మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా
ఎ.కొండూరు (తిరువూరు): తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆశ వర్కర్ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో గురువారం చోటుచేసుకుంది. ఎ.కొండూరు గ్రామానికి చెందిన తోట రాధ (42) సుమారు 18 ఏళ్లుగా ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. వారం క్రితం జ్వరం బారిన పడ్డారు. రాధ జ్వరంతో బాధపడుతూనే ఫీవర్ సర్వే నిర్వహించారు.
పని ఒత్తిడి పెరగడం, తీవ్ర జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకున్నప్పటికీ నయంకాలేదు. దీంతో తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చినఅవుటపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాధ మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు.
న్యాయం చేయాలని ధర్నా
తోట రాధ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీఐటీయూ, ఆశ వర్కర్లు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గురువారం ధర్నా చేశారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.కమల, సీఐటీయూ మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైద్యాధికారులు నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన రాధ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మృతురాలి కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రాధకు సెలవు ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలని, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, వైద్యాధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా జ్వరంతో సర్వేలు చేయొద్దు.. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని ఎ.కొండూరు పీహెచ్‌సీ ఇన్‌చార్జి వైద్యాధికారి కె.శ్రీనివాసరావు చెప్పారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని ఆదేశాల మేరకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందజేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment