‘మీకోసం’ ద్వారా వస్తున్న వినతుల్లో ఉంటున్న అస్పష్ట సమాచారంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. తప్పుడు వినతుల క్రమంలో ఏం చేయాలో తెలియక చేసేది లేక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...
బొబ్బిలి రూరల్: మీకోసం ద్వారా వస్తున్న అసమగ్ర సమాచారం, తప్పుడు వినతులతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో అధికారులు వినతులు తీసుకుని ఆయా మండలాలలో లేదా డివిజన్‌లో కార్యాలయాలకు పంపే వినతులు ఆయా అధికారులు వాటిని గుర్తించి పరిష్కరించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వారిచ్చిన చిరునామాను గుర్తించి, ఫోన్ ద్వారా వారిని సంప్రదించి వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సమస్యను అధికారులు గుర్తించి ఆనక పరిష్కరిస్తారు.
సిబ్బంది ఇబ్బంది....
మీ కోసం ద్వారా వచ్చే వినతులు నెలలో 100 నుంచి 250 వరకు వస్తున్నాయి. ఈ ఏడాది పీఆర్‌కు 10,549 సమస్యలు రాగా వీటిలో 3,823 మాత్రమే అప్‌లోడ్ చేయగలిగారు. ఇక పరిష్కారం సంగతి అటుంచితే కార్యాలయాలలో పని చేసే రెగ్యులర్ లేదా కాంట్రాక్టు ఉద్యోగులు వాటిని గుర్తించి వచ్చిన వాటిలో నిజమైన ఆర్జీదారులను గుర్తించడం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. వీరిని గుర్తించే సమయంలో పలువురు తాము అసలు దరఖాççస్తు చేయలేదని చెబుతున్నారని సిబ్బంది తెలిపారు.
బాడంగికి చెందిన చిన్నారులు దరఖాస్తు చేసినట్లు వినతులు వస్తే ఆ ఫోన్‌కు కాల్ చేస్తే మేం ఆర్జీలు ఇవ్వలేదని వారి నుంచి సమాచారం వచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు. వచ్చిన వినతులలో 80శాతం వరకు వాస్తవంగా ఇచ్చినవి కానట్లు తెలుస్తోందని సిబ్బంది తెలిపారు. ఈ నెల 27న బొబ్బిలి పీఆర్ కార్యాలయంలో 87 దరఖాస్తులు పరిశీలించగా వీటిలో రెండు మాత్రమే వాస్తవాలని తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సర్వర్ బిజీ...
ఇదిలా ఉండగా ఒక్కో వినతి పరిశీలించి, వివరాలు సేకరించే సరికి కనీసం పది నిమిషాలు పడుతుంది. వాటికి రిమార్కులు రాసే సరికి మొత్తం 15నిమిషాలు సమయం పడుతుంది. ఈ సమయంలో సర్వర్లు పని చేయక అనేక మార్లు ఇబ్బంది పడుతున్నారు.
పని వత్తిడి....
ఇదిలా ఉండగా సిబ్బంది అందరికీ ఓడీఎఫ్ మరుగుదొడ్లుపై అవగాహన, శాఖాపరమైన పనులు, వీడి యో కాన్ఫరెన్సులు, వీటితో పాటు ఇతరత్రా పనులు చేయలేక సిబ్బంది పని వత్తిడికి గురవుతున్నారు.
మాడ్యూల్ మార్పుతో ఇక్కట్లు....
గతంలో పాత మాడ్యూల్‌లో ఏ శాఖకు చెందిన ఆర్జీయో...? ఏ సమస్యో వివరాలు ఉండేవి. దీంతో ఆయా శాఖకు ఆయా సమస్యపై అధికారులకు సమాచారం ఇస్తే పరిష్కారం అయ్యేవి. ప్రస్తుతం మాడ్యూల్ మార్చడంతో వీటిని గుర్తించడం సాధ్యం కావడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment