బుక్‌స్టాల్ బుగ్గిపాలు
నగరం నడిబొడ్డున ఘోరం జరిగిపోయింది. వెల కట్టలేని నష్టం వాటిల్లింది. అపురూప పుస్తక సంపద అగ్నికి ఆహుతైంది. ఏటేటా కొనుగోలు చేసి కూడబెట్టిన కొత్త, పాత పుస్తకాలు ఒక్క రాత్రిలో భస్మమయ్యాయి. 30 ఏళ్ల కష్టార్జితం మంటల్లో కాలిపోతుంటే దుకాణ యజమాని జుబేర్ విలవిలలాడాడు. ప్రమాద తీవ్రతను తట్టుకోలేక సంఘటన స్థలం వద్దే కుప్పకూలాడు.
హన్మకొండ చౌరస్తా : హన్మకొండ చౌరస్తాలో జుబేర్ బుక్‌స్టాల్ బుగ్గిపాలైంది. అగ్నికీలలు ఎగిసిపడడం, పొగలు కమ్ముకోవడంతో ఆ ప్రాంతమంతా భీతావహ దృశ్యాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో సుమా రు రూ. 5 కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. బుక్‌స్టాల్ యజమాని జుబేర్ సన్నిహితుడు నయిమోద్దీన్, స్థానికుల కథనం ప్రకారం.. హన్మకొండ చౌరస్తాలో ప్రఖ్యాతిగాంచిన జుబేర్ బుక్‌స్టాల్ యజమాని జుబేర్ రోజూ లాగే శనివారం సిబ్బందిని పంపిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో తాళం వేసుకుని ఇంటికి వెళ్లిపోయారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండు గంటల సమయంలో ఆ బుక్‌స్టాల్ నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన స్థానికు లు జుబేర్ కు ఫోన్‌లో సమాచారం అందించారు. విషయం తెలియగానే ఆందోళనగా దుకాణానికి చేరుకున్న జుబేర్ హన్మకొండ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చాడు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది షట్టర్ తెరవగానే అప్పటికే మంటలు దుకాణమంతా వ్యాపించాయి. దట్టమైన పొగ, పెద్దపెద్ద మంటలతో దుకాణం కాలిపోవడం కనిపించింది. దీంతో ఒక్క ఫైరింజన్ సరిపోదని భావించి మరో రెండింటిని తెప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం మొదలుపెట్టారు.
అర్ధరాత్రి వరకు చల్లారని మంటలు..
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాలుగు ఫైరింజన్లు, మున్సిపాలిటీ ట్యాంకర్లతో సిబ్బంది నిర్విరామంగా మంటలార్పుతూనే ఉన్నారు. దుకాణానికి మూడు దిక్కులా జేసీబీతో పగులగొట్టి లోపలి కి వెళ్లిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు చాలా కష్టపడ్డారు. రెండంతస్తులు మొత్తం పుస్తకాలతో నిండి ఉండడంతో మంటలు సులువుగా వ్యాపించాయి. దట్టమైన పొగలు హన్మకొండ చౌరస్తా అంతా వ్యాపించా యి. వేడికి తట్టుకోలేని భవనం మొత్తం పగుళ్లుబారింది. ఏ క్షణాన్నైనా భవనం కూలిపోయే అవకాశం ఉందని భావించారు. వెల కట్టలేని పుస్తకాలు, కూలిపోయిన భవనంతో కలిపి సుమారు. 5 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. కాలిపోయిన కాగితాలు గాలిలో ఎగురుతూ హన్మకొండలో మూడు, నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఇళ్లు, రోడ్లపై పడ్డాయి. రాత్రి పొద్దుపోయే వరకు ఫైరింజన్‌తో నీళ్లు కొడు తూ మంటలు ఆర్పుతూనే ఉన్నారు.
రెండు జిల్లాల పుస్తక కేంద్రం..
వరంగల్‌తోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు పుస్తకాల కోసం జుబేర్ బుక్‌స్టాల్ కు వస్తుండేవారు. కొత్త పుస్తకాలు కొనుగోలు చేయలేని పేదవిద్యార్థులకు ఇక్కడ సెకండ్‌హ్యాండ్ పుస్తకాలు తక్కువ ధరకు లభించేవి. అంతేకాదు జుబేర్‌లో దొరకని పుస్తకమంటూ ఉండదంటే అతిశయోక్తికాదు. ఆ నమ్మకంతోనే వచ్చే విద్యార్థులకు పుస్తకాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ లాభానికి అమ్మి వారి అభిమానాన్ని జుబేర్ చూరగొన్నారు. అందరితో కలి విడిగా ఉండే ఆయనకు సౌమ్ముడిగా పేరుంది. సేవాభావంతో పేదలకు ఉచితంగా పుస్తకాలం దించే ఆయన దుకాణం కాలుతుందని తెలుసుకున్న అనేక మంది సంఘటన స్థలానికి చేరుకు ని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పలు చోట్ల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వర కు తండోపతండాలుగా తరలివచ్చి చూశారు.
డబ్బాగా ప్రారంభమై.. రెండంతస్తుల దుకాణంగా ఎదిగి..
మొదట కొన్ని పుస్తకాలతో చౌరస్తాలో ఒక డబ్బాలో పుస్తకాలు అమ్మిన జుబేర్ కష్టపడి నిజాయితీగా పెకైదిగాడు. సుమారు 50 మందికిపైగా యువకులకు ఉపాధి కల్పించా డు. 30 ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న తన పుస్తకగని అగ్నికి ఆహుతి కావడంతో సంఘటన స్థలం వద్దే కుప్పకూలిపోయాడు. షాక్‌కు గురై ఆస్పత్రిపాలైన జుబేర్ తేరుకున్నాక సమాచారం సేకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం షార్ట్‌సర్య్కూటా ? కాదా ? అనే అంశంపై విచారణ చేస్తామని తెలిపారు.