పరకాలలో అగ్ని ప్రమాదం
* అగ్గిపెట్టెల గోదాంలో షార్ట్ సర్క్యూట్
* రూ.4 లక్షల ఆస్తి నష్టం
పరకాల : అగ్గిపెట్టెల గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన పట్టణంలోని సాయినగర్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఎర్రం కైలాసం, దొంతుల రమేష్, తణుకు నవీన్, జూలూరి బిక్షపతి, ఎర్రం రవి, ఎర్రం జగదీశ్వర్‌లు నాలుగేళ్ల నుంచి సాయినగర్‌కాలనీలో అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, ఇండియన్ టోబా కో కంపెనీ(ఐటీసీ)కి చెందిన సిగరెట్లను ఓ ఇంట్లో నిల్వ చేసి విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం అందులో రూ. 14 లక్షల విలువ చేసే వస్తువులను భద్రపరిచారు. అయితే సదరు గోదాంకు వచ్చే కరెంటు తీగలు గురువారం ఉదయం ప్రమాదవశాత్తు షార్‌టసర్క్యూట్ గురై ఇన్‌వర్టర్‌పై పడ్డాయి. దీంతో నిప్పురవ్వలు అగ్గిపెట్టెలపై పడి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో వారు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కాగా, ఈ సంఘటనలో రూ.4లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదిలా ఉండగా, అగ్గిపెట్టెల గోదాం నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతిలేనట్లు తెలిసింది. కాగా, ఉదయం పూట సంఘటన జరుగడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.
నిర్వాహకులపై సీఐ సీరియస్..
జనావాసాల మధ్య అగ్గిపెట్టెల గోదాంను పెట్టడంపై పరకాల సీఐ బి. మల్లయ్య నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న సీఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, గోదాంకు అసలు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా... లేదా అనే విషయంపై ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్షణమే గోదాంను ఇక్కడి నుంచి తరలించాలని నిర్వాహకులను హెచ్చరించారు.