ఆరుపదుల్లోనూ అందంగా...
సాధారణంగా ‘ఫ్యాషన్’ అనగానే అందరూ ‘యువతకు మాత్రమే’ కదా... అనుకుంటారు. ఫ్యాషన్ షోలు.. ర్యాంప్ వాక్‌లు వారికోసమేనని భావిస్తుంటారు. కానీ ఫ్యాషన్ ఒక వయసుకు మాత్రమే చెందినది కాదు. అన్ని వయసుల వారికీ ‘ఫ్యాషన్ మంత్ర’ అవసరమైనదే! బాలీవుడ్ తారలు హేమమాలిని, షబానా అజ్మి, శోభా డే, కిరణ్ ఖేర్...లు ఆరుపదుల వయసులోనూ అందంగా కనిపిస్తుంటారు.
యవ్వనంలో ఉన్నప్పుడు వారు అప్పటి ట్రెండ్స్‌ను అనుసరించారు. వయసు పైబడ్డాక వచ్చిన హుందాతనాన్ని తమ వేషధారణతో అందంగా మలచుకుని ఇప్పటికీ అబ్బురపరుస్తుంటారు. వార్ధక్యం ఓ వరంగా భావించే అందరూ తమ శరీరాకృతికి తగిన వేషధారణతో ఎదుటివారి ప్రశంసలను పొందుతుంటారు. ప్రయత్నిస్తే ‘ఫ్యాషన్ ఐడల్’ అనే కితాబును మీరూ పొందవచ్చు.
నూరేళ్లలో కేవలం నూరు వసంతాలు మాత్రమే చూస్తారనుకుంటే పొరబాటు. ప్రతి మాసం వసంత ం, ప్రతి రుతువు ప్రీతికరమైన క్రతువు కావాలంటున్నారీ నారీనరులైన నిత్యయువకులు. యాభై ఏళ్లుగా తడబడని అడుగులతో మడమ తిప్పని సినీ రాఘవ ఓ ఉదాహరణ. ఎనభైమూడేళ్ల ఈ వయసులోనూ నా మనసుకు ఇరవై మూడే... అంటున్న సింగీతం మరో తారా తార్కాణం.
పొట్ట చెత్తబుట్ట కాదనీ... మేనిని మెరిపించే పోషకాల సెజ్జ అని, యౌవనపాఠాలకు ఒజ్జ అనీ చెప్పే రేఖ మాటలను మీ చేతి రేఖలుగా చేసుకోండి. నిత్యయౌవనులైన వాళ్లను ఫాలో అవ్వండి. ఎప్పటికీ యంగ్‌ఫెలోస్‌గా ఉండండి. వీళ్లు... కదంతొక్కుతూ, పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ ఉండే యువపెద్దలు. వీళ్లు... ఆరుపదుల్లో పదహారుల స్ఫూర్తి పరవళ్లు తొక్కే ఉరవళ్ల వాగులు.ఇక కృష్ణా రామా అనుకునే వయసులో యువతకు గీతోపదేశాలూ, చెడు పట్ల అసురసంహారాలు చేసీ, చేయించే వృద్ధయువతరం వీళ్లు.
క్యాలెండర్ సాక్షిగా పుట్టి,తేదీలూ, ఏడాదుల పరంగా మాత్రమే యువకులై... ప్రవృత్తిపరంగా మాత్రం ఎముకలు కుళ్లీ, వయసు మళ్లీ ప్రవర్తిస్తుంటే వాళ్లలో నెత్తురు మండించీ, శక్తులు నిండించీ స్ఫూర్తిని రగిలించే సీనియర్ సిటిజెన్స్ వీళ్లు. వీరినుంచి పాఠాలు నేర్చుకుని తమ యువజన హృదయాలను మరింత స్ఫూర్తిమంతం చేసుకోవడానికి సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా మా ‘ఫ్యామిలీ’ అన్ని పేజీలనూ ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఈ యువపెద్దలకూ, పెద్దయువకులకూ సలాం చేస్తూ అంకితం చేస్తోంది సాక్షి ఫ్యామిలీ.
కేశాలంకరణ ... షబానా అజ్మికి ప్రత్యేకం!
బాలీవుడ్ తార షబానా అజ్మి ఆధునిక, సంప్రదాయ వేషధారణలలో కనువిందు చేస్తుంటారు. ‘దుస్తులు సౌకర్యంగా ఉంటేనే ఆత్మవిశ్వాసంగా ఉండగలం’ అంటూ ఈ వయసు వారికి మరిన్ని సూచనలు ఇస్తున్నారు. ‘కేశాలంకరణలో ఆధునికంగా కనిపించడానికి ఇష్టపడతాను. అందుకే షార్ట్ హెయిర్ కట్‌ని ఎంచుకుంటాను. మెరుపులీనే మేకప్‌కి దూరంగా ఉంటాను. కనులు, కేశాలు, చర్మ నిగారింపు మీద దృష్టిపెడతాను. చీరలో, పైజామా కమీజ్‌లో సంప్రదాయతను ఒలికించడమే కాదు... జీన్స్, స్కర్ట్స్ వంటి ఆధునిక దుస్తులు కూడా భయం లేకుండా ధరిస్తాను.’
ఆధునికం... శోభా డే!
నవలా రచయిత్రిగా, సామాజికవేత్తగా శోభా డే పేరు చాలా మందికి సుపరిచితమైనది. 66 ఏళ్లు నిండినా ఆధునిక, సంప్రదాయ వస్త్రధారణలో ఇప్పటికీ ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉంటారు శోభా డే! ‘ఎలాంటి వస్త్రధారణలో అయినా సంప్రదాయ అలంకరణ వస్తువులను పక్కన పెట్టేయాలి. సిల్క్ స్కార్ఫ్ మెడలో వేసుకుంటే మెటాలిక్ కాపర్, వెండి, ప్రాచీన కాలంనాటి నగలుగా కనిపించే చుంకీ ఆభరణాలు వయసును ఉన్నదానికన్నా తక్కువగా చూపిస్తాయి. పెద్ద కంఠహారం ధరిస్తే మెడపై ముడతలు కూడా కనిపించవు.’
కళాత్మకం... కిరణ్ ఖేర్!
వెండితెర, బుల్లితెర నటిగా, టెలివిజన్ కార్యక్రమాలలో అతిథిగానూ కిరణ్ ఖేర్ అందరికీ సుపరిచితమే! పేరు చెప్పగానే ఆమె ఆహార్యం గ్రాండ్‌గా కళ్లముందు కదులుతుంది. పెద్ద అంచులున్న చీరలు, పెద్ద పెద్ద ఆభరణాలను ఆమె ధరిస్తారు. ‘ప్రాచీన కళకు ప్రతిరూపంగా నిలిచే ఆభరణాలు ఏ లోహంతో తయారైనవైనా నా అలంకరణ సామగ్రిలో భాగమైపోతాయి. ఎంబ్రాయిడరీ, చేనేత చీరలు నన్ను మరింత హుందాగా చూపిస్తాయి. అందుకే వాటినే ఇష్టపడతాను.’
సంప్రదాయం... హేమమాలిని!
అందానికి సరిపోలే అర్థంలా కనిపిస్తారు హేమమాలిని. నాడు - నేడు నిగనిగలాడే మేని వర్చస్సు, దానికి తగ్గ అలంకరణ, వేషధారణతో ఆరుపదులు దాటినా ఆకర్షణీయత ఆమె సొంతం. ‘ఏజ్ లెస్ బ్యూటీ’గా పేరున్న హేమమాలిని అందాన్ని కాపాడుకోవడానికి నిత్యం జాగ్రత్తలు తీసుకుంటారు. ‘శరీరం ఫిట్‌గా ఉండటానికి సైక్లింగ్, యోగా-ప్రాణాయామం, డ్యాన్స్.. నన్ను ఇప్పటికీ యవ్వనంగా ఉంచుతున్నాయి. శాకాహారభోజనమే తీసుకుంటాను. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను.
అయితే ఈ సమయంలో తాజా పండ్లు తప్పనిసరిగా తీసుకుంటాను. రెండు కప్పుల గ్రీన్ టీతో నా దినచర్య మొదలవుతుంది. ఎక్కువగా మంచినీరు, మజ్జిగ తీసుకుంటుంటాను. రాత్రి ఎనిమిదిలోపు భోజనం ముగిస్తాను. మేకప్‌లో ముందుగా కళ్లకు ప్రాముఖ్యం ఇస్తాను. ఎక్కడకు వెళ్లినా కళ్లకు కాజల్, పెదాలకు లిప్‌స్టిక్ వేసుకుంటాను. రోజూ క్లెన్సింగ్ మిల్క్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకుంటాను. సంప్రదాయ వస్త్రధారణ నాకు బాగా నప్పుతుంది. చీరలు వయసుకు తగిన హుందాతనాన్ని, సౌకర్యాన్ని ఇస్తాయి. అందుకే రకరకాల చీరలను ధరించడానికి ఇష్టపడతాను. అయితే ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించకుండా జాగ్రత్తపడతాను.’