సాక్షి, అమరావతి: వ్యవసాయ పనులు తక్కువగా ఉండే వేసవి కాలంలో ఉపాధి హామీ పనుల ద్వారా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భరోసా ఇస్తోంది. ప్రతి నెలా సరాసరిన రూ.1,311 కోట్ల చొప్పున మూడు నెలల్లో రూ.3,934 కోట్ల విలువైన పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి 16.06 కోట్ల పనిదినాలను అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు 90 లక్షల పనిదినాల మేర.. కూలీలకు పనులు కల్పించారు. ఈ నెలాఖరునాటికి మొత్తం 3.90 కోట్ల పనిదినాల ద్వారా రూ.955.07 కోట్ల లబ్ధి కల్పించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే మే నెలలో 6.56 కోట్ల పనిదినాలు, జూన్‌లో 5.60 కోట్ల పనిదినాలు కల్పిస్తారు. తద్వారా మే నెలలో రూ.1,607.93 కోట్లు, జూన్‌లో రూ.1,371 కోట్ల మేర లబ్ధి చేకూర్చనున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క పనిదినానికి గరిష్టంగా రూ.245 చొప్పున చెల్లిస్తున్నారు. కాగా, వేసవిలో ఎండ తీవ్రత, భూమి గట్టి పడడం వంటి కారణాలతో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం.. ఏప్రిల్, మే నెలలో సాధారణ రోజుల్లో కూలీలు చేయాల్సిన పని కంటే 30 శాతం మేర, జూన్ నెలలో 20 శాతం తక్కువ చేసినప్పటికీ పూర్తి మొత్తం చెల్లించేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌లో
ప్రత్యేక జాగ్రత్తలు..
వేసవి ఎండలతో పాటు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి హామీ పథకం పనుల సమయంలో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకోనున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. పని సమయంలో మధ్యమధ్యలో కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్ ఏర్పాటు చేయడంతో పాటు మంచినీరు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే సాధ్యమైనంత వరకు ఉదయం 11 గంటల్లోపు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూలీలు పనులు చేసుకునేలా వీలు కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు వివరించారు. పని ప్రదేశంలో కూలీలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment