హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో సుస్థిర స్థానం దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ త్రీ–వీలర్స్ సెగ్మెంట్లోకి ఈ ఏడాదే ఎంట్రీ ఇస్తోంది. కంపెనీ ఇప్పటికే పెట్రోల్, ఎల్‌పీజీ, సీఎన్‌జీతో నడిచే మూడు రకాల ప్యాసింజర్, ఒక కార్గో రకం త్రిచక్ర వాహనాలను కింగ్ పేరుతో పలు వేరియంట్లలో విక్రయిస్తోంది.
భారత త్రిచక్ర వాహన విపణిలో సెప్టెంబర్‌లో అన్ని కంపెనీలవి కలిపి 1,06,524 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2,009 యూనిట్ల విక్రయాలతో టీవీఎస్ వాటా 1.89 శాతం నమోదైంది. 2023 సెప్టెంబర్‌లో ఇది 1.34 శాతంగా ఉంది.
మూడవ ఈ–టూ వీలర్..
సంస్థ నుంచి మూడవ ఈ–టూ వీలర్ మోడల్‌ను మార్చికల్లా ప్రవేశపెట్టనున్నట్టు టీవీఎస్ ప్రకటించింది. 2024 ఆగస్ట్ వరకు ఈ–టూ వీలర్స్ అమ్మకాల్లో భారత్‌లో రెండవ స్థానంలో కొనసాగిన టీవీఎస్ మోటార్.. సెప్టెంబర్‌లో మూడవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అర్ధ భాగంలో కంపెనీ నుంచి దేశవ్యాప్తంగా 1.27 లక్షల యూనిట్ల ఈ–స్కూటర్స్ రోడ్డెక్కాయి. 2023 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఈ సంఖ్య 96,191 యూనిట్లు నమోదైంది. దీర్ఘకాలంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం, సాంకేతికతలలో పెట్టుబడులు, రిటైల్ విస్తరణపై దృష్టిసారించింది.
భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని టీవీఎస్ యాజమాన్యం ఇప్పటికే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200–1,400 కోట్ల మూలధన వ్యయం చేయాలని టీవీఎస్ నిర్ణయించింది. ఇందులో 70 శాతం ఈవీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాలలో నూతన ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అభివృద్ధికి, అలాగే డిజిటల్ సామర్థ్యాలను నిర్మించడానికి ఖర్చు చేస్తారు.
ఇవీ ప్రస్తుత ఈ–టూ వీలర్ మోడళ్లు..
ప్రస్తుతం కంపెనీ ఖాతాలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. టీవీఎస్ ఎక్స్ మోడల్ ఈ–స్కూటర్‌ను రూ.2,49,990 ఎక్స్‌షోరూం ధరలో విక్రయిస్తోంది. ఒకసారి చార్జింగ్‌తో ఇది 140 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని 2.6 సెకన్లలో అందుకుంటుంది. అలాగే టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్‌ను రూ.89,999 నుంచి రూ.1,85,373 వరకు ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. వేరియంట్‌నుబట్టి ఒకసారి చార్జింగ్‌తో 75–150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment