సులభంగా.. వేగంగా... బైక్ స్ప్రే | Spray pesticides with the two-wheeler vehicle | Sakshi
Sakshi News home page

సులభంగా.. వేగంగా... బైక్ స్ప్రే

Published Fri, Oct 3 2014 8:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

సులభంగా.. వేగంగా... బైక్ స్ప్రే - Sakshi

సులభంగా.. వేగంగా... బైక్ స్ప్రే

ద్విచక్రవాహనంతో పురుగు మందులను పిచికారీ చేసే విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత 90శాతం మంది రైతులు పాత పద్ధతులకు స్వస్తి చెప్పారు. బైక్ సాయంతో పైరుకు మందుకొట్టడం  చాలా సులభమంటున్నారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతోందని చెబుతున్నారు. ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల ఉపాధి లభిస్తోందని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. ఆ వివరాలు ఇవీ...    - చిన్నమండెం
 
- ద్విచక్రవాహనంతో పురుగు మందుల పిచికారీ
- ఈ పద్ధతి చాలా సులభమంటున్న రైతులు
- జీవనోపాధి లభిస్తోందంటున్న నిర్వాహకులు

గతంలో కాలితో తొక్కే యంత్రం, భుజాలకు తగిలించుకునే యంత్రం ద్వారా రైతులు పైరుకు మందులను పిచికారీ చేసుకునే వారు. ప్రస్తుతం ద్విచక్రవాహనంతో మందును పిచికారీ చేసుకునే కొత్తపద్ధతి అలవాటైంది. కొందరు నిరుద్యోగులు.బజాజ్ బైక్‌కు ఒక చిన్నపాటి వీల్‌ను ఏర్పాటు చేసుకుని, కావాల్సినంత పైపును, 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్మును అమర్చుకుని పంట పొలాలకు మందులను పిచికారీ చేసి జీవనం సాగిస్తున్నారు. బైక్ పద్ధతి ద్వారా మామిడి, టమాట, వరి, వేరుశనగ, కర్బుజా తదితర పైర్లకు మందు కొట్టొచ్చు. ద్విచక్రవాహనంతో మందులను పిచికారీ చేసే పద్ధతి వచ్చిన తర్వాత 90శాతం మంది రైతులు పాత పద్ధతులకు స్వస్తి పలికారు. ఎందుకంటే ఈ పద్ధతిలో సులభంగానూ, త్వరితగతిన మందును పిచికారీ చేయవచ్చు. పైపు నుంచి మందు వేగంగా వచ్చి చెట్లపైన పడి, ఆ తర్వాత చెట్ల మొదళ్లకు కూడా తాకుంది. తెగుళ్ల నివారణకు కూడా ఈ పద్ధతి బాగుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
 
ఒక డ్రమ్ము మందు పిచికారీకి రూ.150
బజాజ్ ద్విచక్ర వాహనం సాయంతో పురుగు మందులు పిచికారీ చేస్తే రూ.150 మాత్రమే ఖర్చవుతుంది. ఇదే మందు పాత పద్ధతిలో పిచికారీ చేయాలంటే, కూలీలకు, మిషన్ అద్దె సహా మొత్తం రూ.500 అవుతుంది. దీంతో పాటు పని కూడా వేగంగా జరుగుతుంది. దీంతోనే రైతులు ఈ పద్ధతిపైనే ఆధారపడుతున్నారు.
 
పని సులభమవుతోంది
గతంలో కూలీలను పిలిచి, యంత్రాన్ని బాడుగకు తెచ్చుకుని పైరుకు మందులు కొట్టే వాళ్లం. ఇప్పుడు బైక్‌తో మందును పిచికారీ చేసుకోవడం సులభమవుతోంది. ఖర్చు తగ్గుతోంది. బైక్‌తో మందు కొట్టేందుకు ఎకరాకు 150 రూపాయల ఖర్చవుతోంది. అదే మందును యంత్రం ద్వారా కొట్టాలంటే మిషన్ తొక్కేందుకు ఒకరు, నీళ్లు తెచ్చేందుకు మరొకరు, మందు కొట్టేందుకు ఇంకొకరు మొత్తం ముగ్గురు కూలీలు అవసరం ఉంటుంది. దీంతో పాటు మందులు చాలా సార్లు కలపడం వల్ల పంటలకు సమాన మోతాదులో అందే అవకాశం ఉండదు.  - మచ్చ చంద్ర మోహన్, రైతు (9642 407596)
 
జీవనోపాధి దొరికింది
రోజువారీ వ్యవసాయ పనులకు వెళ్లేవాడిని. కుటుంబ పోషణ జరిగేది కాదు. ఏడాది క్రితం 20వేల రూపాయల ఖర్చుతో ఒక బజాజ్ బైక్, అందుకు కావాల్సిన పైపు, వీలు, డ్రమ్మును కొనుగోలు చేసుకున్నాను. పైర్లకు మందులను పిచికారీ చేస్తున్నాను. ప్రతి నెలా అన్ని ఖర్చులు పోనూ 10 -15వేల రూపాయలు మిగులుతోంది. పొలాలకు మందులు పిచికారీ చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాను. మామిడితోటల్లో మందు కొట్టాలంటే నాతో పాటు మరొకరిని తీసుకెళతాను. ఖర్చు తక్కువ రావటం వల్ల రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు.   
 - దేవరింటి నాగరాజ, బజాజ్ బైక్ నిర్వాహకుడు (95730 48996), దేవగుడిపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement