నిల్చునీ పనిచేస్తున్నారు..! | Fashion shows in office | Sakshi
Sakshi News home page

నిల్చునీ పనిచేస్తున్నారు..!

Published Thu, Jun 11 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM

నిల్చునీ పనిచేస్తున్నారు..!

నిల్చునీ పనిచేస్తున్నారు..!

వర్క్ కల్చర్‌ను మార్చేస్తున్న
 ఐటీ, స్టార్టప్ సంస్థలు
పనితో పాటు ఉద్యోగుల
ఆరోగ్యమూ ముఖ్యమే
అందుకే ఉద్యోగులకు పెట్టే ఫుడ్ విషయంలోనూ శ్రద్ధ
ఆఫీసులోనే ఫ్యాషన్ షోలు..
ప్రొడక్ట్ లాంచింగ్‌లు కూడా...


 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. అంటే ముందుగా గుర్తొచ్చేది ‘‘గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవటం. ఒత్తిడితో కూడిన జాబ్. వీకెండ్స్ పార్టీలు’’. కానీ ఇపుడీ జాబితాను సవరించక తప్పదు. ఎందుకంటే ‘గంటల తరబడి కూర్చోవటం’ అనేదిపుడు తగ్గుతోంది. ఎందుకంటే నడుస్తూ పనిచేయడం, సమావేశాల్లో ఆసాంతం నిల్చునే ఉండటం వంటివి చేరుతున్నాయి. ఫ్యాషన్ షోలు, ప్రొడక్ట్ లాంచింగ్‌లూ దీనికి తోడవుతున్నాయి. ఉద్యోగుల మానసికోల్లాసం కోసం ఆఫీసులోనే జిమ్, మెడిటేషన్, యోగ వంటి సెంటర్లనూ ఏర్పాటు చేస్తున్నాయి యాజమాన్యాలు.
 
 ఉద్యోగుల పనితీరనేది వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది కనక బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి మెట్రోల్లోని ఐటీ, స్టార్టప్ కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. యాహూ, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సిస్కో, క్యాపిటల్ ఐక్యూ, ప్రొగ్రెసివ్ వంటి సంస్థలు దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పాశ్యాత్య దేశాల్లో మాదిరి కూర్చొని పనిచేసే బదులు..
 
  నిల్చుని పనిచేసే సంస్కృతికి తెరలేపాయి. గంటల తరబడి ఒకే సీట్లో కూర్చొని పనిచేయడం బదులు నిల్చుని పనిచేయటాన్ని ఉద్యోగులు బాగా ఇష్టపడుతున్నారని చెప్పారు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్ రమేష్ లోగనాథన్. ‘‘అదే పనిగా కూర్చొని పనిచేసి ఉద్యోగులు కనక అలసిపోతే నిల్చునో, అటూ ఇటూ తిరుగుతూనే పనిచేసేందుకు మా సంస్థలో అనుమతి ఉంది’’ అన్నారు బ్రాడ్‌రిజ్డ్ సంస్థ సీనియర్ అనాలసిస్ట్ జి.అరవింద్‌కుమార్. ‘‘కొందరికి ఎక్కువ సేపు కూర్చుంటే నడుం పట్టేయటం, ఒత్తిడికి గురవటం జరుగుతాయి. ఇలాంటివేమీ లేకుండా ఉద్యోగులు తమకు నచ్చినట్లు.. నచ్చిన రీతిలో పనిచేసే వీలు కల్పించడమే మంచిది’’ అన్నారాయన.
 
 గంట నిల్చుంటే 132 క్యాలరీలు ఖర్చు...
 బెంగళూరులోని గూగుల్ సంస్థ తమ ఉద్యోగుల ఇష్ట ప్రకారం వారికి నిల్చుని పనిచేయటంతో పాటు నిల్చునే చిన్న చిన్న మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ‘‘గంటల కొద్ది కూర్చొని మీటింగ్‌లో పాల్గొనాలంటే బోర్. నిజం చెప్పాలంటే నిద్రొస్తుంది. అదే నిల్చుని మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లంటే ఆసక్తిగా ఉంటుంది’’ అని గూగుల్ ఉద్యోగి ఒకరు అభిప్రాయపడ్డారు. అందుకే నిల్చుని మీటింగ్‌లు నిర్వహించుకునేందుకు అనువైన టేబుళ్లు, డెస్క్‌లు, క్యాబిన్లు, ర్యాకుల్ని తమ సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. గంట సేపు నిలబడి పనిచేస్తే 132 క్యాలరీలు కరుగుతాయని వైద్యులూ చెబుతున్నారు మరి.
 
 భాగ్యనగరం మరో అడుగు ముందుకు..
 హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు మరో అడుగు ముందుకేసి ఉద్యోగుల ఫిట్‌నెస్ కోసం ఆఫీసుల్లోనే జిమ్, యోగా, మెడిటేషన్, రిక్రియేషన్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటితో పాటు ఫిట్‌నెస్ ట్రైనర్లనూ నియమిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తమకు వీలుదొరికినప్పుడు హాయిగా వ్యాయామాల్లో మునిగిపోతారని తెలంగాణ ఐటీ జాక్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి చెప్పారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగించడానికి ఆఫీసు ప్రాంగణంలోనే స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీ తదితర ఏర్పాట్లు ఎలాగూ ఉన్నాయి. హైదరాబాద్‌లో సుమారు 40కి పైగా ఐటీ పార్కులు.. 1,200కి పైగా ఐటీ సంస్థల్లో 3.5 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు.
 
 తిండిలోనూ లెక్కలు..
 ఆరోగ్యం, ఫిట్‌నెస్‌లో భాగంగా ఉద్యోగుల భోజనం విషయంలోనూ ఐటీ కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. ఆఫీసు క్యాంటీన్లో వండిన పదార్థాల్లో ఒక్కొక్కటీ ఎన్ని క్యాలరీలను కలిగి ఉంటుందనే విషయాన్ని తెలిపే బోర్డుల్ని ఏర్పా టు చేస్తున్నాయి. అంతేకాక కాస్త క్యా లరీలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకున్న రోజున ఎక్సర్‌సైజు సమయాన్ని పెంచేలా ఫిట్‌నెస్ ట్రైనర్లూ సలహాలిస్తున్నారు.
 
 భార్యభర్తలకు ప్రత్యేక ఏర్పాట్లు..
 ఒకే సంస్థలో భార్యాభర్తలిద్దరూ పనిచేస్తుంటే వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఎందుకిలా అని అడిగితే... ఇద్దరూ ఒకే ఆఫీసులో ఉంటే వారు పెట్టే సెలవులు తగ్గుతాయట. చాటిం గ్‌లు, మీటింగ్‌లు అంటూ ఆఫీసులోని ఇతర ఉద్యోగులతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే పద్ధతికి వీరు దూరంగా ఉంటారట. సంస్థ గురించిన ఏ విషయాన్నైనా ఇద్దరూ చర్చిస్తారు కనక మెరుగైన ఫలితాలు పొందే అవకాశమూ ఉందనేది యాజమాన్యాల వాదన.
 
 ఆఫీసుల్లోనే ఫ్యాషన్ షోలు..
 వీకెండ్ పార్టీలు, గెట్ టు గెదర్‌ల స్థానంలో ఆఫీసు ప్రాంగణంలో ఫ్యాషన్ షోలు, ప్రొడక్ట్ లాంచింగ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి కొన్ని ఐటీ సంస్థలు. దీంతో సంస్థకు ఆదాయం రావటమే కాక ఉద్యోగులు ర్యాంప్‌పై నడుస్తూ సెలబ్రిటీలుగా ఫీలవుతున్నారు. సంగీతంతో ప్రశాంతత, ఉల్లాసం, ఒత్తిడి రాహిత్యం సాధ్యమవుతాయి కనక కొన్ని సంస్థలు ఆఫీసుల్లో ఆహ్లాదకరమైన సంగీతం వినిపించే ఏర్పాట్లూ చేశాయి మరి!!.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement