప్పారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్ రమేష్ లోగనాథన్. ‘‘అదే పనిగా కూర్చొని పనిచేసి ఉద్యోగులు కనక అలసిపోతే నిల్చునో, అటూ ఇటూ తిరుగుతూనే పనిచేసేందుకు మా సంస్థలో అనుమతి ఉంది’’ అన్నారు బ్రాడ్రిజ్డ్ సంస్థ సీనియర్ అనాలసిస్ట్ జి.అరవింద్‌కుమార్. ‘‘కొందరికి ఎక్కువ సేపు కూర్చుంటే నడుం పట్టేయటం, ఒత్తిడికి గురవటం జరుగుతాయి. ఇలాంటివేమీ లేకుండా ఉద్యోగులు తమకు నచ్చినట్లు.. నచ్చిన రీతిలో పనిచేసే వీలు కల్పించడమే మంచిది’’ అన్నారాయన. గంట నిల్చుంటే 132 క్యాలరీలు ఖర్చు... బెంగళూరులోని గూగుల్ సంస్థ తమ ఉద్యోగుల ఇష్ట ప్రకారం వారికి నిల్చుని పనిచేయటంతో పాటు నిల్చునే చిన్న చిన్న మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ‘‘గంటల కొద్ది కూర్చొని మీటింగ్‌లో పాల్గొనాలంటే బోర్. నిజం చెప్పాలంటే నిద్రొస్తుంది. అదే నిల్చుని మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లంటే ఆసక్తిగా ఉంటుంది’’ అని గూగుల్ ఉద్యోగి ఒకరు అభిప్రాయపడ్డారు. అందుకే నిల్చుని మీటింగ్‌లు నిర్వహించుకునేందుకు అనువైన టేబుళ్లు, డెస్క్‌లు, క్యాబిన్లు, ర్యాకుల్ని తమ సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. గంట సేపు నిలబడి పనిచేస్తే 132 క్యాలరీలు కరుగుతాయని వైద్యులూ చెబుతున్నారు మరి. భాగ్యనగరం మరో అడుగు ముందుకు.. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు మరో అడుగు ముందుకేసి ఉద్యోగుల ఫిట్నెస్ కోసం ఆఫీసుల్లోనే జిమ్, యోగా, మెడిటేషన్, రిక్రియేషన్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటితో పాటు ఫిట్నెస్ ట్రైనర్లనూ నియమిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తమకు వీలుదొరికినప్పుడు హాయిగా వ్యాయామాల్లో మునిగిపోతారని తెలంగాణ ఐటీ జాక్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి చెప్పారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగించడానికి ఆఫీసు ప్రాంగణంలోనే స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీ తదితర ఏర్పాట్లు ఎలాగూ ఉన్నాయి. హైదరాబాద్‌లో సుమారు 40కి పైగా ఐటీ పార్కులు.. 1,200కి పైగా ఐటీ సంస్థల్లో 3.5 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. తిండిలోనూ లెక్కలు.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌లో భాగంగా ఉద్యోగుల భోజనం విషయంలోనూ ఐటీ కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. ఆఫీసు క్యాంటీన్లో వండిన పదార్థాల్లో ఒక్కొక్కటీ ఎన్ని క్యాలరీలను కలిగి ఉంటుందనే విషయాన్ని తెలిపే బోర్డుల్ని ఏర్పా టు చేస్తున్నాయి. అంతేకాక కాస్త క్యా లరీలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకున్న రోజున ఎక్సర్సైజు సమయాన్ని పెంచేలా ఫిట్నెస్ ట్రైనర్లూ సలహాలిస్తున్నారు. భార్యభర్తలకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఒకే సంస్థలో భార్యాభర్తలిద్దరూ పనిచేస్తుంటే వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఎందుకిలా అని అడిగితే... ఇద్దరూ ఒకే ఆఫీసులో ఉంటే వారు పెట్టే సెలవులు తగ్గుతాయట. చాటిం గ్లు, మీటింగ్‌లు అంటూ ఆఫీసులోని ఇతర ఉద్యోగులతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే పద్ధతికి వీరు దూరంగా ఉంటారట. సంస్థ గురించిన ఏ విషయాన్నైనా ఇద్దరూ చర్చిస్తారు కనక మెరుగైన ఫలితాలు పొందే అవకాశమూ ఉందనేది యాజమాన్యాల వాదన. ఆఫీసుల్లోనే ఫ్యాషన్ షోలు.. వీకెండ్ పార్టీలు, గెట్ టు గెదర్‌ల స్థానంలో ఆఫీసు ప్రాంగణంలో ఫ్యాషన్ షోలు, ప్రొడక్ట్ లాంచింగ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి కొన్ని ఐటీ సంస్థలు. దీంతో సంస్థకు ఆదాయం రావటమే కాక ఉద్యోగులు ర్యాంప్‌పై నడుస్తూ సెలబ్రిటీలుగా ఫీలవుతున్నారు. సంగీతంతో ప్రశాంతత, ఉల్లాసం, ఒత్తిడి రాహిత్యం సాధ్యమవుతాయి కనక కొన్ని సంస్థలు ఆఫీసుల్లో ఆహ్లాదకరమైన సంగీతం వినిపించే ఏర్పాట్లూ చేశాయి మరి!!. -
ఘన టెకీ..బోనమెత్తి..
ఒంటినిండా పసుపు పూసుకుని.. కాళ్లకు గజ్జెలు కట్టుకుని.. జుట్టు అమాంతం వెనక్కి లాగి కట్టి.. నిక్కరు తరహాలో పంచె ఎగ్గట్టి, తనంత ఎత్తున్న కొరడా చేత పట్టి..‘హుహ్హహ్హ’ అని హూంకరిస్తూ.. మెలితిరిగిన మీసాలతో ‘మాయదారి మైసమ్మ’ పాడుతూ చిందులేస్తుంటే.. చూపరులు కళ్లార్పడంమరచిపోయారు. కంప్యూటర్లు తప్ప వీళ్లకేం తెలుసనుకున్న నోళ్లు మూతపడటం మరచిపోయాయి. సిటీలో తొలిసారి సాఫ్ట్వేర్ నిపుణులు బోనాలు థీమ్‌తో ప్రదర్శించిన నృత్యహేల.. ఐటీ సర్కిల్లో హాట్ టాపిక్. ..:: ఎస్.సత్యబాబు/వాంకె శ్రీనివాస్ బోనమెత్తుకు నడిచే మహిళా జన తరంగం.. పోతురాజుల వీ‘రంగం’.. నారీమణి వినిపించే భవిష్యవాణి .. అందులో భాగంగా ఆటలు, పాటలు.. ఇవ న్నీ రాష్ట్ర సంస్కృతిలో భాగం. పొద్దున్న లేస్తే కంప్యూటర్లతో కుస్తీపట్టే నవజనానికి బోన‘భాగ్యాలు’ ఏం తెలుస్తాయ్? అని నిట్టూర్చేవారే ఆశ్చర్యపోయేలా చేశారా సాఫ్ట్వేర్ నిపుణులు. డీఎస్టీ ఇండియా ఉద్యోగుల వార్షిక సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన తెలంగాణ జానపద సంబురాలు.. ఆద్యంతం ఆచార వ్యవహారలపై టెకీలకు ఉన్న ఆసక్తిని కళ్లకుకట్టాయి. ఆధునికత ఒంటబట్టినా.. ఆచారం వెనుకబడదని చాటి చెప్పాయి. నేపథ్యమిదీ.. ఐటీ కంపెనీలు ఈవెంట్స్ నిర్వహించడం మామూలే. పాప్ డ్యాన్సులు, ఫ్యాషన్ షోలు, రాక్‌బ్యాండ్స్, క్విజ్లు, బ్యూటీ కాంటెస్ట్‌లు.. ఈ హడావిడి తెలిసిందే. అయితే ఐటీ ఈవెంట్లో ‘బోనాలు’ భాగం కావడం మాత్రం ఇదే తొలిసారి. దీనికి కారణం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాది ఇది. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి, విదేశీయులకు తమ సంస్కృతీ సంప్రదాయాల్లోని గాఢతను, వాటిపై తమకు ఉన్న గౌరవాన్ని తెలియజెప్పాలి అనుకోవడమే ఈ ఈవెంట్ ఉద్దేశమని నిర్వాహకులు చెప్పారు. జంటనగరాల్లో 1869లో అంటువ్యాధి కారణంగా ఎంతో మంది చనిపోతే.. దానికి అమ్మవారి ఆగ్రహమే కారణమనే నమ్మకం బోనాలు వేడుకకు నాంది పలికించింది. అందుకే అమ్మవారికి ఆగ్రహం రావడం అనే అంశాన్ని నేపథ్యంగా సాగిన సాఫ్ట్వేర్ సందడి ఆకట్టుకుంది. సాగిన విధమిదీ.. సాక్షాత్తూ మహంకాళి అమ్మవారుగా మోనీ ప్రియ ఆగ్రహంతో ఊగిపోతే.. పోతురాజులుగా నర్సింహ, సందీప్‌లు శివాలెత్తారు. పండుగ సంబురాలకు హాజరయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్రలో కిషోర్‌కుమార్ ఒదిగిపోయారు. వీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే.. జంటనగరాల బోనాల సందడిని ప్రతిబింబింపజేయడానికి ఒక లేడీ ఎస్సై పాత్రను సైతం ఒక మహిళా ఉద్యోగి చేత ధరింపజేశారు. సమూహాన్ని నియంత్రించే పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. మరో ఇద్దరు పోలీసులు ఊరేగింపునకు ఎస్కార్ట్‌గా, మరో ఉద్యోగి పురోహితుడిగా మారిపోయారు. మహిళా ఉద్యోగినులు ఇళ్ల దగ్గర భక్తి శ్రద్ధలతో వండి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా ఈ బోనాల సందడి మొత్తం జంటనగరాల్లో జరిగే సిసలైన వేడుకను ప్రతిబింబించింది. మాయదారి మైసమ్మ అంటూ అన్నదమ్ములు నర్సింహ, సందీప్‌లు పోతురాజుల్లా చిందులేస్తుంటే నేపథ్యంలోని డ్రమ్స్ రిథిమ్కు సహచర సిబ్బంది కాలు కలపకుండా ఉండలేకపోయారు. ‘చరిత్రపై పూర్తి అవగాహన లేకున్నా ఆడియో-విజువల్-కమ్-లైవ్ పెర్ఫార్మెన్స్ ద్వారా అచ్చమైన బోనాలకు పట్టం కట్టడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించాం’ అని కంపెనీ ఉద్యోగి మౌనిక చెప్పారు. వాట్సప్‌లో భవిష్యవాణి.. కొరడాలు ఝళిపిస్తూ, నడుముకు ఆకులు చుట్టుకుని డ్రమ్స్ దరువు, డప్పుల మోతలకు అనుగుణంగా చిందేస్తూ అమ్మవారి పాత్రలో మోనిప్రియ భవిష్యవాణి చెబుతున్నప్పుడు.. మన కంపెనీ ఫ్యూచర్ ఏమిటి అని ఒక ఉద్యోగి అడిగితే... వాట్సప్‌లో పంపిస్తానని బదులివ్వడం ఈ థీమ్‌లోని గాంభీర్యం నుంచి ఉపశమనం కలిగించింది. ఈ థీమ్‌ను అనుకున్నప్పుడు కొంచెం గాబరాపడ్డామని, కొరడాలు ఝళిపిస్తూ చిందులేయడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం వంటివి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సాధ్యమేనా అని అనుమానించామని.. అయితే రంగంలోకి దిగిన దగ్గర్నుంచి పోటీపడుతూ ఎవరి పాత్రను వారు రక్తికట్టించడం విశేషమని నిర్వాహకుల్లో ఒకరైన ప్రవీణ్ అంటున్నారు. రేపటి ఆచారానికి నాంది... ఇదొక అద్భుతమైన అనుభవం అని ఈ ఈవెంట్‌కు హాజరైన విదేశీ ప్రతినిధులు వేడ్ ఫ్రీమ్యాన్, గాయ్రీ వెల్స్ చెప్పడం ఈ సందడి ఆకట్టుకున్న తీరుకు ఓ నిదర్శనం. ఈ బోనాల థీమ్‌ని కంపెనీకి చెందిన సీనియర్ ఐటీ అసోసియేట్ లోకేష్ డిజైన్ చేశారు. ‘ఈ థీమ్ కాన్సెప్టులైజేషన్, ఎగ్జిక్యూషనంతా కేవలం మూడు రోజుల్లో పూర్తయింది. దీని కోసం 25 మంది సిబ్బంది విభిన్న అవసరాల రీత్యా పాత్రధారులుగా మారారు’ అని చెప్పారాయన. ఆధునిక వ్యవస్థ కోసం నిన్నటి ఆచారాన్ని కళ్లకు కట్టిన ఈ ఐటీ ఉద్యోగులు ఇకపై సాఫ్ట్వేర్ ప్రాంగణాల్లోనూ బోనాల సందడిని ఒక ఆచారంగా మార్చడానికి నాంది పలికారు. పోతురాజు కథ తెలీదు.. అసలు పోతురాజంటే ఏమిటో, దాని వెనుక ఉన్న క థ ఏమిటో తెలీదు. అలాంటిది సడెన్‌గా నన్ను ఆ పాత్ర పోషించమని అడిగితే... తొలుత ఇబ్బంది పడ్డాను. అయితే లోకేష్ (నిర్వాహక కమిటీ ప్రతినిధి) నాకు వివరించి చెప్పడంతో ఒప్పుకున్నాను. పలు దఫాలు రిహార్సల్స్ తర్వాత ఈవెంట్లో సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాను. - నరసింహ గొప్ప అవకాశం.. పోతురాజు పాత్ర పోషించడం మరువలేని అనుభూతి ఇచ్చింది. ఇదొక గమ్మత్తయిన అనుభూతి. ఈ అవకాశం ఇచ్చిన రిక్రియేషన్ కమిటీకి థ్యాంక్స్. - సందీప్ అంతా అమ్మవారి కృప.. గతంలో నేను పాశ్చాత్య నృత్యాలు ప్రదర్శించాను. అయితే ఎప్పుడూ నాకు సరైన గుర్తింపు లభించలేదు. అమ్మవారిగా ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఈ పాత్ర నేను పోషించడం, దీనికి నలుగురి ప్రశంసలు లభించడం అంతా అమ్మవారి కృపే అనుకుంటున్నాను. - ప్రవల్లిక తమిళం నా భాష.. నా మాతృభాష తమిళం. కుండ తల మీద బ్యాలెన్స్ చేసుకోవడం వంటి ఫీట్లు ఉన్నాయి. భవిష్యవాణి చెప్పేటప్పుడు ఫ్యూచర్ గురించి జనం ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? వాటికి సమాధానాలు ఎలా ఉండాలి? వంటివన్నీ నేను స్వయంగా స్క్రిప్ట్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. పదేళ్లుగా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ఈ పాత్ర తాలూకు అనుభూతి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. - మోనీప్రియ -
సిటీ.. బ్యూటీ
ప్యాషన్ ఉండాలే గానీ ఎందులోనైనా రాణించవచ్చని నిరూపించింది మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ 2014 శ్వేతాతివారి. పెళ్లి చేసుకున్నా... తనలోని మోడల్‌ను కంటిన్యూ చేసిన శ్వేత... గత ఏడాది మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ పోటీల్లో విన్నర్‌గా నిలిచింది. రాజ్‌భవన్ రోడ్ ట్రావెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ‘స్పెషల్ హాలీడే ప్యాకేజెస్’ను శనివారం లాంచ్ చేసిన సందర్భంగా శ్వేతతో ‘సిటీ ప్లస్’ చిట్‌చాట్... ఛత్తీస్‌గఢ్ రాయపురాలో ఆచారవ్యవమారాలు తు.చ. తప్పకుండా పాటించే ఫ్యామిలీ మాది. స్కూల్లో ఉన్నప్పుడు ఫ్యాషన్ షోలు, అందాల పోటీల గురించి వింటుంటే ఎంతో అబ్బురంగా ఉండేది. ఇంటర్లోకి వచ్చేసరికి మోడలింగ్ చేయాలనే కోరిక బలపడిపోయింది. విషయం ఇంట్లో చెబితే ఏమవుతుందోనన్న భయం! ధైర్యం చేశా... అందరికీ చెప్పా. అంతటి సంప్రదాయ కుటుంబమైనా... ‘నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి’ అంటూ ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహమే నాకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. హైదరాబాద్ వచ్చి విల్లామేరీ కాలేజీలో బీకాంలో జాయిన్ అయ్యా. అప్పుడే మిస్ ఏపీ టైటిల్ గెలుచుకున్నా. కింగ్‌ఫిషర్ మోడల్ హంట్‌లో గెలిచా. 2012లో వ్యాపారవేత్త భాస్కర్ తివారీతో పెళ్లయింది. రెండేళ్లు మోడలింగ్ మానేశా. అయితే అత్తింటి వారిని ఒప్పించి మళ్లీ మోడలింగ్ ఆరంభించాను. ఫ్యామిలీ మద్దతు ఉంటే దేన్నయినా జయించవచ్చన్న ఆత్మవిశ్వాసం కలిగింది నాలో. కౌలంలంపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించి అందాల కిరీటం దక్కించుకున్నా. ఇది నా కెరీర్లోనే స్వీట్ మెమరీ. పెళ్లయితే అమ్మాయిలకు గ్లామర్ ఫీల్డ్‌లో కెరీర్‌కు ఫుల్స్టాప్ పడుతుందంటే నేను ఒప్పుకోను. మోడల్ కావాలనుకొనే అమ్మాయిలకు ప్రాంతీయ స్థాయిలో జరిగే అందాల పోటీలు కీలకమైనవి. నాకు ఫ్యాషన్ ప్రాణం. షాపింగ్ పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా వచ్చే మోడ్రన్ డ్రెస్‌లు కొనేస్తుంటా. నగరంతో ఎంతో అనుబంధం నేను బేసిగ్గా శాఖాహారిని. మా కుటుంబ నేపథ్యం, పెరిగిన తీరు వల్ల ఎన్ని నగరాలు తిరిగినా ఆహారపు అలవాట్లు మార్చుకోలేదు. బాలీవుడ్లో ఓ థ్రిల్లర్ సినిమాలో చేయమని అడిగారు. ఇంకా ఓకే చేయలేదు. తెలుగులో అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ఎందుకంటే ఇక్కడి కల్చర్‌తో నాకు అటువంటి అనుబంధం ఉంది. గోల్కొండ, చార్మినార్లు అద్భుతం. ఇక సామాజిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటా. నేత్ర దానం చేశా. మీరూ నేత్ర దానం చేయండి. మనం ఈ భూమి మీద లేకపోయినా... మరొకరికి జీవితం ఇచ్చినవారమవుతాము. డయాబెటిక్ రోగిగా మా నాన్న పడే బాధ తెలుసు. అందుకే దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాను. - వీఎస్ -
ఆరుపదుల్లోనూ అందంగా...
సాధారణంగా ‘ఫ్యాషన్’ అనగానే అందరూ ‘యువతకు మాత్రమే’ కదా... అనుకుంటారు. ఫ్యాషన్ షోలు.. ర్యాంప్ వాక్‌లు వారికోసమేనని భావిస్తుంటారు. కానీ ఫ్యాషన్ ఒక వయసుకు మాత్రమే చెందినది కాదు. అన్ని వయసుల వారికీ ‘ఫ్యాషన్ మంత్ర’ అవసరమైనదే! బాలీవుడ్ తారలు హేమమాలిని, షబానా అజ్మి, శోభా డే, కిరణ్ ఖేర్...లు ఆరుపదుల వయసులోనూ అందంగా కనిపిస్తుంటారు. యవ్వనంలో ఉన్నప్పుడు వారు అప్పటి ట్రెండ్స్‌ను అనుసరించారు. వయసు పైబడ్డాక వచ్చిన హుందాతనాన్ని తమ వేషధారణతో అందంగా మలచుకుని ఇప్పటికీ అబ్బురపరుస్తుంటారు. వార్ధక్యం ఓ వరంగా భావించే అందరూ తమ శరీరాకృతికి తగిన వేషధారణతో ఎదుటివారి ప్రశంసలను పొందుతుంటారు. ప్రయత్నిస్తే ‘ఫ్యాషన్ ఐడల్’ అనే కితాబును మీరూ పొందవచ్చు. నూరేళ్లలో కేవలం నూరు వసంతాలు మాత్రమే చూస్తారనుకుంటే పొరబాటు. ప్రతి మాసం వసంత ం, ప్రతి రుతువు ప్రీతికరమైన క్రతువు కావాలంటున్నారీ నారీనరులైన నిత్యయువకులు. యాభై ఏళ్లుగా తడబడని అడుగులతో మడమ తిప్పని సినీ రాఘవ ఓ ఉదాహరణ. ఎనభైమూడేళ్ల ఈ వయసులోనూ నా మనసుకు ఇరవై మూడే... అంటున్న సింగీతం మరో తారా తార్కాణం. పొట్ట చెత్తబుట్ట కాదనీ... మేనిని మెరిపించే పోషకాల సెజ్జ అని, యౌవనపాఠాలకు ఒజ్జ అనీ చెప్పే రేఖ మాటలను మీ చేతి రేఖలుగా చేసుకోండి. నిత్యయౌవనులైన వాళ్లను ఫాలో అవ్వండి. ఎప్పటికీ యంగ్ఫెలోస్గా ఉండండి. వీళ్లు... కదంతొక్కుతూ, పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ ఉండే యువపెద్దలు. వీళ్లు... ఆరుపదుల్లో పదహారుల స్ఫూర్తి పరవళ్లు తొక్కే ఉరవళ్ల వాగులు.ఇక కృష్ణా రామా అనుకునే వయసులో యువతకు గీతోపదేశాలూ, చెడు పట్ల అసురసంహారాలు చేసీ, చేయించే వృద్ధయువతరం వీళ్లు. క్యాలెండర్ సాక్షిగా పుట్టి,తేదీలూ, ఏడాదుల పరంగా మాత్రమే యువకులై... ప్రవృత్తిపరంగా మాత్రం ఎముకలు కుళ్లీ, వయసు మళ్లీ ప్రవర్తిస్తుంటే వాళ్లలో నెత్తురు మండించీ, శక్తులు నిండించీ స్ఫూర్తిని రగిలించే సీనియర్ సిటిజెన్స్ వీళ్లు. వీరినుంచి పాఠాలు నేర్చుకుని తమ యువజన హృదయాలను మరింత స్ఫూర్తిమంతం చేసుకోవడానికి సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా మా ‘ఫ్యామిలీ’ అన్ని పేజీలనూ ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఈ యువపెద్దలకూ, పెద్దయువకులకూ సలాం చేస్తూ అంకితం చేస్తోంది సాక్షి ఫ్యామిలీ. కేశాలంకరణ ... షబానా అజ్మికి ప్రత్యేకం! బాలీవుడ్ తార షబానా అజ్మి ఆధునిక, సంప్రదాయ వేషధారణలలో కనువిందు చేస్తుంటారు. ‘దుస్తులు సౌకర్యంగా ఉంటేనే ఆత్మవిశ్వాసంగా ఉండగలం’ అంటూ ఈ వయసు వారికి మరిన్ని సూచనలు ఇస్తున్నారు. ‘కేశాలంకరణలో ఆధునికంగా కనిపించడానికి ఇష్టపడతాను. అందుకే షార్ట్ హెయిర్ కట్ని ఎంచుకుంటాను. మెరుపులీనే మేకప్‌కి దూరంగా ఉంటాను. కనులు, కేశాలు, చర్మ నిగారింపు మీద దృష్టిపెడతాను. చీరలో, పైజామా కమీజ్‌లో సంప్రదాయతను ఒలికించడమే కాదు... జీన్స్, స్కర్ట్స్ వంటి ఆధునిక దుస్తులు కూడా భయం లేకుండా ధరిస్తాను.’ ఆధునికం... శోభా డే! నవలా రచయిత్రిగా, సామాజికవేత్తగా శోభా డే పేరు చాలా మందికి సుపరిచితమైనది. 66 ఏళ్లు నిండినా ఆధునిక, సంప్రదాయ వస్త్రధారణలో ఇప్పటికీ ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉంటారు శోభా డే! ‘ఎలాంటి వస్త్రధారణలో అయినా సంప్రదాయ అలంకరణ వస్తువులను పక్కన పెట్టేయాలి. సిల్క్ స్కార్ఫ్ మెడలో వేసుకుంటే మెటాలిక్ కాపర్, వెండి, ప్రాచీన కాలంనాటి నగలుగా కనిపించే చుంకీ ఆభరణాలు వయసును ఉన్నదానికన్నా తక్కువగా చూపిస్తాయి. పెద్ద కంఠహారం ధరిస్తే మెడపై ముడతలు కూడా కనిపించవు.’ కళాత్మకం... కిరణ్ ఖేర్! వెండితెర, బుల్లితెర నటిగా, టెలివిజన్ కార్యక్రమాలలో అతిథిగానూ కిరణ్ ఖేర్ అందరికీ సుపరిచితమే! పేరు చెప్పగానే ఆమె ఆహార్యం గ్రాండ్‌గా కళ్లముందు కదులుతుంది. పెద్ద అంచులున్న చీరలు, పెద్ద పెద్ద ఆభరణాలను ఆమె ధరిస్తారు. ‘ప్రాచీన కళకు ప్రతిరూపంగా నిలిచే ఆభరణాలు ఏ లోహంతో తయారైనవైనా నా అలంకరణ సామగ్రిలో భాగమైపోతాయి. ఎంబ్రాయిడరీ, చేనేత చీరలు నన్ను మరింత హుందాగా చూపిస్తాయి. అందుకే వాటినే ఇష్టపడతాను.’ సంప్రదాయం... హేమమాలిని! అందానికి సరిపోలే అర్థంలా కనిపిస్తారు హేమమాలిని. నాడు - నేడు నిగనిగలాడే మేని వర్చస్సు, దానికి తగ్గ అలంకరణ, వేషధారణతో ఆరుపదులు దాటినా ఆకర్షణీయత ఆమె సొంతం. ‘ఏజ్ లెస్ బ్యూటీ’గా పేరున్న హేమమాలిని అందాన్ని కాపాడుకోవడానికి నిత్యం జాగ్రత్తలు తీసుకుంటారు. ‘శరీరం ఫిట్‌గా ఉండటానికి సైక్లింగ్, యోగా-ప్రాణాయామం, డ్యాన్స్.. నన్ను ఇప్పటికీ యవ్వనంగా ఉంచుతున్నాయి. శాకాహారభోజనమే తీసుకుంటాను. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. అయితే ఈ సమయంలో తాజా పండ్లు తప్పనిసరిగా తీసుకుంటాను. రెండు కప్పుల గ్రీన్ టీతో నా దినచర్య మొదలవుతుంది. ఎక్కువగా మంచినీరు, మజ్జిగ తీసుకుంటుంటాను. రాత్రి ఎనిమిదిలోపు భోజనం ముగిస్తాను. మేకప్‌లో ముందుగా కళ్లకు ప్రాముఖ్యం ఇస్తాను. ఎక్కడకు వెళ్లినా కళ్లకు కాజల్, పెదాలకు లిప్‌స్టిక్ వేసుకుంటాను. రోజూ క్లెన్సింగ్ మిల్క్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకుంటాను. సంప్రదాయ వస్త్రధారణ నాకు బాగా నప్పుతుంది. చీరలు వయసుకు తగిన హుందాతనాన్ని, సౌకర్యాన్ని ఇస్తాయి. అందుకే రకరకాల చీరలను ధరించడానికి ఇష్టపడతాను. అయితే ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించకుండా జాగ్రత్తపడతాను.’