సాక్షి, హైదరాబాద్: నాడు నిజాం సంస్థానంలో వేడుకలు జరిగితే ఆహ్వాన పత్రాలు ఎక్కడ ముద్రించే వారో తెలుసా..? నిజాం ఫర్మానాలు ఎక్కడ ప్రింట్ అయ్యేవో తెలుసా..? ఇప్పుడంటే ప్రింటింగ్‌లో కొత్తకొత్త టెక్నాలజీలు దూసుకొస్తున్నాయి.. మరి నాడు ఏ టెక్నాలజీ వాడారు? మన భాగ్యనగరంలో ప్రింటింగ్ శకం ఎప్పుడు మొదలైంది? సరిగ్గా 125 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో తొలి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభమైంది. దాని పేరు షమ్‌సుల్ ఇస్లాం ప్రెస్. 1892లో డిసెంబర్ నెలలో అప్పటి ప్రముఖ మార్కెట్ అయిన ఛత్తాబజార్‌లో దీన్ని ప్రారంభించారు. నేడు అదే ప్రాంతంలో ఒకటి కాదు రెండు కాదు.. 300కుపైగా ప్రింటింగ్ ప్రెస్‌లు ఏర్పాటయ్యాయి.
ఇలా ఒకేచోట ఇన్ని ప్రింటింగ్ ప్రెస్‌లు ఉండటం, వాటి ద్వారా వేలాది మందికి ఉపాధి పొందడం దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరెక్కడా లేదనడం అతిశయోక్తి కాదు! విజిటింగ్ కార్డు మొదలుకొని... వెడ్డింగ్ కార్డులు, బ్రోచర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, బ్యాడ్జీలు, ఐడెంటిటీ కార్డులు, కంపెనీలకు లోగోలు, పుస్తకాలు, క్యాలెండర్ల ప్రింటింగ్.. ఇలాంటి వాటన్నింటికీ ఛత్తాబజార్ చిరునామాగా మారింది. అఫ్జల్‌గంజ్ నుంచి చార్మినార్ వెళ్లే దారిలో మదీనా చౌరస్తాకు ఎడమ వైపున ఉన్న గల్లీలోకి ప్రవేశించగానే ఈ ప్రింటింగ్ ప్రపంచం స్వాగతం పలుకుతుంది. మాన్యువల్ స్క్రిప్ట్‌తో వస్తే చాలు తెలుగు, హిందీ, ఉర్దూ, అరబీతోపాటు ఇతర భాషల్లోకి అనువాదాల పని కూడా ఇట్టే పూర్తవుతుంది. ఇక్కడి ప్రింటింగ్ ప్రెస్‌లలో వార, పక్ష, మాస, దినపత్రికలు అచ్చువుతుండటం గమనార్హం.
వేల కుటుంబాలకు జీవనోపాధి
ఛత్తాబజార్ ప్రింటింగ్ ప్రెస్‌లలో దాదాపు 5 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరంతా ప్రింటింగ్, బైండింగ్, స్క్రీన్ ప్రింటింగ్ తదితర విభాగా ల్లో పని చేస్తున్నారు. ఇక్కడ కొంతకాలం పనినేర్చుకుంటున్న యువకులు తర్వాత తమ ప్రాంతాల్లో సొంతంగా ప్రింటింగ్ ప్రెస్‌లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఉర్దూ భాషలో ఛత్ అంటే పైకప్పు. ఇక్కడున్న కమాన్‌లపై ఛత్‌లు ఉన్నాయి. అలాగే పూర్వం ఇక్కడి చిన్నచిన్న దుకాణాలపైన గుడారాల్లాంటి కప్పులు ఉండేవట. దీంతో ఈ బజార్‌కు ఛత్తాబజార్ అని పేరొచ్చిందని చెబుతారు.
షమ్‌సుల్ ఇస్లాం.. తొలి ప్రింటింగ్ ప్రెస్..
సరిగ్గా 125 ఏళ్ల కిందట షమ్‌సుల్ ఇస్లాం పేరిట నగరంలో తొలి ప్రింటింగ్ ప్రెస్ వెలిసింది. దీన్ని ప్రారంభించిన సయ్యద్ గౌసుద్దీన్.. ఆ రోజుల్లో కాతిబ్ ( క్యాలీగ్రాఫీ) రాసేవారు. నిజాం సంస్థానంలో వేడుకలు జరిగినప్పుడు ఆహ్వాన పత్రికలతోపాటు ఫర్మానాలు కూడా రాయించే వారు. రాయడానికి అవసరమైన కలం, ఇంక్‌లను కొనేందుకు తరచూ బొంబాయి వెళ్లేవారు. ఈ క్రమంలో అక్కడున్న ప్రెస్‌లను చూసి హైదరాబాద్‌లో 1892లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇందులోనే నిజాం కార్యాలయానికి సంబంధించిన దాదాపు అన్ని దస్తావేజులు ముద్రించే వారు. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వివాహ ఆహ్వాన పత్రాలను కూడా ఇక్కడే ముద్రించారు.
మాదే తొలి ప్రెస్
125 ఏళ్ల కిందట మా తాత ఈ ప్రెస్‌ను ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆయన కాతిబ్ రాసేవారు. ముంబై నుంచి ప్రెస్‌కు సంబంధించిన మొత్తం సామగ్రి తెచ్చి దీన్ని ఏర్పాటు చేశారు. ఆయన తర్వాత మా నాన్న మీర్ ఖమురొద్దీన్ నడిపారు. ఇప్పుడు నేను ఈ ప్రెస్‌ను కొనసాగిస్తున్నా.
– మీర్ అహ్మద్ అలీ, షమ్‌సుల్ ఇస్లాం ప్రెస్
ఇది లిథో ప్రింటింగ్ టెక్నాలజీ. చాలా పురాతన విధానం. ఇందులో తొలుత బటర్ పేపర్‌పై ప్రింట్ తీస్తారు. తర్వాత ఆ పేపర్‌ను ప్లేట్‌పై అతికించి ఇలా వేడి చేస్తే పేపర్‌పై ఆక్షరాలు ప్లేట్‌పై అచ్చవుతాయి. తర్వాత ప్లేట్‌ను మిషన్‌కు అనుసంధానించి ప్రింట్లు తీస్తారు.
నగరంలో అచ్చయిన మొట్టమొదటి చార్మినార్ చిత్రం
నగరంపై 125 ఏళ్ల ముద్ర
Published Wed, Dec 6 2017 2:47 AM | Last Updated on Wed, Dec 6 2017 4:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment