
ప్రతీకాత్మక చిత్రం
వివాహ వేడుకల్లో హంగు, ఆర్భాటాలు ప్రదర్శించడం చూస్తుంటాం.. కానీ సంగారెడ్డి జిల్లాలో ఇటీవల వివాహ వేడుకల్లో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పెళ్లి మండపంలో మహనీయుల పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంబేడ్కర్, జ్యోతిబాపూలే, సావిత్రిబాయిపూలే, భగత్‌సింగ్ వంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, ప్రముఖుల సాహిత్య రచనలకు సంబంధించిన పుస్తకాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నారు.
వివాహ వేడుకలకు హాజరయ్యే బంధుమిత్రులు ఈ పుస్తక ప్రదర్శనను వీక్షించి, తమకు నచ్చిన పుస్తకాలను కొనుక్కుంటున్నారు. కొందరు ఈ పుస్తకాలను వధూవరులకు బహుమతులుగా కూడా ఇస్తున్నారు. ఫంక్షన్‌హాలులోకి ప్రవేశించే ప్రదేశంలో ఈ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా పుస్తకాలను వీక్షిస్తున్నారు.
సాక్షి, సంగారెడ్డి: అందోల్ పట్టణానికి చెందిన తలారి లక్ష్మణ్ రెవెన్యూ శాఖలో ఆర్‌ఐగా పనిచేస్తున్నారు. తన కూతురు వివాహాన్ని బౌద్ధమత ఆచారం ప్రకారం ఘనంగా నిర్వహించిన లక్ష్మణ్, ఈ వివాహ వేడుకలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సమతా సైనిక్ సేవాదళ్‌లో పనిచేస్తున్న జహీరాబాద్‌కు చెందిన ఎర్రోళ్ల విష్ణు తన వివాహ వేడుకలో కూడా ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయించాడు. అందోల్‌కు చెందిన ఆది తక్షక్ తన తండ్రి వర్ధంతి సందర్భంగా కూడా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయించారు.
ఆసక్తి పెరిగేలా..
సోషల్ మీడియా ప్రభావంతో చాలా మందిలో పుస్తక పఠనాసక్తి తగ్గిపోతోంది. పుస్తక ప్రదర్శనలకు గానీ, బుక్ స్టాల్‌కు గానీ వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆదర్శభావాలు ఉన్న వారు వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో పుస్తకాలను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా పుస్తకాలపై మళ్లీ ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. వివాహ వేడుకలకు వందలు, కొన్ని చోట్ల వేలల్లో హజరవుతుంటారు. ఈ ప్రదర్శనలతో కొందరిలోనైనా పుస్తకాల పట్ల ఆసక్తి కలిగేలా చేసినా చాలని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
పుస్తకం ఆయుధం లాంటిది
పుస్తకం జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఒక ఆయుధం లాంటిది. వివాహ వేడుకలకు బంధుమిత్రులు, సన్నిహితులు.. అందరూ హాజరవుతారు. పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా వారిలో మహనీయుల పుస్తకాలను చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. అందుకే నా కూతురు వివాహంలో ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయించాను.
– తలారి లక్ష్మణ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, అందోల్, సంగారెడ్డి జిల్లా
నా మ్యారేజీ నుంచే మార్పురావాలని
సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది సెల్‌ఫోన్‌లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా యువత పుస్తకాలు చదవడం మానేశారు. మహనీయుల పుస్తకాలను చదవడం ద్వారా ఆలోచన శక్తిని పెంచుకోవచ్చు. సన్మార్గంలో నడిచేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటి పుస్తక ప్రదర్శన కల్చర్ పెరగాలని కోరుకుంటున్నాను. నా మ్యారేజీ నుంచే ఈ మార్పు రావాలని భావించి పెళ్లిలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయించాను.
– ఎర్రోళ్ల విష్ణు, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
ఫోన్ చేస్తే వెళ్లి స్టాల్ ఏర్పాటు చేస్తున్నాం
బుక్‌స్టాల్ ఏర్పాటు చేయాలని ఎవరైనా 9848397857 నంబర్‌కు ఫోన్ చేసి చెబితే అక్కడికి వెళ్లి ఏర్పాటు చేస్తున్నాము. మహనీయుల జీవిత చరిత్రలు, సాహిత్య రచనలు.. ఇలా అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతాము. వివాహాలతోపాటు, ఇతర శుభకార్యాలకు చెప్పినా వెళ్లి పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నాం.
– నగేశ్, పుస్తక ప్రదర్శన నిర్వాహకులు, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment