తారుమారు
- హైదరాబాద్ లోక్‌సభ ఈవీఎంలలో మల్కాజిగిరి బ్యాలెట్ పత్రాలు
- ఎన్నికల అధికారి పరిశీలనలో వెల్లడి
- విచారణకు ఆదేశం
- అర్ధరాత్రి వరకు ఈవీఎంల పునఃపరిశీలన
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. వివిధ లోక్‌సభ నియోజకవర్గాల కోసం ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించిన బ్యాలెట్ పత్రాలు (ఈవీఎంలలో అమర్చేవి) ఈవీఎంలలోకి వచ్చేసరికి మారిపోయాయి. బుధవారం మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర ్వహించిన ఈవీఎం ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఒక ఈవీఎంను పరిశీలించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాతో ఉండాల్సిన బ్యాలెట్ పత్రం స్థానంలో మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్ పత్రం ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని బహదూర్‌ఫుర అసెంబ్లీ నియోజకవర్గంలో వినియోగించాల్సిన దాదాపు 21 ఈవీఎంలలో ఇదే పరిస్థితి. మల్కాజిగిరి లోక్‌సభకు సంబంధించిన సుమారు 1000 బ్యాలెట్ పత్రాలు హైదరాబాద్ లోక్‌సభకు వచ్చాయని తెలిసింది. షాక్ నుంచి తేరుకున ్న ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించారు.
బ్యాలెట్ పత్రాల ముద్రణ పనులకు ఇన్‌చార్జిగా ఉన్న స్పెషల్ కమిషనర్ రాహుల్ బొజ్జాపై సీరియస్ అయ్యారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఇదిలా ఉంటే.. బ్యాలెట్ పత్రాలను కనీసం పరిశీలించకుండా ఈవీఎంలలో అమర్చిన బహదూర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మాసుమ బేగంపై హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సీసీఎల్‌ఏ, యూఎల్సీ నుంచి 26మంది డిప్యూటీ కలెక్టర్లను పిలిపించి అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను తనిఖీ చేయిం చారు. ఆయా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి బ్యాలెట్ యూనిట్ నెంబరు, కంట్రోల్ యూనిట్ నెంబరు సరిపోలుతున్నాయా.. లేదా?, ఈవీఎంలలో అమర్చిన బ్యాలెట్ పత్రం అదే అసెంబ్లీ/లోక్‌సభ నియోజకవర్గానిదా.. కాదా?, ఈవీఎంలకు తగిలించిన ట్యాగ్‌లలో పోలింగ్ స్టేషన్ అడ్రస్ సరిగా ఉందా..లేదా?..తదితర అం శాలను క్షుణ్ణంగా పరిశీలించాలని డిప్యూటీ కలె క్టర్లను ఆదేశించారు. అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగినట్లు సమాచారం.