తిరుపతి కల్చరల్: వృత్తినే జీవనాధారంగా చేసుకుని బతుకులు వెళ్లదీస్తున్న వడ్డెర్ల పట్ల పాలకులు చూపుతున్న వివక్షతో భద్రత కోల్పోతున్నారని ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్ తెలిపారు. ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం నగర కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వడ్డెర వృత్తిదార్లు సుమారు 25 లక్షల మంది ఉన్నారన్నారు.
ఇందులో 15 లక్షల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారన్నారు. వృత్తిలో జరిగే ప్రమాదంలో వీరు చనిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోయారు. వీరి కున్న సంక్షేమ పథకాలు కూడా నామ మాత్రమే అయినప్పటికీ అవి కూడా సక్రమంగా అందడంలేదన్నారు. ప్రభుత్వం వడ్డెర్ల సంక్షేమానికి బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గుట్టలపై, క్వారీలపై పూర్తి హక్కు వడ్డెర వృత్తిదారులకు ఇవ్వాలన్నారు.
జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ఫెడరేషన్‌కు నిధులు కేటాయించాలన్నారు. వృత్తిరీత్యా చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. సొసైటీల ద్వారా లేదా వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి వడ్డెర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు మోహన్, రవి, రమణ, వెంకటరమణయ్య, చక్రవేలు, రవికుమార్ తది తరులు పాల్గొన్నారు.
పాలకుల వివక్షతో వడ్డెర్లకు భద్రత కరువు
Published Mon, Oct 20 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM
Advertisement
Advertisement