సాక్షి, హైదరాబాద్: ఎండనక, వాననక రాళ్లను తీసుకువచ్చి రోళ్లను తయారు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు వడ్డెరలు. బతుకుదెరువు కోసం వివిధ జిల్లాల నుంచి వలస వచ్చి మేడ్చల్ జిల్లాలో జీవనం గడుపుతున్నారు. చదువంటే తెలియని వయస్సు పొట్టకూటి కోసం సమ్మెట ఆయుధంగా చేసుకున్న వారి జీవితాల్లో వెలుగులు కానరావడంలేదు. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో దాదాపు వెయ్యి కుటుంబాలకు పైగా రాళ్లను కొడుతూ జీవనం సాగిస్తున్నాయి. రెండు రోజులు రాళ్లు కొడితేనే విసురు రాళ్లు, రుబ్బు రోళ్లు తయారవుతాయి. విసురు రాయికి రూ.100, రోలుకు రూ.70, రుబ్బు రోలుకు రూ.100 అవుతాయని అంటున్నారు. స్వశక్తితోనే కుటుంబాలు పోషించుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఎక్కడైనా రోడ్లు మంజూరైతే కాని పని దొరకదని వడ్డెరలు పేర్కొంటున్నారు.
పేదరికానికి మారుపేరు వారు. బతుకు గమనంలో చితికిపోయిన జీవితాలు. భవిçష్యత్‌పై ఆశలు లేని గమనాలు. కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడి రాళ్లను రోళ్లుగా తయారు చేస్తున్న వారి విషయంలో సరిపోతుంది. పొట్ట కూటి కోసం గ్రామాలు తిరుగుతూ బతుకు బండిని లాగుతున్నారు. రోళ్లను తయారు చేసే వారిని కదిలిస్తే కన్నీటి కథలే కనిపిస్తాయి. రాళ్లను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం వడ్డెరులకే సాధ్యం. బతుకు గమనంలో తమకు చేయూతనందించాలని వేడుకుంటున్న వడ్డెరుల జీవిత గమనంపై ప్రత్యేక కథనం.
ప్రభుత్వ పథకాల గురించి అసలే తెలీదు..
పిల్లలను చదివించే స్తోమత లేదని అందరం కష్టపడి పని చేస్తామని చెబుతున్నారు. తమకు నగర శివారుల్లోని కొంత అటవి ప్రాంతాన్ని అప్పగిస్తే అందులో లభించే బండలను కొట్టుకుని జీవనం సాగిస్తామని వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల గురించి అసలు తమకు తెలియదని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని వడ్డెర కులస్తులు విన్నవిస్తున్నారు.
పెద్ద పెద్ద బండరాళ్లను సుత్తితో పగలగొట్టి ఉపయోగంలోకి తీసుకువస్తారు. ప్రతిరోజు ఉదయం కుటుంబ సభ్యులందరూ కలిసి బండలు పగలగొట్టె పనికి వెళ్తారు. ఎంత కష్టపడుతున్నా శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని వడ్డెరలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో రాళ్లను కంకరగా తయారు చేయడానికి కొత్త రకాల క్రషర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వారికి పని దొరకని పరిస్థితి.
రెండు రోజులు రాళ్లు కొడితేనే..
రెండు రోజులు రాళ్లు కొడితేనే విసురు రాళ్లు, రుబ్బు రోళ్లు తయారవుతాయి. విసురు రాయికి రూ.100, రోలుకు రూ.70, రుబ్బు రోలుకు రూ.100 అవుతాయని అంటున్నారు. స్వశక్తితోనే కుటుంబాలు పోషించుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఎక్కడైనా రోడ్లు మంజూరైతే కాని పని దొరకదని వడ్డెరలు పేర్కొంటున్నారు.
పని దొరకదు.. కడుపు నిండదు
వంశపారంపర్యంగా ఈ వృత్తిని నమ్ముకునే జీవిస్తున్నాం. సంచార జీవితాన్ని గడపడంతో ఎదగలేకపోతున్నాం. పూట గడవడమే తప్ప ఒక్క పైసా వెనుకేసుకోలేదు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలం మేము. ప్రతి రోజు పని చేస్తేనే నాలుగు పైసలు కండ్ల చూస్తాం. లేకుంటే పస్తులుంటాం. ఒక్కోసారి పని దొరకదు. కడుపు నిండదు. ప్రభుత్వమే వడ్డెరులపై శ్రద్ధ వహించాలి.
– నర్ర మహేష్, జవహర్‌నగర్
రాళ్లు కొట్టడానికి అనుమతి ఇవ్వాలి..
బండరాళ్లను అందమైన రోళ్లుగా తయారు చేయడమే తప్ప చదవడం అంటే తెలియదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పనికి వెళ్లి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకున్నాం. కాయకష్టం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. గుట్టల్లో రాళ్లను కొట్టడానికి అనుమతులు ఇవ్వాలి.
– రేపన్ లక్ష్మణ్, జవహర్‌నగర్
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
వడ్డెర కులస్తులకు కొంత అడవిని అప్పగించాలి. నగర శివారు ప్రాంతాలలో జీవిస్తున్న వడ్డెర కులస్తుల జీవితాలలో ఎలాంటి మార్పు రావడం లేదు. వడ్డెరలను ఎస్టీ జాబితోకి చేర్చి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి. చాలా మంది వడ్డెరల పిల్లలు చదువులకు దూరంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. తాతల కాలం నుంచి రాయిని కొట్టుకుని జీవిస్తున్న మాకు వడ్డెరలకు చేయుతనివ్వాలి.
– పల్లపు రవి, కార్పొరేటర్, జవహర్‌నగర్
సీఎం దృష్టికి తీసుకెళ్లాం
రాష్ట్రంలో వడ్డెర కులస్తుల జీవన విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవంగా వారి జీవితాల్లో ఎంతో విప్లవాత్మక మార్పులు తీసుకురాల్సిన అవసరం ఉంది. చాలా మంది కుటుంబాలకు దూరంగా బండలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వడ్డెరల స్థితిగతులపై ప్రత్యేక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేశాం. అదే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరాం.
– మర్రి రాజశేఖరరెడ్డి, టీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్
Comments
Please login to add a commentAdd a comment