175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అన్ని రకాల బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఇక్కడే..
విజయవాడలోని గవర్నమెంట్ ప్రెస్ పనిచేయకపోవడంతో అన్నీ కర్నూలులోనే...
24 గంటలు పని చేస్తున్న కర్నూలు రీజనల్ ప్రింటింగ్ ప్రెస్
కర్నూలు(సెంట్రల్): కర్నూలులోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కేంద్రం(రీజనల్ ప్రింటింగ్ ప్రెస్)కు అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు సంబంధించిన సర్విస్ బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలపై అతికించే బ్యాలెట్ పేపర్లు, ఎన్నికలకు అవసరమైన ఇతర అన్ని రకాల పేపర్లను ఇక్కడే ముద్రిస్తున్నారు. విజయవాడలోని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ పనిచేయకపోవడంతో ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల బ్యాలెట్ పేపర్లు, ఇతర పేపర్లను ముద్రించే బాధ్యతను కర్నూలు రీజనల్ ప్రింటింగ్ ప్రెస్‌కు అప్పగించారు.
విజయవాడలో ప్రెస్ మూతబడటంతో...
ప్రస్తుతం మన రాష్ట్రంలో కర్నూలు, విజయవాడలో మాత్రమే ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మె ల్యే, ఎంపీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల బ్యాలెట్లు, పేపర్లను ఈ ప్రెస్‌లలోనే ముద్రిస్తారు. గతంలో విజయవాడ ప్రింటింగ్ ప్రెస్‌లో కోస్తాంధ్రా, ఉత్తరాంధ్రలకు సంబంధించిన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల బ్యాలెట్ పేపర్లను ముద్రించేవారు. కర్నూలులోని ఎన్‌ఆర్‌పేటలో ఉన్న రీజనల్ ప్రింటింగ్ ప్రెస్‌లో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్, ఇతర పేపర్లను ముద్రించేవారు.
అయితే, ఇటీవల విజయవాడ ప్రింటింగ్ ప్రెస్ మూతపడటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కర్నూలులోనే ముద్రిస్తున్నారు. ఈ మేరకు నామినేషన్ల ఉపసంహరణ తర్వా త 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థులు, వారి గుర్తులతో కూడిన బ్యాలెట్ పేపర్ల ముద్రణ ముమ్మరంగా సాగుతోంది. సుమారు 150 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటలు పనిచేస్తూ సకాలంలో బ్యాలెట్లు, ఇతర పేపర్ల ముద్రణకు కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment