వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూ–వీలర్ల వ్యాపార విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. వచ్చే కొద్ది నెలల్లో అందుబాటు ధరల్లో మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా ఈ విషయాలు తెలిపారు.
‘వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగం చాలా సందడిగా ఉండబోతోంది. విడా శ్రేణికి సంబంధించి అందుబాటు ధరల్లో మోడల్స్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో (రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలతో కలిపి) ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో విడా స్కూటర్లను కంపెనీ విక్రయిస్తోంది. 32 రోజుల పాటు సాగిన పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందన కనిపించిందని, 11,600 యూనిట్లు విక్రయించామని గుప్తా వివరించారు.
క్షేత్రస్థాయిలో భౌతికంగా సేల్స్, సర్వీస్ మౌలిక సదుపాయాలు ఉంటే కస్టమర్‌కి మరింత నమ్మకం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు ఉండటం తమకు కలిసి వచ్చే అంశమని వివరించారు. ఈవీల విభాగంలో ధర, కస్టమర్ సర్వీసు అంశాలే దీర్ఘకాలికంగా ఏ కంపెనీకైనా కీలకం అవుతాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీ
ఇక దేశీ మార్కెట్లో మొత్తం వాహన విక్రయాలపరంగా చూస్తే పట్టణ ప్రాంతాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయని గుప్తా చెప్పారు. ఈ ఏడాది పండుగ సీజన్‌లో హీరో మోటోకార్ప్ విక్రయాలు గత సీజన్‌తో పోలిస్తే 13 శాతం పెరిగి 15.98 లక్షల యూనిట్లకు చేరాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల్లోకి కూడా విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment