ఊరి చివర ఒంటరి చిన్నారి!
నవనీత (12) ఇల్లు ఊరికి చివరన.. అరిచినా ఎవరికీ వినిపించనంత దూరంలో ఉంటుంది. వర్షం వస్తే ఆ ఇల్లు చెరువు అవుతుందనడానికి సాక్ష్యంగా ఇంటి పైకప్పుకి కన్నాలు! పొగచూరిన బాల్యానికి గుర్తుగా మూడురాళ్లపై అన్నం గిన్నె, ఆ గిన్నెలో కొద్దిగా అన్నం. విద్యుత్ సౌకర్యం కూడా లేని ఆ చీకటి గదిలో ఆ అమ్మాయి, తమ్ముడు ఎలా ఉంటారోనని ఆ ‘ఇల్లు’ చూసినవారికెవ్వరికైనా అనిపిస్తుంది. గుండెల్లో గుబులు కమ్ముకుంటుంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఈ ఇద్దరు చిన్నారులు కనీసం తోడు కూడా లేకుండా జీవిస్తుండడం దినదిన సాహసమే.
అత్తలూరి అరుణ
రంగారెడ్డి జిల్లా దోమ మండలం, మోత్కూర్ గ్రామానికి చెందిన గూడ రామచంద్ర, యాదమ్మలకి ముగ్గురు పిల్లలు. ఆ దంపతులకు నవనీత రెండో కూతురు. ఆమెకో పెళ్ళైన అక్క, ఆరో తరగతి చదివే తమ్ముడు. ఇంటికి ఆధారమైన నాన్నకి ఊహించని విధంగా జబ్బు చేసింది. సర్కార్ దవాఖానాలో కూడా చూపించుకునే స్థోమత లేనంత కటిక దారిద్య్రంలో 2010లో టీబీతో ఆయన కన్ను మూశాడు. ఏ జబ్బు చేసిందో తెలియదు.
ఆ ఊరిలో చాలా మందిని కబళించిన వ్యాధే నవనీత అక్కనూ కాటేసింది. అక్క హఠాత్తుగా మరణించింది. కళ్ళెదుటే అక్క కన్ను మూస్తే అక్క కొడుకుకి నవనీతే తల్లిగా మారింది. దుఃఖంలో నుంచి నవనీత తల్లి యాదమ్మ బయటకు రాలేకపోయింది. మనోవేదనతో మంచం పట్టింది. మతిభ్రమించి ఎటో వెళ్లిపోయింది. ఒకటిన్నర సంవత్స రాలు గడిచినా ఆమె ఆచూకీ లేదు. శ్మశానాన్ని తలపించే తన ఇంటిని చూసి చాలా రోజులు బావురుమంది నవనీత. చెల్లాచెదురైన ఈ చిన్నారులు ముగ్గురూ అన్నం పెట్టే దిక్కులేక పస్తులున్నారు. అనుకోని జబ్బులతో ఆ ఊరు ఊరే వల్లకాడులా మిగిలిపోతే ఇక వీరి ఆకలిగోడు ఎవరికి వినిపిస్తుంది? ఆకలితో... అలమటించారు.
కన్నీళ్లు కడుపునింపవని అర్థం అయ్యింది నవనీతకు. రక్తసంబంధం తన బాధ్యతని గుర్తు చేసింది. జీవితం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను చెరిపేసుకుంటూ నవనీత జీవించడం మొదలుపెట్టింది. తన కోసం కాదు. తన తమ్ముడి కోసం, అక్క బిడ్డకోసం.
కటిక పేదరికం... చదువుపై నవనీతకు ఉన్న ఆశని చిదిమేసింది. తన తమ్ముడినైనా చదివించాలని ఆ చిన్ని మనసు శపథం చేసింది.
నాలుగవ తరగతి నుంచి పనిలోకి వెళ్లిన నవనీతకు రెండేళ్లు గడిచేసరికి పనే సర్వస్వం అయ్యింది. ఆరోక్లాసుని అర్ధంతరంగా మానేసింది. చదువంటే ప్రాణంగా భావించే నవనీత తమ్ముడి చదువుకోసం తన చదువే కాదు, అన్ని ఇష్టాలను వదిలేసింది. నవనీత చేతులిప్పుడు పెద్దవాళ్లతో పోటీపడి మరీ పత్తి చేలో పత్తి తీస్తున్నాయి. వయసుకి మించిన బతుకుభారాన్ని మోయడానికి అలవాట పడిన నవనీతకు ఇప్పుడు మట్టి తట్ట పెద్ద బరువనిపించడం లేదు.
కంపచెట్లల్లో.... కందిచేలల్లో పడీ పడీ చాకిరీ చేస్తోన్న ఈ బాలికను చూస్తే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు, వాస్తవికతకు మధ్య ఉన్న అగాధం ఏమిటో అర్థం అవుతోంది. మరోవైపు తన తమ్ముడికోసం తాను ఏదైనా చేస్తానంటున్న నవనీతకు మరో ప్రమాదం పొంచి ఉంది. అదే భద్రత.
అన్నీ ఉండి, తల్లీతండ్రీ నీడన పెరిగే పిల్లలకే రక్షణ కరువైన ఈ రోజుల్లో ఈ చిన్నారి భద్రత గాలిలో దీపమే. ఇన్నాళ్లూ ఆ ఇంటికి వచ్చిపోయే బావ, ఇటీవలే కొడుకుని తీసుకెళ్లాడు. మళ్లీ తీసుకొస్తానని చెప్పి మరీ వెళ్ళాడు. ఆ పిల్లాడు నవనీత చేతుల్లోనే పెరిగాడు కనుక పూర్తి బాధ్యత నవనీత పైనే వదిలినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఊరి చివరనున్న ఆ పూరి గుడిసెలో ధైర్యంగా జీవిస్తున్న నవనీతకిప్పుడు బతుకుపై భరోసా కల్పించాలి. ఆమె కోరుతోంది కూడా అదే.
చెప్పాల్సింది ప్రభుత్వమే
తల్లీ తండ్రీ లేక దిక్కులేని వారిగా మారిపోతున్న నవనీత లాంటి వారిని అక్కున చేర్చుకునే వ్యవస్థ మనకు లేదు. ప్రభుత్వ రక్షణ లేదు. నవనీత చదువు మాత్రమే కాదు, ఆమె భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమయింది. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే.
- సత్తయ్య, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ డివిజన్ ఇంచార్జ్, మోత్కుర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
ఎమ్మార్వోల చేత సర్వే చేయించాలి
ప్రభుత్వ పథకాలు ఇటువంటి పిల్లలకు కూడా వర్తింపజేయాలి. వారికి జీవనోపాధిని కల్పించే బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపట్టాలి. ఏ ప్రాంతమైనా ఎమ్మార్వోల చేత సర్వే చేయించి ఇటువంటి పిల్లలను గుర్తించి వారికి ఉపాధి కలిగించే సాంకేతిక శిక్షణతో కూడిన విద్య నేర్పించాలి.
- రవీందర్ గౌడ్, విద్యావంతుల వేదిక, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు