సాక్షి, న్యూఢిల్లీ: బ్యాలెట్ పేపర్ ఎన్నికల డిమాండ్ ఒక్కసారిగా పుంజుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చొరవతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. మంగళవారం హస్తినలో ఆమె పలు పార్టీల నేతలతో వరుస చర్చలు జరిపిన విషయం విదితమే. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లతో ఆమె భేటీ అయి ఈ అంశంపై మంతనాలు సాగించారు.
సుమారు 15 జాతీయ పార్టీలు.. ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లనే వాడాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈసీ ముందు తమ గళాన్ని బలంగా వినిపించేందుకు విపక్షాలు సిద్ధమౌతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్, డీఎంకే, జేడీఎస్, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌ను డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు శివసేన కూడా వీరికి జత కలిసినట్లు సమాచారం. (ఈవీఎంలకు వ్యతిరేకంగా ఐక్యత)
ఈ మేరకు వచ్చే వారం ఆయా పార్టీ ప్రతినిధులంతా భేటీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ముందు తమ డిమాండ్ ఉంచాలన్న నిర్ణయానికి వచ్చారు. ఉత్తర ప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో ముందుండి చక్రం తిప్పటం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని మమతా బెనర్జీ యత్నిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment