సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ కొలువులిస్తామంటూ ఇంజినీరింగ్ కాలేజీల వెంటపడే ఐటీ కంపెనీలు కామన్! కట్ చేస్తే... పాఠాలు చెప్పాలంటూ సాఫ్ట్ వేర్ నిపుణుల కోసం వేట మొదలెట్టాయి కాలేజీలు. ఫ్యాకల్టీగా చేరాలని.. కనీసం పార్ట్‌టైమ్‌గా అయినా విద్యార్థులకు బోధించాలంటూ ఇంజనీరింగ్ కాలేజీలు వారిని ఆహ్వానిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనైనా శిక్షణ ఇవ్వాలని కోరుతున్నాయి. మంచి వేతనాలివ్వడానికీ సిద్ధపడుతున్నాయి.
రాష్ట్రంలో ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. మరోపక్క సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. విద్యార్థుల నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను డిమాండ్ పెరగడమే దీనికి కారణం. అయితే, వీటిని బోధించే ఫ్యాకల్టీకి మాత్రం తీవ్రంగా కొరత నెలకొంది. ఈ విభాగాల్లో ఎంఎస్ చేసిన వాళ్లు కూడా బోధన వైపు ఆసక్తి చూ పడం లేదు. దీంతో ఇప్పటివరకూ సీఎస్‌సీ బోధించే వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారు.
దీనివల్ల నాణ్య త పెరగడం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) గుర్తించింది. సాఫ్ట్‌వేర్ రంగం లో నిపుణులతో బోధించే ఏర్పాటు చేయాలని సూ చించింది. ఈ తరహా బోధన ఉంటే తప్ప వచ్చే ఏ డాది నుంచి కంప్యూటర్ కోర్సులకు అనుమతించవ ద్దని రాష్ట్రాల కౌన్సిళ్లకు తెలిపింది. దీంతో సాఫ్ట్‌వేర్ నిపుణులకు గాలంవేసే పనిలోపడ్డాయి కాలేజీలు.
వాళ్లెవరో చెప్పాల్సిందే...
రాష్ట్రంలోని 174 కాలేజీల్లో కంప్యూటర్ కొత్త కోర్సులను బోధించే వారి జాబితాను గుర్తింపు ఇచ్చే యూనివర్శిటీకి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆయా ఫ్యాకల్టీ అర్హతలను యూనివర్సిటీ కమిటీలు పరిశీలిస్తాయి. ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీకి ఆయా రంగాల్లో నిష్ణాతులను నియమించాలని ఏఐసీటీఈ సూచించింది. అయితే, వాళ్ల అర్హతలేంటనేది స్పష్టం చేయలేదు. దీని స్థానంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌తో బోధన చేయించాలని పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 58 శాతం కంప్యూటర్ కోర్సులున్నాయి. ప్రతీ కాలేజీలోనూ ఒక ఏఐ బ్రాంచీ ఉంటోంది. ఈ లెక్కన ఈ ఏడాది ప్రతీ కాలేజీ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇతర కోర్సుల కోసం కనీసం ఐదుగురి చొప్పున ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి రాష్ట్రంలో దాదాపు 250 మంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు అవకాశాలు దక్కే వీలుంది.
ఆన్‌లైన్ క్లాసులు...
ఫుల్‌టైమ్ ఫ్యాకల్టీ కొరత నేపథ్యంలో... ఆన్‌లైన్ ద్వారా కొత్త కోర్సులను బోధించేందుకు యూనివర్సిటీలు, ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యా మండళ్లు అనుమతిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు వివిధ దేశాల్లో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న వారిని బోధనకు ఒప్పించేందుకు కాలేజీలు కృషి చేస్తున్నాయి. వారానికి కనీసం 10 క్లాసులు చెప్పించే ఏర్పాటు చేస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు కాలేజీలు కూడా ఇదే బాట పడుతున్నాయి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే వారికి శని, ఆదివారాల్లో సెలవులుంటాయి. అయితే, కోవిడ్ తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను కంపెనీలు తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఈ కారణంగా వారాంతపు సెలవుల్లో బోధనకు నిపుణులు సిద్ధపడటం లేదని ఓ ప్రైవేటు కాలేజీ నిర్వాహకుడు తెలిపాడు. దీంతో అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ నిపుణుడిని ఏఐ కోసం నియమించినట్టు తెలిపారు. సాధారణ ఫ్యాకల్టీకి ఇచ్చే వేతనం కన్నా పార్ట్‌టైమ్ పనిచేసే నిపుణులు రెండింతలు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment