
లండన్ : ఒత్తిడితో కూడిన ఉద్యోగంతో సతమతమయ్యే హృద్రోగాలతో బాధపడే పురుషులు మహిళలతో పోలిస్తే అకాల మరణానికి గురయ్యే అవకాశం అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. గుండె సమస్యలతో బాధపడే పురుషులు ఉద్యోగంలో ఒత్తిడికి లోనై అకాల మృత్యువాతన పడే అవకాశం మహిళలతో పోలిస్తే ఆరు రెట్లు అధికమని పరిశోధన పేర్కొంది. ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పురుషులు శారీరకంగా దృఢంగా ఉండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ఈ ముప్పు అధికమని పరిశోధన హెచ్చరించింది. అయితే ఉద్యోగ ఒత్తిళ్లతో అకాల మరణానికి లోనయ్యే ముప్పు మహిళల్లో ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడికాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
మహిళలతో పోలిస్తే పురుషులు ఉద్యోగ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్ల కారణంగా వారి గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టుకునే అవకాశం అధికంగా ఉండటమే దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. మహిళలు మొనోపాజ్ దశకు ముందు గుండె సమస్యలకు లోనవడం చాలా అరుదని అన్నారు. పురుషుల్లో ఈ ముప్పును తగ్గించేందుకు పనిగంటల తగ్గింపు, ఒత్తిడిని అధిగమించే చర్యలు చేపట్టడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చని అథ్యయనం చేపట్టిన యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ మికా కివిమకి సూచించారు.
పెద్దల్లో పనిచేయడం ఒత్తిడికి మూలకారణమని, తరాల కిందట మన శరీరాల్లో పొందుపరిచిన ఒత్తిడిని ఎదుర్కొనే సహజ గుణాలను ఆధునిక పనిస్వభావాలు సమూలంగా నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగంలో ఒత్తిళ్లు పురుషుల్లో కరోనరీ హార్ట్ డిసీజ్, స్ర్టోక్, డయాబెటిస్‌కు దారితీసి అకాల మరణానికి గురిచేస్తాయని తమ పరిశోధనలో స్పష్టంగా వెల్లడైందని చెప్పారు. బీపీ, కొలెస్ర్టాల్ స్ధాయిలను నియంత్రణలో ఉంచుకోవడం ఒక్కటే అధిక రిస్క్‌ను దూరం చేయలేదన్నారు. 14 ఏళ్ల పాటు లక్ష మంది వైద్య రికార్డులను పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.