risk of fire
-
సోమేశ్వరంలో భారీ అగ్ని ప్రమాదం
* నిరాశ్రయమైన ఆరు కుటుంబాలు * నాలుగిళ్లు, పాన్‌షాపు, స్కూల్ బస్సు దగ్ధం * రూ.12 లక్షల ఆస్తినష్టం సోమేశ్వరం (రాయవరం) : నాలుగేళ్ల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం భయానక దృశ్యాలను వారింకా మరువలేదు. మరోసారి అగ్ని ప్రమాదం వారి జీవితాల్లో నిప్పులుకక్కింది. సోమేశ్వరం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నాలుగిళ్లు, ఓ పాన్‌షాప్‌తో పాటు స్కూల్ బస్సు పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.12 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. దీపంలో చమురు పోస్తుండగా.. సోమేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న రుద్రగుండాన్ని ఆనుకుని సబ్బెళ్ల మంగ, మట్టా రామారావు, అచ్చాలు, విత్తనాల మంగ, చింతా వీరన్న కుటుంబాలు తాటాకిళ్లలో నివ సిస్తున్నాయి. వెలుగుతున్న కిరోసిన్ దీపంలో అచ్చమ్మ చమురు పోస్తుండగా, మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ఇంటిని చుట్టుముట్టిన మంటలు.. పక్కనున్న ఇళ్లకూ వ్యాపించాయి. ఈ సంఘటనలో నాలుగు తాటాకిళ్లు, నందికోళ్ల శ్రీనివాస్‌కు చెందిన పాన్‌షాపు దగ్ధమయ్యాయి. కుతుకులూరుకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా అడట ప్రసాద్ పనిచేస్తున్నాడు. బస్సును సంఘటన స్థలానికి సమీపంలో పార్కింగ్ చేసి, చింతలూరు తీర్థానికి వెళ్లాడు. అగ్నిప్రమాదంలో ఆ బస్సు కూడా పూర్తిగా కాలిపోయింది. అదుపు చేసేందుకు యత్నం మంటలు ఎగిసిపడిన వెంటనే స్థానికులు వాటిని అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారేమీ చేయలేకపోయారు. సమాచారం అందుకున్న రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేసరికి నాలుగిళ్లు, పాన్‌షాపు, బస్సు భస్మీపటలమయ్యాయి. ఇంటిలోని సామగ్రి తెచ్చుకునేందుకు కూడా వీల్లేకపోవడంతో ఆయా కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. రామచంద్రపురం, మండపేట అగ్నిమాపక అధికారులు ఎన్.నాగేంద్రప్రసాద్, డి.చిన్నిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. సోమేశ్వరం-రాజానగరం రహదారి పక్కనే సంఘటన చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. సర్వం కోల్పోయాం ప్రమాదంలో తాము సర్వం కోల్పోయామని బాధితులు బోరున విలపించారు. అప్పు తెచ్చిన రూ.10 వేలు బూడిదైనట్టు మట్టా రామారావు విలపించాడు. మనవడి కాలి ఆపరేషన్ చేయించేందుకు తెచ్చిన రూ.30 వేలు బుగ్గయినట్టు సబ్బెళ్ల మంగ రోదించింది. 2010 డిసెంబర్ 4న ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. కాగా బాధిత కుటుంబాలకు స్థానిక కొబ్బరితోట పాఠశాలలో పునరావసం కల్పించారు. -
విజయవాడ లో భారీ అగ్నిప్రమాదం
విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలోని రాజీవ్‌గాంధీ పూల మార్కెట్ వెనుక బస్తీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రమాదేవి అనే మహిళ సజీవ దహనమైంది. 150 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఆస్తి నష్టం జరిగింది. మధ్యాహ్నం అందరూ పనులకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇళ్లలోని రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు శరవేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. 150 కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇంట్లో ఉన్న రమాదేవి అనే మహిళ బయటికి రాలేక మంటల్లో సజీవ దహనమైంది. మంటలను చూయి స్థానికులు పరుగులు తీశారు. 3 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పుతున్నాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను ఆపేశారు. ఇళ్లలోని అందరూ పనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరగడంతో పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. పిల్లలందరూ పాఠశాలలకు వెళ్లారు. యితే నిరుపేద కుటుంబాలవారు సర్వశ్వం కోల్పోయారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
ఒంగోలు నేతాజీ కాలనీలో అగ్ని ప్రమాదం
ఒంగోలు : నేతాజీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుప్రతికి తరలించారు. మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది. అదుపుచేస్తున్నారు. -
30 వేల క్వింటాళ్ల పత్తి బుగ్గి
జోగిపేట : హాట్ బాక్స్ నుంచి వచ్చిన మెరుగుల కారణంగా మంటలు చెలరేగి సుమారు 30 వేల క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతైంది. దీంతో సుమారు రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ సంఘటన ఆందోల్ మండలంలని ఎర్రారం శివారులో గల వైభవ్ ముర్గ ఆర్గో టెక్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేసిన సుమారుగా 30 వేల క్వింటాళ్ల పత్తిని జిన్నింగ్ చేయడానికి వైభవ్ ముర్గ ఆర్గోటెక్ ఇండస్ట్రీస్ ఆవరణలో ఉంచారు. సోమవారం జిన్నింగ్ నడుస్తున్న క్రమంలో హట్ బాక్స్‌లో అనుకోకుండా వచ్చిన మెరుగులు (చిన్న చిన్న రాళ్లు వచ్చినట్లయితే) రావడంతో మంటలు పత్తికి వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ, మంటలు రావడంతో అక్కడ ఏమి జరుగుతుందోనని కూలీలు అంతుపట్టక ప్రాణాలను అరచేత పట్టుకుని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అయితే జిన్నింగ్‌లోకి పత్తిని నింపుతున్న రెండు ట్రాక్టర్లు, ఓ జేసీబీ మంటల్లో అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ నాగయ్య, ఎస్ఐ శ్రీనివాస్‌లు సిబ్బందితో సంఘట నా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమయంలో మంటలను ఆరే ్పందుకు జిన్నింగ్ మిల్లో గల బోరు ద్వారా నీటిని జిమ్ముతూ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాన్ని సిబ్బంది చేశారు. అయితే జోగిపేట ఫైర్ ఇంజన్ సకాలంలో చేరుకున్నా అరగంటలోపే నీరు పూర్తి కావడంతో నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్ ఫైర్ స్టేషన్లకు సమాచారాన్ని అందించారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఫైర్ ఇంజన్లు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. సిబ్బంది ప్లాస్టిక్ బకెట్లు, బిందెలతో మంటలను ఆర్పారు. సంఘటన స్థలంలో ఎంపీ బీబీ పాటిల్ నారాయణఖేడ్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళుతున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జిన్నింగ్ మిల్లులో ఎగసి పడుతున్న మంటలను చూసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల కోసం అధికారులతో ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చేశారు. అనంతరం మిల్లు పార్టనర్ అయిన రంగనాథన్‌తో జరిగిన సంఘటనపై ఎంపీ ఆరా తీశారు. హట్ బాక్స్‌లో పత్తి వెంట చిన్న చిన్న రాళ్లు వచ్చినప్పుడు చిన్న చిన్న మెరుగులు వచ్చి మంటలు వ్యాపించడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన ఎంపీకి వివరించారు. కంపెనీలో 170 మంది వరకు కూలీలు పనిచేస్తుంటారని, అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఆందోళన చెందవద్దు సీసీఐకి పత్తిని విక్రయించి డబ్బులు రాని రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వా రి డబ్బులు ఎక్కడా పోవని ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆయన సంఘటనా స్థలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటనపై తాను కలెక్టర్‌తో మాట్లాడానని, ఎవరికీ నష్టం జరగకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకు ని న్యాయం చేస్తానని తెలిపారు. ఆయన వెంట నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావు షెట్కార్, టీఆర్ఎస్ నాయకులు బిడెకన్నె హన్మంతు, అందోలు ఎంపీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి వెంకటేశం, స్థానిక నాయకులు ఆగమయ్య, శ్రీనివాస్ గౌడ్లు ఆయన వెంట ఉన్నారు. -
గంధవరంలో భారీ అగ్నిప్రమాదం
⇒ఆరిళ్లు, రెండు దుకాణాలు దగ్ధం ⇒తప్పిన ప్రాణ నష్టం ⇒రూ.4 లక్షల ఆస్తినష్టం ⇒ సర్వం కోల్పోయిన బాధితులు గంధవరం (చోడవరం) : గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆరు పూరిళ్లు, టీ, కిళ్లీ షాపులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాద సమయంలో ఆటుగా వెళుతున్న మోటారు సైకిలిస్టు చూసి కేకలు వేయడంతో బాధితులు ప్రాణాలతో బయపడ్డారు. చోడవరం-అనకాపల్లి రోడ్డులో గంధవరం గ్రామం ఉంది. అర్ధరాత్రి అటుగా వెళుతున్న మోటారు సైకిలిస్టు రోడ్డు పక్కనే ఉన్న టీ కొట్టు నుంచి మంటలు వ్యాపించడాన్ని గమనించి పెద్దగా కేకలు వేశాడు. దీంతో ఇళ్లలో ఉన్న వారంతా హాహాకారాలు చేసుకుంటూ బయటకు పరుగుతీశారు. అగ్నికి వాయుదేవుడు తోడవడంతో క్షణాల్లో మంటలు ఇళ్లను చుట్టుముట్టాయి. కళ్ల ముందే ఇళ్లు అగ్నికి ఆహుతవడాన్ని వారు జీర్ణించుకోలేక బోరున విలపించారు. ప్రమాదంలో షేక్ పీర్ సాహెబ్ కుటుంబం సర్వం కోల్పోయింది. పల్లా అప్పలనాయుడు, పల్లా సన్నిబాబు, అప్పలర్సమ్మ, ఊసర్ల రామకృష్ణ, పల్లా అప్పయ్యమ్మల పూరిళ్లు, టీ, కిళ్లీ షాపులు కాలిబూడిదయ్యాయి. పీర్ సాహెబ్‌కు చెందిన సుమారు రూ.2 లక్షలు వరకు ఆస్తినష్టం వాటిల్లింది. స్థానిక ఎంపీటీసీ మొల్లి ప్రసాద్, సర్పంచ్ పల్లా నర్సింగరావు, స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. సమాచారం తెలుసుకున్న చోడవరం, అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశాయి. అప్పుచేసిన సొమ్ము కాలిపోయింది ‘గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. మటన్ దుకాణం ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. వేరే చోట ఇల్లు కట్టుకోవడానికి అప్పుతెచ్చిన రూ.50 వేలు, రెండు తులాల బంగారం, 12 తులాల వెండి పట్టీలు, మూడు సైకిళ్లు, నా కొడుకు పదో తరగతి, పాలిటెక్నికల్ సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలం’టూ బాధితులు షేక్ పీర్ సాహెబ్, పాతిమ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
రెండిళ్లు దగ్ధం .. రూ. 20 లక్షల ఆస్తి నష్టం
నెల్లిపాక (భద్రాచలం రూరల్) : నెల్లిపాక మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో రెండిళ్లు దగ్ధమయ్యాయి. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, తోటపల్లి ప్రధాన సెంటర్లో జి.పుణ్యవతికి చెందిన శ్లాబ్ ఇంట్లో చల్లా వీరభద్రం కిరణా షాపును, గల్లకోట భాస్కరరావు వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాల వెనుక ఉన్న పెంకుటింట్లో వీరు నివసిస్తున్నారు. శుక్రవారం వేకువజామున వాకింగ్‌కు వెళుతున్న స్థానికులు దుస్తుల దుకాణం నుంచి పొగలు రావడం గుర్తించి ఇంట్లో నిద్రిస్తున్న వారిని లేపారు. అప్పటికే దుస్తుల దుకాణంలో మంటలు వ్యాపించటంతో చాలావరకూ కాలిపోయాయి. సర్పంచ్ సుకోనాయక్, అప్పలరెడ్డి, పూరేటి వెంకటేశ్వర్లు, మెడికల్ షాప్ మురళి తదితరులు ఇంట్లోని గ్యాస్ సిలిండర్, కొన్ని వస్తువులను బయటికి తీసుకువచ్చారు. ఫైర్ సిబ్బంది సుమారు 2గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. రెండిళ్లు, గృహోపకరణాలుతో పాటు కాలిపోయాయి. రూ.4 లక్షల దుస్తులు, రూ.5 లక్షల విలువైన కిరాణా సామగ్రి, రూ.50 వేల నగదు ఆహుతయ్యాయి. ఇంటి విలువతో కలిపి ఆస్తినష్టం రూ.20 లక్షలని ఫైర్ అధికారులు అంచనా వేశారు. పండుగల సీజన్ కావడంతో రూ.లక్షల విలువైన సామగ్రిని కొని నిల్వ చేశామని, అవి పూర్తిగా దగ్ధం కావడంతో జీవనాధారం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. తాటిపర్తిలో తాటాకిల్లు దగ్ధం గొల్లప్రోలు : తాటిపర్తి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైంది. దీంతో శ్రీమంతుల ధర్మరాజు, శ్రీమంతుల సుబ్రహ్మణ్యంల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఆస్తి నష్టం రూ. లక్ష ఉండవచ్చన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు మడికి సన్యాసిరావు, సర్పంచ్ చల్లా సత్యనారాయణమూర్తి, తహశీల్దార్ వై జయ సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు 50 కిలోల బియ్యాన్ని అందచేశారు రెండు తాటాకిళ్లు దగ్ధం నడకుదురు(కరప) : నడకుదురు గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధంకాగా మూడు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. పంచాయతీ కార్యాలయం ఎదుటి వీధిలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటల చెలరేగడంతో రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. కాకినాడ ఫైర్ సిబ్బంది, స్థానికులు మంటలు ఆర్పేందుకు శ్రమించారు. అనసూరి మంగయ్య మ్మ, మల్లువరస సూర్యకాంతం, విష్ణుచక్రం కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు. రూ.2 లక్షల ఆస్తినష్టం సంభవించిందని రెవెన్యూ అధికారులు అంచనావేశారు. వీఆర్వో భుజంగరావు, ఆర్ఐ నాగరాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్పంచ్ యాసలపు దుర్గాప్రసాద్, ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జవ్వాది సతీష్ బాధితులను పరామర్శించారు. -
పరకాలలో అగ్ని ప్రమాదం
* అగ్గిపెట్టెల గోదాంలో షార్ట్ సర్క్యూట్ * రూ.4 లక్షల ఆస్తి నష్టం పరకాల : అగ్గిపెట్టెల గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన పట్టణంలోని సాయినగర్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఎర్రం కైలాసం, దొంతుల రమేష్, తణుకు నవీన్, జూలూరి బిక్షపతి, ఎర్రం రవి, ఎర్రం జగదీశ్వర్లు నాలుగేళ్ల నుంచి సాయినగర్‌కాలనీలో అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, ఇండియన్ టోబా కో కంపెనీ(ఐటీసీ)కి చెందిన సిగరెట్లను ఓ ఇంట్లో నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అందులో రూ. 14 లక్షల విలువ చేసే వస్తువులను భద్రపరిచారు. అయితే సదరు గోదాంకు వచ్చే కరెంటు తీగలు గురువారం ఉదయం ప్రమాదవశాత్తు షార్టసర్క్యూట్ గురై ఇన్వర్టర్పై పడ్డాయి. దీంతో నిప్పురవ్వలు అగ్గిపెట్టెలపై పడి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కాగా, ఈ సంఘటనలో రూ.4లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదిలా ఉండగా, అగ్గిపెట్టెల గోదాం నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతిలేనట్లు తెలిసింది. కాగా, ఉదయం పూట సంఘటన జరుగడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. నిర్వాహకులపై సీఐ సీరియస్.. జనావాసాల మధ్య అగ్గిపెట్టెల గోదాంను పెట్టడంపై పరకాల సీఐ బి. మల్లయ్య నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న సీఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, గోదాంకు అసలు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా... లేదా అనే విషయంపై ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్షణమే గోదాంను ఇక్కడి నుంచి తరలించాలని నిర్వాహకులను హెచ్చరించారు. -
ముత్తంగి ఎస్బీఐలో అగ్ని ప్రమాదం
ఫర్నిచర్ దగ్ధం పటాన్చెరు: మండల పరిధిలోని ముత్తంగి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ దీనికి కారణమని చెబుతున్నారు. సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా. వివరాలు.. బ్యాంక్‌లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. బ్యాంక్ పై అంతస్తు నుంచి మంటలు కిందకి వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్త పడ్డారు. ఇన్చార్జి బ్యాంక్ మేనేజర్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ఒక వేళ మంటలు కిందకు వ్యాపించి ఉంటే బ్యాంకులో ఉన్న దస్తావేజులు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయి భారీగా నష్టం వాటిల్లేదని తెలిపారు. -
బుక్‌స్టాల్ బుగ్గిపాలు
నగరం నడిబొడ్డున ఘోరం జరిగిపోయింది. వెల కట్టలేని నష్టం వాటిల్లింది. అపురూప పుస్తక సంపద అగ్నికి ఆహుతైంది. ఏటేటా కొనుగోలు చేసి కూడబెట్టిన కొత్త, పాత పుస్తకాలు ఒక్క రాత్రిలో భస్మమయ్యాయి. 30 ఏళ్ల కష్టార్జితం మంటల్లో కాలిపోతుంటే దుకాణ యజమాని జుబేర్ విలవిలలాడాడు. ప్రమాద తీవ్రతను తట్టుకోలేక సంఘటన స్థలం వద్దే కుప్పకూలాడు. హన్మకొండ చౌరస్తా : హన్మకొండ చౌరస్తాలో జుబేర్ బుక్‌స్టాల్ బుగ్గిపాలైంది. అగ్నికీలలు ఎగిసిపడడం, పొగలు కమ్ముకోవడంతో ఆ ప్రాంతమంతా భీతావహ దృశ్యాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో సుమా రు రూ. 5 కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. బుక్‌స్టాల్ యజమాని జుబేర్ సన్నిహితుడు నయిమోద్దీన్, స్థానికుల కథనం ప్రకారం.. హన్మకొండ చౌరస్తాలో ప్రఖ్యాతిగాంచిన జుబేర్ బుక్‌స్టాల్ యజమాని జుబేర్ రోజూ లాగే శనివారం సిబ్బందిని పంపిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో తాళం వేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండు గంటల సమయంలో ఆ బుక్‌స్టాల్ నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన స్థానికు లు జుబేర్ కు ఫోన్లో సమాచారం అందించారు. విషయం తెలియగానే ఆందోళనగా దుకాణానికి చేరుకున్న జుబేర్ హన్మకొండ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చాడు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది షట్టర్ తెరవగానే అప్పటికే మంటలు దుకాణమంతా వ్యాపించాయి. దట్టమైన పొగ, పెద్దపెద్ద మంటలతో దుకాణం కాలిపోవడం కనిపించింది. దీంతో ఒక్క ఫైరింజన్ సరిపోదని భావించి మరో రెండింటిని తెప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం మొదలుపెట్టారు. అర్ధరాత్రి వరకు చల్లారని మంటలు.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాలుగు ఫైరింజన్లు, మున్సిపాలిటీ ట్యాంకర్లతో సిబ్బంది నిర్విరామంగా మంటలార్పుతూనే ఉన్నారు. దుకాణానికి మూడు దిక్కులా జేసీబీతో పగులగొట్టి లోపలి కి వెళ్లిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు చాలా కష్టపడ్డారు. రెండంతస్తులు మొత్తం పుస్తకాలతో నిండి ఉండడంతో మంటలు సులువుగా వ్యాపించాయి. దట్టమైన పొగలు హన్మకొండ చౌరస్తా అంతా వ్యాపించా యి. వేడికి తట్టుకోలేని భవనం మొత్తం పగుళ్లుబారింది. ఏ క్షణాన్నైనా భవనం కూలిపోయే అవకాశం ఉందని భావించారు. వెల కట్టలేని పుస్తకాలు, కూలిపోయిన భవనంతో కలిపి సుమారు. 5 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. కాలిపోయిన కాగితాలు గాలిలో ఎగురుతూ హన్మకొండలో మూడు, నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఇళ్లు, రోడ్లపై పడ్డాయి. రాత్రి పొద్దుపోయే వరకు ఫైరింజన్‌తో నీళ్లు కొడు తూ మంటలు ఆర్పుతూనే ఉన్నారు. రెండు జిల్లాల పుస్తక కేంద్రం.. వరంగల్‌తోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు పుస్తకాల కోసం జుబేర్ బుక్‌స్టాల్ కు వస్తుండేవారు. కొత్త పుస్తకాలు కొనుగోలు చేయలేని పేదవిద్యార్థులకు ఇక్కడ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు తక్కువ ధరకు లభించేవి. అంతేకాదు జుబేర్లో దొరకని పుస్తకమంటూ ఉండదంటే అతిశయోక్తికాదు. ఆ నమ్మకంతోనే వచ్చే విద్యార్థులకు పుస్తకాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ లాభానికి అమ్మి వారి అభిమానాన్ని జుబేర్ చూరగొన్నారు. అందరితో కలి విడిగా ఉండే ఆయనకు సౌమ్ముడిగా పేరుంది. సేవాభావంతో పేదలకు ఉచితంగా పుస్తకాలం దించే ఆయన దుకాణం కాలుతుందని తెలుసుకున్న అనేక మంది సంఘటన స్థలానికి చేరుకు ని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పలు చోట్ల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వర కు తండోపతండాలుగా తరలివచ్చి చూశారు. డబ్బాగా ప్రారంభమై.. రెండంతస్తుల దుకాణంగా ఎదిగి.. మొదట కొన్ని పుస్తకాలతో చౌరస్తాలో ఒక డబ్బాలో పుస్తకాలు అమ్మిన జుబేర్ కష్టపడి నిజాయితీగా పెకైదిగాడు. సుమారు 50 మందికిపైగా యువకులకు ఉపాధి కల్పించా డు. 30 ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న తన పుస్తకగని అగ్నికి ఆహుతి కావడంతో సంఘటన స్థలం వద్దే కుప్పకూలిపోయాడు. షాక్‌కు గురై ఆస్పత్రిపాలైన జుబేర్ తేరుకున్నాక సమాచారం సేకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం షార్ట్సర్య్కూటా ? కాదా ? అనే అంశంపై విచారణ చేస్తామని తెలిపారు. -
ఐకేపీ ఆనిమేటర్ సజీవ దహనం
కాశినాయన/పోరుమామిళ్ల, న్యూస్‌లైన్: కాశినాయన మండలంలోని రెడ్డికొట్టాలలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐకేపీలో ఆనిమేటర్‌గా పనిచేస్తున్న ఆదిబోయిన రామశేషయ్య(40) సజీవ దహనమయ్యాడు. అగ్నిమాపక అధికారి విజయకుమార్ కథనం మేరకు.. రామశేషయ్యకు భార్యతో పాటు యోగేశ్వర్, బిందు అనే ఇద్దరు పిల్లలున్నారు. రామశేషయ్య అమ్మ బోద కొట్టంలో చిల్లర అంగడి వ్యాపారం చేసుకుంటూ ఉండేది. సాయంత్రం ఏమి జరిగిందో తెలియదుకానీ గుడిసెలో మంటలు లేచి ఒక్కసారిగా చుట్టుకున్నాయి. శేషయ్య కుమారుడు యోగి(16) మంటలకు కాలి కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. శేషయ్య గుడిసెలో చిక్కుకుపోయి మాడిపోయాడు. లోపల కిరోసిన్ లేదా పెట్రోల్ వుండటం వల్ల మంటలు తీవ్రస్థాయిలో లేచినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోరుమామిళ్ల అగ్నిమాపక సిబ్బంది అక్కడి వెళ్లి మంటలకు ఆర్పివేశాక, రామశేషయ్య మృతదేహం మాడిపోయిన స్థితిలో కనిపించింది. కుటుంబ యజమాని మరణించడంతో ఆ కుటుంబం వీధినపడ్డట్లైంది.