మారిన మనిషి | The man turned | Sakshi
Sakshi News home page

మారిన మనిషి

Published Tue, Feb 11 2014 6:21 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

మారిన మనిషి - Sakshi

మారిన మనిషి

  • పరివర్తన నేర్పిన ‘జైలు’
  •   టీ స్టాల్‌తో జీవనోపాధి
  •   కొత్త జీవితానికి పోలీసుల సాయం
  •  కుషాయిగూడ, న్యూస్‌లైన్ :  ‘ చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే... అన్యాయంగా సంపాదించిన డబ్బు కంటే భార్యాపిల్లలతో ఆనందంగా గడపడమే గొప్ప... తప్పు చేసిన వారు ఎప్పటికైనా మానసిక క్షోభను అనుభవించాల్సిందే... ఈ మాటలన్నది సాధువో, సంఘ సంస్కర్తో,  అధికారో, రాజకీయ నాయకుడో కాదు. తాను చేసిన తప్పులకు జైల్లో ఏళ్ల తరబడి శిక్ష అనుభవించడంతో తనలో వచ్చిన పరివర్తనతో ఓ పాతనేరస్తుడి మనసులోంచి వచ్చిన మాటలివి.
     
    జీవనోపాధికి పోలీసుల అండ...

    తనలాగా మరొకరు దొంగలా తయారు కావద్దని, అందుకు తనవంతుగా ప్రచారం చేస్తానని చెబుతున్న ఓ పాత నేరస్తునికి కుషాయిగూడ పోలీసులు  అండ గా నిలిచారు. జీవనోపాధి కోసం ఈసీఐఎల్ బస్ టర్మినల్ వద్ద టీస్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికంగా సాయమందించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ టీ-స్టాల్ ఏర్పాటుకు దాతల సహకారం తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు.
     
    కుటుంబంతో ఆనందంగా గడపాలని...
     
    చేసిన నేరాలకు పశ్చాత్తాపం చెందుతున్నానని, పిల్ల ల కోసం, వారికి మంచి భవిష్యత్తును అందించేందుకే ఇక నుంచి తన జీవితం కొనసాగుతుందని పేర్కొంటున్న పాతనేరస్తుడు రాజు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తానంటున్నాడు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచన మేరకు పోలీసులు ఇటీవల 900 మంది పాతనేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత డిసెంబర్ 28న మల్కాజిగిరి సీసీఎస్‌లో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు రాజు భార్యాపిల్లలతో పాటు హాజరయ్యాడు. తనలో మార్పుకు పోలీసుల చర్యలు ఊతమిచ్చాయని, ఇకనుంచి కుటుంబంతో ఆనందంగా గడిపేందుకే ప్రాధాన్యతనిస్తానని అతనంటున్నాడు.
     
    పోలీసులపై అపోహలొద్దు...
     
    కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కేసులో రెండేళ్ల శిక్ష ఖరారవడంతో చివరిసారిగా రాజు జైలుకు వెళ్లి గత డిసెంబర్ 28న విడుదలయ్యాడు. ఈ మధ్యలో భార్య అనారోగ్యం పాలవడం, పిల్లలకు తన అవసరాన్ని గుర్తించడం, జైలు సంస్కరణల్లో భాగంగా అధికారులు చెప్పిన మాటలతో... మనసు మారిన రాజు తాను ఏదైనా పనిచేసి సొంతంగా సంపాదించుకుంటూ భార్యా పిల్లలను పోషించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మల్కాజిగిరి సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామ్‌కుమార్ సహకారంతో సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి విన్నవించుకోగా, ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు, వారి ప్రవర్తనపై అపోహలొద్దని, పాతనేరస్తులు ఎవరైనా తనలాగా జీవనోపాధి చూసుకోవాలని రాజు చెప్తున్నాడు.
     
     నేర ప్రస్థానం...
     పేరు: మారినేని రాజు(36)
     అలియాస్ జయరాజు అలియాస్ విజయరాజు
     స్వగ్రామం: కమ్మగూడ దామెర భీమనపల్లి, నల్లగొండ జిల్లా
     భార్య, సంతానం: వరంగల్ జిల్లాకు చెందిన ప్రియాంకను 2004 ఫిబ్రవరి 22న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదిత్య, విశాల్‌లు సంతానం.
     నగరంలో నివాసం: అల్వాల్‌లోని గబ్బిలాలపేట
     తొలి నేరం: తోటి కూలీ హత్య
     కేసులు: 107 (103 చైన్‌స్నాచింగ్‌లు, ఒక కిడ్నాప్, 3 హత్య కేసులు)
     
     ఇది తొలివిజయం : సీవీ ఆనంద్
     పాతనేరస్తుల్లో పరివర్తన కలిగించి, వారిని మా మూలు జీవితం గడిపేందుకు ప్రోత్సహించడం ద్వారా నేరాలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ సమీపంలో పాతనేరస్తుడు రాజుతో ఏర్పాటు చేయించిన టీస్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు 900 మంది పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చామని, అందులో తాము సాధించిన ‘మొదటి విజయం ఇది’ అ న్నారు. భార్యాపిల్లలతో కలిసి పాతనేరస్తులు మా మూలు జీవితం గడిపేందుకు ముందుగా వారిలో వచ్చిన పరివర్తనను అంచనా వేస్తామని, వారు గతంలో చేసిన నేరాల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ క్రైం డీసీపీ జానకీ షర్మిల, మల్కాజిగిరి డీసీపీ నవదీప్ సింగ్, అల్వాల్ ఏసీపీ ప్రకాశరావు, క్రైం ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్లు కె.వెంకట్ రెడ్డి, రమేష్ కొత్వాల్, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement