సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు సంబంధించి భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చిందని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. 4,338 పనుల విషయంలో డబ్బుల రికవరీకి విజిలెన్స్ సిఫారసు చేసిందని తెలిపారు. ఉపాధి పనుల విషయంలో కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని, బిల్లుల చెల్లింపులు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని వివరించారు. రూ.5 లక్షల కన్నా తక్కువ విలువ కలిగిన పనుల బిల్లుల్లో 20 శాతం సొమ్ము మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించే వ్యవహారం ప్రాసెస్‌లో ఉందన్నారు. రూ.5 లక్షలకు పైబడిన మొత్తాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
చెల్లించాల్సిన మొత్తాలన్నీ కాంట్రాక్టర్లకే వెళతాయని, గ్రామ పంచాయతీలకు వెళ్లవని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు... రూ.5 లక్షల లోపు చేయాల్సిన చెల్లింపులను ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటివరకు చెల్లింపులు చేయకపోవడం సరికాదని పేర్కొంది. ఇలా అయితే సంబంధిత శాఖాధికారులను పిలిచి వివరణ కోరాల్సి ఉంటుందని తెలిపింది. కోర్టుకు చెప్పిన విధంగా చెల్లింపులు చేయాల్సిందేనంది. చెల్లింపు వివరాలను కోర్టు ముందుంచేందుకు వీలుగా తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2018–19 ఉపాధి హామీ బిల్లులకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పి.వీరారెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తూ దాదాపు 7 లక్షల పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా కొత్త బిల్లులు చెల్లిస్తున్నారన్నారు.
ఆ ‘ఉపాధి’లో అక్రమాలు
Published Wed, Mar 31 2021 3:46 AM | Last Updated on Wed, Mar 31 2021 3:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment