
జేపీసీకి తెలియజేసిన కేంద్ర న్యాయశాఖ
న్యూఢిల్లీ: ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలన్న అంశం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిధిలోకి రాదని కేంద్ర న్యాయ శాఖ తేల్చిచెప్పింది. జమిలి ఎన్నికల బిల్లుపై ఏర్పాటైన జేపీసీకి ఈ మేరకు రాతపూర్వకంగా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించే విధానాన్ని మళ్లీ తీసుకురావాలని కమిటీలోని కొందరు సభ్యులు సూచించగా, కేంద్ర న్యాయశాఖ దీనిపై స్పందించింది.
ఈ అంశం జేపీసీ పరిధిలోకి రాదని పేర్కొంది. ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలా? లేక బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలా? అనేది పరిశీలించే అధికారం జేపీసీకి లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. జమిలి ఎన్నికలు అప్రజాస్వామికం కాదని స్పష్టంచేసింది. ఈ ఎన్నికల వల్ల దేశ సమాఖ్య నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగదని పేర్కొంది. బ్యాలెట్ పేపర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు సైతం ఈవీఎంలౖవైపే మొగ్గు చూపుతోంది. పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment