గంధవరంలో భారీ అగ్నిప్రమాదం
⇒ఆరిళ్లు, రెండు దుకాణాలు దగ్ధం
⇒తప్పిన ప్రాణ నష్టం
⇒రూ.4 లక్షల ఆస్తినష్టం
⇒ సర్వం కోల్పోయిన బాధితులు
గంధవరం (చోడవరం) : గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆరు పూరిళ్లు, టీ, కిళ్లీ షాపులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాద సమయంలో ఆటుగా వెళుతున్న మోటారు సైకిలిస్టు చూసి కేకలు వేయడంతో బాధితులు ప్రాణాలతో బయపడ్డారు.
చోడవరం-అనకాపల్లి రోడ్డులో గంధవరం గ్రామం ఉంది. అర్ధరాత్రి అటుగా వెళుతున్న మోటారు సైకిలిస్టు రోడ్డు పక్కనే ఉన్న టీ కొట్టు నుంచి మంటలు వ్యాపించడాన్ని గమనించి పెద్దగా కేకలు వేశాడు. దీంతో ఇళ్లలో ఉన్న వారంతా హాహాకారాలు చేసుకుంటూ బయటకు పరుగుతీశారు. అగ్నికి వాయుదేవుడు తోడవడంతో క్షణాల్లో మంటలు ఇళ్లను చుట్టుముట్టాయి. కళ్ల ముందే ఇళ్లు అగ్నికి ఆహుతవడాన్ని వారు జీర్ణించుకోలేక బోరున విలపించారు. ప్రమాదంలో షేక్ పీర్ సాహెబ్ కుటుంబం సర్వం కోల్పోయింది.
పల్లా అప్పలనాయుడు, పల్లా సన్నిబాబు, అప్పలర్సమ్మ, ఊసర్ల రామకృష్ణ, పల్లా అప్పయ్యమ్మల పూరిళ్లు, టీ, కిళ్లీ షాపులు కాలిబూడిదయ్యాయి. పీర్ సాహెబ్‌కు చెందిన సుమారు రూ.2 లక్షలు వరకు ఆస్తినష్టం వాటిల్లింది. స్థానిక ఎంపీటీసీ మొల్లి ప్రసాద్, సర్పంచ్ పల్లా నర్సింగరావు, స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. సమాచారం తెలుసుకున్న చోడవరం, అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశాయి.
అప్పుచేసిన సొమ్ము కాలిపోయింది
‘గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. మటన్ దుకాణం ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. వేరే చోట ఇల్లు కట్టుకోవడానికి అప్పుతెచ్చిన రూ.50 వేలు, రెండు తులాల బంగారం, 12 తులాల వెండి పట్టీలు, మూడు సైకిళ్లు, నా కొడుకు పదో తరగతి, పాలిటెక్నికల్ సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలం’టూ బాధితులు షేక్ పీర్ సాహెబ్, పాతిమ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.