బెంగళూరు : ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ( ఈవీఎం)లను ఉపయోగిస్తే కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలనే యోచనలో ప్రతిపక్షాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీలన్ని ఐక్యంగా ఎలక్షన్ కమిషన్‌పై ఒత్తడి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే గెలిచిందని ఆరోపించాయి.
మోదీ ప్రభుత్వం ఏ బటన్ నొక్కినా బీజేపీకి ఓటు పడేటట్లు ఈవీఎంలను రూపొందించి ఎలక్షన్‌లలో గెలుస్తుందని విమర్శించారు. ఆమ్‌ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ నేత మాయవతి, తృణమల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత లాలు యాదవ్, లెఫ్ట్ పార్టీ నుంచి సీతారం ఏచూరి ఈ మేరకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ నిర్ణయంపై ఇంకా స్పందించలేదని సమాచారం.
ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న రాహుల్ గాంధీకి మోదీని ఎదుర్కునేందుకు కర్ణాటక ఎన్నికలు మంచి అవకాశం అని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల యూపీలో జరిగిన లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే గెలిచిందని మాయవతి బాహాటంగానే ఆరోపించగా.. మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్‌లో విమర్శించారు. బీజేపీకి ఈవీఎంలు ఉపయోగించని ప్రదేశాల్లో 46 శాతం ఓట్లు పోల్‌కాగా.. బ్యాలెట్ పేపర్ ఉపయోగించిన ప్రదేశాల్లో కేవలం 15 శాతం ఓట్లే నమోదయ్యాయని, బీజేపీ ఈవీఎంల రిగ్గింగ్ పాల్పడిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment