
దేశవ్యాప్తంగా 46 సెంట్రల్ యూనివర్సిటీలకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను నాలుగు సంవత్సరాల డిగ్రీ కోసం నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ (National Testing Agency) ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 1వ తేదీన రిజి స్ట్రేషన్ మొదలయ్యింది. ఈ ప్రక్రియ 23వ తేదీ వరకూ కొనసాగుతుంది. 37 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు డొమెయిన్ సబ్జెక్టు (ప్రధాన సబ్జెక్టు) నూ, నిర్దేశించిన 13 భాషలలో ఒక భాషనూ ఎంచుకోవాలి. జనరల్ స్టడీస్‌ను అభ్యర్థులందరూ రాయాలి. కనీస భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా భాషకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్, ప్లస్ 2, 12వ తరగతి పూర్తి చేసు కున్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ప్రతి విద్యార్థి ఐదు సబ్జెక్టుల వరకు పరీక్ష రాయడానికి ఎన్‌టీఏ అవకాశం కల్పించింది. ఈ ఒక్క పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీల్లో, అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు తమ ర్యాంకు ద్వారా, రిజర్వేషన్ల ఆధారంగా సీటు పొందడానికి అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (2020)లో భాగంగా అన్ని కేంద్ర విద్యా సంస్థలలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును గత రెండు సంవత్సరాల క్రితం నుండి ప్రారంభించారు. ఒక విద్యార్థి 8 సెమిస్టర్లను పూర్తి చేసుకుంటే ఆ విద్యార్థికి డిగ్రీతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా విద్యార్థి టీచర్ నియామకానికి సంబంధించి పరీక్షను నేరుగా రాయడానికి అర్హత సాధిస్తాడు. దీంతో పాటు పీజీ సర్టిఫికెట్ కూడా పొందుతాడు. ఈ కోర్సులో విద్యార్థి 75% శాతం మార్కులు సాధిస్తే నేరుగా పీహెచ్‌డీలో చేరడానికి అర్హత లభిస్తుంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరడానికి అవసరమైన నెట్, సెట్ పరీక్షలు రాయడానికి విద్యార్థి అర్హత సాధిస్తాడు.
సైన్సు చదివే విద్యార్థి ఆర్ట్స్ సబ్జెక్టు చదవడం, ఆర్ట్స్ చదివే విద్యార్థి సైన్సు సబ్జెక్టు చదవడానికి వీలు ఉండేలా ఈ కోర్సులు డిజైన్ చేశారు. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడానికి కంప్యూటర్ శిక్షణతో పాటు, మాతృభాష, ఇతర భాషలను నేర్పే విధంగా బోధన ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇఫ్లూ, మాను, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలు తెలంగాణలో; తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ట్రాన్సిట్ క్యాంపస్)లు ఏపీలో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
వివరాలకు ఎన్‌టీఏ వెబ్‌సైట్ (https://cuet.nta.nic)ను చూడవచ్చు
– డా.చింత ఎల్లస్వామి, ములుగు
Comments
Please login to add a commentAdd a comment