సమాజానికి ఎంతో చేశాం | We have a lot to society | Sakshi
Sakshi News home page

సమాజానికి ఎంతో చేశాం

Published Fri, Apr 10 2015 1:27 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

We have a lot to society

  • వాటిని పరిగణనలోకి తీసుకొని శిక్ష విధించండి
  • శిక్ష ఖరారుకు ముందు న్యాయమూర్తికి రామలింగరాజు నివేదన
  • సాక్షి, హైదరాబాద్: ‘మీపై నేరం రుజువైంది. మీకు గరిష్టంగా 14 ఏళ్ల జైలుశిక్ష, అపరిమిత జరిమానా విధించవచ్చు. అందువల్ల శిక్ష ఖరారుకు ముందు మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా?’ అంటూ న్యాయమూర్తి రామలింగరాజును అడిగారు. అందుకు రామలింగరాజు బదులిస్తూ తాను దేశం కోసం చేసిన కొన్ని సేవలను కోర్టు ముందుంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. ‘అమెరికాలో 911 సర్వీసు తరహాలో దేశంలోనే తొలిసారిగా 108 సర్వీసును ప్రారంభించి 10 లక్షల మంది ప్రాణాలను కాపాడాం. ఆపదలో ఉన్న 3.5 కోట్ల మందికి సేవ చేశాం.

    ఈ సర్వీసు ద్వారా 40 వేల మందికి ఉపాధి కల్పించాం. దేశవ్యాప్తంగా 70 కోట్ల మంది ప్రజలకు ఈ సర్వీసు ద్వారా సేవలు అందించాం. బైర్రాజు ఫౌండేషన్ ద్వారా 200 గ్రామాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా విద్య, వైద్యం, జీవనోపాధి తదితర 30 రకాల సేవలు అందించాం. గ్రామాల్లో ఇంటి దగ్గరకే మినరల్ వాటర్‌ను మొదటిసారిగా అందించాం. స్వర్గీయ అంజిరెడ్డితో కలసి స్థాపించిన నాంది ఫౌండేషన్ 14 రాష్ట్రాల్లో ప్రజలకు సమర్ధంగా సేవలు అందిస్తోంది.

    ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుల్లో నేనూ ఒకరిని. ప్రపంచంలోనే ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ బిజినెస్ స్కూల్‌ను ప్రారంభించిన సభ్యుల్లో నేనూ ఉన్నా. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 104 సర్వీసును ప్రారంభించాం. సత్యం కంప్యూటర్స్ ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించాం. అనేక సంస్థలకు ఐటీ సేవలను అందించాం. దేశంలోనే మొదటిసారిగా సిఫీ ఇంటర్‌నెట్ సంస్థను స్థాపించి ప్రజలకు ఇంటర్‌నెట్‌ను అందుబాటులోకి తెచ్చాం.

    శాటిలైట్ వ్యవస్థను అనుసంధానించడం ద్వారా ఆఫ్ షోర్ సర్వీసులను అందించాం. జాయింట్ వెంచర్ ద్వారా కాగ్నిజెంట్ కంపెనీతో కలసి 2.11 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇందులో 80 శాతానికిపైగా భారతీయులే ఉన్నారు. సత్యం కంపెనీని టెక్ మహీంద్ర కొనుగోలు చేసే నాటికి షేర్ విలువ రూ. 58 ఉండగా ప్రస్తుతం రూ. 320గా ఉంది. ఇటీవలే మదుపుదార్లకు బోనస్ షేర్‌లను కూడా ఇచ్చారు. సమాజానికి ప్రయోజనకరమైన పనులెన్నో చేశా. 33 నెలలపాటు రిమాండ్‌లో ఉన్నా. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని శిక్షను ఖరారు చేయండి’ అని రామలింగరాజు న్యాయమూర్తికి నివేదించారు.
     
    కుటుంబానికి మేమే ఆధారం

    ‘కేసు నమోదైనప్పటి నుంచి తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాం. 30 నెలలుగా జైల్లో ఉన్నాం. మా కుటుంబాలు అన్ని రకాలుగా చితికిపోయాయి. బంధువులు, మిత్రులు మమ్మల్ని సాంఘికంగా బహిష్కరించారు. పిల్లలు, భార్య, తల్లిదండ్రులు మా మీదే ఆధారపడి ఉన్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్నారు. వారిని పోషించాల్సిన బాధ్యత మాపైనే ఉంది. మేం చేసిన అపరాధానికి ఈ శిక్ష సరిపోతుందని భావిస్తున్నాం’ అని ఇతర దోషులు న్యాయమూర్తికి నివేదించారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నానని, ఈ కేసు తర్వాత తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదనిమరో దోషి ప్రభాకర్‌గుప్తా న్యాయమూర్తికి నివేదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement