విపత్తులోనూ పేదలకు ‘ఉపాధి’ | AP Govt stands by the poor even in the current corona situation | Sakshi
Sakshi News home page

విపత్తులోనూ పేదలకు ‘ఉపాధి’

Published Thu, May 6 2021 3:50 AM | Last Updated on Thu, May 6 2021 3:50 AM

AP Govt stands by the poor even in the current corona situation - Sakshi

భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీలు

సాక్షి, అమరావతి: ప్రస్తుత కరోనా పరిస్థితులలోనూ పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గ్రామాల్లో పని కావాల్సిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ దాదాపు 31 లక్షల మంది ఈ పథకంలో పనులకు హాజరవుతున్నట్టు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. వలసలు ఎక్కువగా ఉండే విజయనగరం, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనే అత్యధిక మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు.. సుమారు నెల రోజుల వ్యవధిలోనే ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు రూ. 751.29 కోట్లను వేతనాల రూపంలో చెల్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల రోజుల వ్యవధిలో 26.38 లక్షల కుటుంబాలకు సంబంధించి 40 లక్షల మంది ప్రయోజనం పొందినట్టు అధికారులు తెలిపారు. పని ప్రదేశాలలో కూలీలకు కరోనా భయాలు లేకుండా ఉపాధి పథకం సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

► ఎక్కువ మంది గుమికూడే అవకాశం లేకుండా ఒక్కో చోట గరిష్టంగా 30 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు.
► సాధ్యమైనంత వరకు కూలీ ఇంటికి సమీపంలోనే పనులు కల్పిస్తున్నారు. కూలీలు ఆటోల వంటి వాహనాల్లో కిక్కిరిసి వెళ్లాల్సిన అవసరం లేకుండా నడిచి వెళ్లే దూరంలోనే పనులు కల్పిస్తున్నారు. 
► ప్రతిరోజు పనుల ప్రారంభానికి ముందు కూలీలందరినీ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేస్తున్నారు. కరోనా లక్షణాలు లేకపోతేనే పనులకు అనుమతిస్తున్నారు. 
► పని ప్రదేశంలో కూలీలతో తప్పనిసరిగా మాస్క్‌లు ధరింపచేస్తున్నారు. అలాగే చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు సబ్బులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement