నెల్లిపాక (భద్రాచలం రూరల్) : నెల్లిపాక మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో రెండిళ్లు దగ్ధమయ్యాయి. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, తోటపల్లి ప్రధాన సెంటర్లో జి.పుణ్యవతికి చెందిన శ్లాబ్ ఇంట్లో చల్లా వీరభద్రం కిరణా షాపును, గల్లకోట భాస్కరరావు వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాల వెనుక ఉన్న పెంకుటింట్లో వీరు నివసిస్తున్నారు. శుక్రవారం వేకువజామున వాకింగ్‌కు వెళుతున్న స్థానికులు దుస్తుల దుకాణం నుంచి పొగలు రావడం గుర్తించి ఇంట్లో నిద్రిస్తున్న వారిని లేపారు.
అప్పటికే దుస్తుల దుకాణంలో మంటలు వ్యాపించటంతో చాలావరకూ కాలిపోయాయి. సర్పంచ్ సుకోనాయక్, అప్పలరెడ్డి, పూరేటి వెంకటేశ్వర్లు, మెడికల్ షాప్ మురళి తదితరులు ఇంట్లోని గ్యాస్ సిలిండర్, కొన్ని వస్తువులను బయటికి తీసుకువచ్చారు. ఫైర్ సిబ్బంది సుమారు 2గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. రెండిళ్లు, గృహోపకరణాలుతో పాటు కాలిపోయాయి. రూ.4 లక్షల దుస్తులు, రూ.5 లక్షల విలువైన కిరాణా సామగ్రి, రూ.50 వేల నగదు ఆహుతయ్యాయి.
ఇంటి విలువతో కలిపి ఆస్తినష్టం రూ.20 లక్షలని ఫైర్ అధికారులు అంచనా వేశారు. పండుగల సీజన్ కావడంతో రూ.లక్షల విలువైన సామగ్రిని కొని నిల్వ చేశామని, అవి పూర్తిగా దగ్ధం కావడంతో జీవనాధారం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు.
తాటిపర్తిలో తాటాకిల్లు దగ్ధం
గొల్లప్రోలు : తాటిపర్తి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైంది. దీంతో శ్రీమంతుల ధర్మరాజు, శ్రీమంతుల సుబ్రహ్మణ్యంల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఆస్తి నష్టం రూ. లక్ష ఉండవచ్చన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు మడికి సన్యాసిరావు, సర్పంచ్ చల్లా సత్యనారాయణమూర్తి, తహశీల్దార్ వై జయ సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు 50 కిలోల బియ్యాన్ని అందచేశారు
రెండు తాటాకిళ్లు దగ్ధం
నడకుదురు(కరప) : నడకుదురు గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధంకాగా మూడు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. పంచాయతీ కార్యాలయం ఎదుటి వీధిలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటల చెలరేగడంతో రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. కాకినాడ ఫైర్ సిబ్బంది, స్థానికులు మంటలు ఆర్పేందుకు శ్రమించారు. అనసూరి మంగయ్య మ్మ, మల్లువరస సూర్యకాంతం, విష్ణుచక్రం కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు. రూ.2 లక్షల ఆస్తినష్టం సంభవించిందని రెవెన్యూ అధికారులు అంచనావేశారు. వీఆర్వో భుజంగరావు, ఆర్‌ఐ నాగరాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్పంచ్ యాసలపు దుర్గాప్రసాద్, ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జవ్వాది సతీష్ బాధితులను పరామర్శించారు.
రెండిళ్లు దగ్ధం .. రూ. 20 లక్షల ఆస్తి నష్టం
Published Sat, Dec 27 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement
Advertisement