పని భారం!
♦ రెవెన్యూ ఖాళీల భర్తీపై శ్రద్ధ చూపని సర్కారు
♦ రోజురోజుకూ పెరుగుతున్న పనిఒత్తిడి
♦ సతమతమవుతున్న ఉద్యోగులుz
♦ కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తే మరింత గందరగోళం
రెవెన్యూ శాఖ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. పహాణీల కంప్యూటరీకరణ, భూముల క్రమబద్ధీకరణ, ఫార్మాసిటీ భూసేకరణ, ఓటర్ల ముసాయిదా రూపకల్పన ఇలా ఒకేసారి పనులను మోపడంతో యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న రెవెన్యూ విభాగాన్ని ప్రభుత్వం పటిష్టం చేయకుండా ఏకకాలంలో అద నపు విధులు అప్పగిస్తుండడం ఉద్యోగులను ఊపిరిపీల్చుకోకుండా చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో సింహాభాగం నిధులు సమకూర్చిపెడుతున్న ఈ శాఖను బలోపేతం చేయకుండా చేతులెత్తేసింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో రెవెన్యూ విభాగంలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్వేయర్లు, జూనియర్/ సీనియర్ అసిస్టెంట్లు, వీఆర్‌ఓలు ఇలా ప్రతి కేటగిరీలోనూ ఉద్యోగుల సంఖ్య అరకొరగానే ఉంది. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా.. ఉన్నవారితో సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. ఇది ఉద్యోగులపై పనిభారాన్ని మోపుతోంది. ఈ ప్రభావం ప్రభుత్వం నిర్దేశించే పనుల మీద కనిపిస్తోంది.
నగరీకరణ నేపథ్యంలో జిల్లాలో భూముల విలువలు ఆకాశన్నంటుతుండడంతో భూ వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కోర్టు కేసులు, లోకాయుక్తలో పిటిషన్లు నమోదు కావడం.. వీటికి కౌంటర్లు దాఖలు చేయడంతో పుణ్యకాలం పూర్తవుతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు మొదలు దిగువశ్రేణి న్యాయస్థానాల వరకు సుమారు వేయి కేసులు పెండి ంగ్‌లో ఉన్నాయి. వీటిని కొలిక్కి తెచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం తలమునకలవుతున్నా.. కిందిస్థాయిలో జరుగుతున్న పొరపాట్లతో కోర్టు ధిక్కారం, జైలు శిక్షలు తప్పడంలేదు. ఇక సాధారణ అర్జీల సంగతి సరేసరి.
సమ్మెట పోటు!
ప్రతి మండలంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆర్‌ఐలు, సర్వేయరు, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులుండాలి. అయితే, వీటిలో తహసీల్దార్, డీటీ పోస్టులు మినహా మిగతా వాటిలో చాలావరకు ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 43 మంది సర్వేయర్లు ఉండాల్సివుండగా.. కేవలం 20 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ (జీఓ 58,59), ఔషధనగరి, భూదాన్, మెట్రో, ఎంఎంటీఎస్ రైల్వే లైన్ల సర్వే, ఆక్రమణకు గురయ్యే భూములకు హద్దులను నిర్దేశించే ఈ విభాగాన్ని ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తోంది. మరోవైపు 22ఏ భూముల పరిశీలన కూడా భారంగా మారింది. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులకు కీలకంగా వ్యవహరించే వీఆర్‌ఓల సంఖ్య కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 557 పోస్టులు ఉండగా.. దీంట్లో 428 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మండలానికి ఇద్దరు ఆర్‌ఐలను నిర్దేశించినా.. కేవలం పట్టణ మండలాల్లోనే ఇది అమలవుతోంది. దీంతో వెబ్‌ల్యాండ్ అప్‌డేషన్ నత్తనడకన సాగుతోంది. ఇక సీనియర్ అసిస్టెంట్లను నియమించక పోవడం కూడా మండల కార్యాలయాల్లో పనులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. 144 పోస్టులు మంజూరు కాగా.. దీంట్లో సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. ఇక జూనియర్ అసిస్టెంట్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని భావించవచ్చు.
బ్యాక్‌లాగ్, పదోన్నతులతో ఈ పోస్టులను నింపుతుండడంతో కేవలం ఆరు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నిరంతరం ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతుండడంతో రెవెన్యూ పనులపై ప్రభావం చూపుతోంది.
ఓటర్ల నమోదు వ్యవహారంలో రాజకీయ పక్షాలు కోర్టుకెక్కిన నేపథ్యంలో.. పని ఒత్తిడితో ఈ విధులు ఎక్కడ తమ మెడకు పడతాయోననే బెంగ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖలో ఖాళీలను భర్తీ చేయకుండా.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఉద్యోగుల నడ్డివిరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిర్దేశించిన పోస్టుల్లో ఉద్యోగులను నియమించిన తర్వాతే.. నయా జిల్లాల గురించి ఆలోచించాలని ఉద్యోగసంఘాలు సూచిస్తున్నాయి. అప్పుడే ఏయే జిల్లాకు ఎంత మంది అవసరమవుతారో తేలుతుందని అంటున్నాయి.