మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ పనులు ముగిసిన నేపథ్యంలో కూలీలు వలస వెళ్లకుండా గ్రామాల్లో ముమ్మరంగా ఉపాధి పనులు కల్పిస్తోంది. అడిగిన వారందరికీ జాబ్‌కార్డు ఇచ్చి, పని చూపిస్తోంది. రోజువారీ వేతనం పెంచడంతోపాటు ఎండల నుంచి ఉపమశనం పొందేలా పనివేళలు మార్చి ‘ఊపాధి’కి మరింత భరోసా కల్పించింది.
కర్నూలు(అగ్రికల్చర్): మండే ఎండాకాలం ‘ఉపాధి’ పనులకు వెళ్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం చల్లని కబురు అందించింది. ఈ నెల 1వ తేదీ నుంచి గరిష్ట వేతనాన్ని రూ.237 నుంచి రూ.245కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రత్యేకంగా 30 శాతం అలవెన్స్ ఇవ్వాలని ఆదేశించింది. ఫలితంగా పనిలో 30 శాతం తక్కువ చేసినా కూలీలకు పూర్తి వేతనం లభిస్తుంది. కుటుంబానికి ఒకటి చొప్పున జిల్లాలో 5,75,231 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 11,39,439 మంది సభ్యులుగా ఉన్నారు. మొత్తం 3,70,449 కుటుంబాలకు చెందిన 6,59,538 మంది ఊపాధి పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ 1.50 లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు.
అడిగిన వారందరికీ పని..
అడిగిన వారందరికీ పని కల్పించే విధంగా జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా ఇంటింటికి వెళ్లి డిమాండ్ తీసుకొని పనులు కల్పిస్తున్నారు. వలసలు లేకుండా గ్రామగ్రామాన పనులు కల్పిస్తున్నారు.
వడదెబ్బకు గురికాకుండా..
ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఉపాధి పనులకు హజరయ్యే కూలీలు వడ దెబ్బకు గురికాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూలీలు ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు పనులు చేసే విధంగా కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నారు. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పనులు చేసే ప్రాంతంలో నీడను కల్పించే బాధ్యతను శ్రమశక్తి సంఘాలకు అప్పగించారు. పని ప్రదేశంలో ఎవరైనా వడదెబ్బకు గురైతే తక్షణం ప్రథ«మ చికిత్స చేసేందుకు వీలుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కూడా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి కూలీలకు మజ్జిగ సరఫరా చేయాలనే ప్రతిపాదన ఉంది.
మెరుగైన సదుపాయాలు
జిల్లాలో ఉపాధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల తీవ్రత నుంచి కూలీలకు రక్షణ కల్పిస్తున్నాం. పని ప్రదేశంలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి.
– అమరనాథరెడ్డి, డ్వామా పీడీ
వలస వెళ్లడం మానుకున్నాం
గతంలో ఉపాధి కూలీ అరకొర వచ్చేది. గుంటూరుకు వలస వెళ్లేవాళ్లం. ఈ సారి కూలీ గిట్టుబాటు అవుతోంది. ఉన్న ఊర్లోనే పనులు దొరుకుతున్నాయి. సౌకర్యాలు కూడా బాగున్నాయి. వలస వెళ్లడం మానుకున్నాం.
– సీతమ్మ, ఉపాధి కూలి,బాటతాండ, తుగ్గలి మండలం
Comments
Please login to add a commentAdd a comment