C.V.Anand
-
‘చేతులు చాచకుండా బతకలేరా?’
హైదరాబాద్: పౌరసరఫరాల శాఖలోని అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులపై వస్తున్న విమర్శలు, అవినీతి ఆరోపణలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు తాత్కాలిక ఉద్యోగులపై ఆయన వేటు వేశారు. పదవీ విరమణ తర్వాత తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్న ఎంఎస్ఏ సలీం (కరీంగనర్), జె.భాస్కర్‌రెడ్డి(నల్లగొండ), వి.వెంకటరమణ (ఖమ్మం), ఎం.బాల్‌రెడ్డి (రంగారె డ్డి)లపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. తీరు మారకుంటే రెగ్యులర్ ఉద్యోగులపైనా చర్యలు తప్పవని సీవీ ఆనందర్ హెచ్చరించారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో జిల్లా మేనేజర్లు, టెక్నికల్ సిబ్బందితో సమావేశమైన ఆయన ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. ‘కార్పొరేషన్ జీతాలు ఇస్తున్నా.. చేతులు చాచకుండా పనిచేయాలేరా.. మీకు ఇదేం రోగం’ అని మండిపడ్డారు. ఒకవైపు కఠినంగా ఉంటున్నామంటుంటే టెక్నికల్ సిబ్బంది ఏకంగా మిల్లర్ల నుంచి పర్సెంటేజీలు పెంచుకుంటూ పోతున్నారా అని నిలదీశారు. ‘ కనీసం 30శాతం మిల్లర్లతో మీరు కుమ్మక్కయ్యారు. ప్రతీ 270 క్వింటాళ్లకు ఒక రేటు ఫిక్స్ చేశారు. మీరెవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకుంటున్నారో నా దగ్గర ఏసీబీ, విజిలెన్స్, ఇంటలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. ఇకపై మీ పద్దతులు మార్చుకోవాల్సిందే..’ అని కమిషనర్ హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి కీలకమైనదని, నిజాయితీగా పనిచేస్తున్న మిల్లర్లను కూడా కొందరు ఉద్యోగులు వదలడం లేదని, తప్పులు చేసే వారిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ‘ కార్పొరేషన్‌ను చంపకండి. బతికించుకోండి. హౌసింగ్ కార్పొరేషన్ పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది కదా..? అ పరిస్థితిని మీరు కొనితెచ్చుకుంటే ఎలా? మిల్లర్ల దగ్గర చేతులు చాపకండి.. వారితో డిన్నర్లు, లంచ్‌లు చేయకండి.. నిజాయితీ పరులను పీడించకండి..’ అని హితవు పలికారు. -
ఇటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అటు సోదాలు
వీకెండ్లో బిజీబిజీగా గడిపిన సైబరాబాద్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: ఒకపక్క రాఖీ పండుగ.., మరోపక్క వీకెండ్. అయినా సైబరాబాద్ పోలీసులు మాత్రం విధి నిర్వహణలో ఆదివారం బిజీబిజీగా గడిపారు. శంషాబాద్‌జోన్‌లో 250 మందితో ‘కార్డన్ అండ్ సర్చ్’ నిర్వహించగా, మరోపక్క ఎల్బీనగర్, బాలానగర్ జోన్ పోలీసులకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన తరగతులు నిర్వహించారు. ప్రజల్లో పోలీసు ప్రతిష్టను మరింత పెంచేందుకు నడుంబిగించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ .. ముందుగా తమ సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అన్ని ఠాణాల సిబ్బందిని ఒక్కచోట కూర్చోబెట్టి అవగాహన తరగతులు నిర్వహించాలని ఆయా జోన్ల డీసీపీలను ఆదేశించారు. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలి, బాధితులకు ఎలా సాయమందించాలనే విషయాలపై సిబ్బందికి వివరించాలని ఆయన సూచించారు. ఐపీఎస్ అధికారి నుంచి కానిస్టేబుల్ వరకూ వారి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే ప్రజల నుంచి పోలీసులకు మన్ననలు అందుతాయని కమిషనర్ భావిస్తున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు బాలానగర్, ఎల్బీనగర్ డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, విశ్వప్రసాద్‌లు తమ జోన్ పరిధిలో ఆదివారం పోలీసు సిబ్బందికి ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించారు. కార్డన్ సర్చ్.. సైబరాబాద్‌లో శాంతి భద్రతలు, నేరాలు అదుపునకు మరోపక్క జోన్ల వారీగా ఇప్పటికే కార్డన్ సర్చ్ (బస్తీ గస్తీ) కార్యక్రమం నిర్వహిస్తూ నేరస్తులను పసిగట్టే పనిలో పడ్డారు. గత పదిహేను రోజుల్లో బాలానగర్, మాదాపూర్ డీసీపీ జోన్ల పరిధిలో కార్డన్ సర్చ్‌లో వందలాది దొంగ వాహనాలు, పదుల సంఖ్యలో నేరస్తులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇది నేరస్తులను సైబరాబాద్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసేందుకు ఎంతో ఉపకరిస్తోంది. తాజాగా, ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ జోన్ పరిధిలో డీసీపీ రమేష్‌నాయుడు, క్రైమ్స్ ఇన్‌ఛార్జి డీసీపీ జి.జానకీషర్మిల నేతృత్వంలో 250 మంది పోలీసులు పహాడీషరీఫ్‌లోని శ్రీరామ్‌కాలనీ, మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని లక్ష్మీగూడలో కార్డన్ సర్చ్ నిర్వహించి 44 వాహనాలను సీజ్ చేశారు. మరో ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
మారిన మనిషి
పరివర్తన నేర్పిన ‘జైలు’ టీ స్టాల్‌తో జీవనోపాధి కొత్త జీవితానికి పోలీసుల సాయం కుషాయిగూడ, న్యూస్‌లైన్ : ‘ చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే... అన్యాయంగా సంపాదించిన డబ్బు కంటే భార్యాపిల్లలతో ఆనందంగా గడపడమే గొప్ప... తప్పు చేసిన వారు ఎప్పటికైనా మానసిక క్షోభను అనుభవించాల్సిందే... ఈ మాటలన్నది సాధువో, సంఘ సంస్కర్తో, అధికారో, రాజకీయ నాయకుడో కాదు. తాను చేసిన తప్పులకు జైల్లో ఏళ్ల తరబడి శిక్ష అనుభవించడంతో తనలో వచ్చిన పరివర్తనతో ఓ పాతనేరస్తుడి మనసులోంచి వచ్చిన మాటలివి. జీవనోపాధికి పోలీసుల అండ... తనలాగా మరొకరు దొంగలా తయారు కావద్దని, అందుకు తనవంతుగా ప్రచారం చేస్తానని చెబుతున్న ఓ పాత నేరస్తునికి కుషాయిగూడ పోలీసులు అండ గా నిలిచారు. జీవనోపాధి కోసం ఈసీఐఎల్ బస్ టర్మినల్ వద్ద టీస్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికంగా సాయమందించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ టీ-స్టాల్ ఏర్పాటుకు దాతల సహకారం తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. కుటుంబంతో ఆనందంగా గడపాలని... చేసిన నేరాలకు పశ్చాత్తాపం చెందుతున్నానని, పిల్ల ల కోసం, వారికి మంచి భవిష్యత్తును అందించేందుకే ఇక నుంచి తన జీవితం కొనసాగుతుందని పేర్కొంటున్న పాతనేరస్తుడు రాజు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తానంటున్నాడు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచన మేరకు పోలీసులు ఇటీవల 900 మంది పాతనేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత డిసెంబర్ 28న మల్కాజిగిరి సీసీఎస్‌లో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు రాజు భార్యాపిల్లలతో పాటు హాజరయ్యాడు. తనలో మార్పుకు పోలీసుల చర్యలు ఊతమిచ్చాయని, ఇకనుంచి కుటుంబంతో ఆనందంగా గడిపేందుకే ప్రాధాన్యతనిస్తానని అతనంటున్నాడు. పోలీసులపై అపోహలొద్దు... కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కేసులో రెండేళ్ల శిక్ష ఖరారవడంతో చివరిసారిగా రాజు జైలుకు వెళ్లి గత డిసెంబర్ 28న విడుదలయ్యాడు. ఈ మధ్యలో భార్య అనారోగ్యం పాలవడం, పిల్లలకు తన అవసరాన్ని గుర్తించడం, జైలు సంస్కరణల్లో భాగంగా అధికారులు చెప్పిన మాటలతో... మనసు మారిన రాజు తాను ఏదైనా పనిచేసి సొంతంగా సంపాదించుకుంటూ భార్యా పిల్లలను పోషించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మల్కాజిగిరి సీసీఎస్ ఇన్స్పెక్టర్ రామ్‌కుమార్ సహకారంతో సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి విన్నవించుకోగా, ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు, వారి ప్రవర్తనపై అపోహలొద్దని, పాతనేరస్తులు ఎవరైనా తనలాగా జీవనోపాధి చూసుకోవాలని రాజు చెప్తున్నాడు. నేర ప్రస్థానం... పేరు: మారినేని రాజు(36) అలియాస్ జయరాజు అలియాస్ విజయరాజు స్వగ్రామం: కమ్మగూడ దామెర భీమనపల్లి, నల్లగొండ జిల్లా భార్య, సంతానం: వరంగల్ జిల్లాకు చెందిన ప్రియాంకను 2004 ఫిబ్రవరి 22న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదిత్య, విశాల్‌లు సంతానం. నగరంలో నివాసం: అల్వాల్‌లోని గబ్బిలాలపేట తొలి నేరం: తోటి కూలీ హత్య కేసులు: 107 (103 చైన్‌స్నాచింగ్‌లు, ఒక కిడ్నాప్, 3 హత్య కేసులు) ఇది తొలివిజయం : సీవీ ఆనంద్ పాతనేరస్తుల్లో పరివర్తన కలిగించి, వారిని మా మూలు జీవితం గడిపేందుకు ప్రోత్సహించడం ద్వారా నేరాలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ సమీపంలో పాతనేరస్తుడు రాజుతో ఏర్పాటు చేయించిన టీస్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు 900 మంది పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చామని, అందులో తాము సాధించిన ‘మొదటి విజయం ఇది’ అ న్నారు. భార్యాపిల్లలతో కలిసి పాతనేరస్తులు మా మూలు జీవితం గడిపేందుకు ముందుగా వారిలో వచ్చిన పరివర్తనను అంచనా వేస్తామని, వారు గతంలో చేసిన నేరాల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ క్రైం డీసీపీ జానకీ షర్మిల, మల్కాజిగిరి డీసీపీ నవదీప్ సింగ్, అల్వాల్ ఏసీపీ ప్రకాశరావు, క్రైం ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు కె.వెంకట్ రెడ్డి, రమేష్ కొత్వాల్, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.