సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు టీడీపీ హయాంలో ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనుల్లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణ జరుపుతున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత పనుల నాణ్యత ఆధారంగా ఆయా పనులకు బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ‘ఉపాధి’ పనుల పెండింగ్ బిల్లుల పరిష్కారానికి సంబంధించిన అంశంపై టీడీపీ సభ్యులు 311వ నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై శుక్రవారం మండలిలో జరిగిన చర్చకు మంత్రి జవాబిచ్చారు. 2018 అక్టోబర్ నుంచి 2019 మే మధ్య జరిగిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించాలని పలువురు టీడీపీ సభ్యులు కోరిన నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. ఆరోపణలు వచ్చినప్పుడు నాణ్యత ప్రమాణాలు పరిశీలించకుండా ప్రభుత్వం బిల్లులు ఎలా చెల్లిస్తుందని ప్రశ్నించారు.
రెండేళ్లలో రూ.8 వేల కోట్లు పనులు కట్టబెట్టారు..
విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి 55.24 శాతం అంటే సగానికిపైగా పనుల్లో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారని తెలిపారు. టీడీపీ హయాంలో 2014–15 నుంచి మూడేళ్లలో రూ.4,900 కోట్ల మేర ఉపాధి హామీ పనులు జరిగితే, ఎన్నికలకు ముందు రెండేళ్లలో హడావుడిగా రూ.8 వేల కోట్లు పనులు జరిగాయని తెలిపారు. దీనిని బట్టే ఆ పనుల్లో నాణ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. విజిలెన్స్ ప్రాథమిక తనిఖీల అనంతరం చేసిన సిఫార్సుల ఆధారంగా ఆ మధ్యకాలంలో జరిగిన మొత్తం 7,95,494 పనులను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్, ఇంజనీరింగ్ అధికారులతో కూడిన మొత్తం 114 తనిఖీ బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పెద్దిరెడ్డి తెలిపారు. కాగా పనుల్లో నాణ్యత ఉన్నట్టు గుర్తించిన అప్పట్లో జరిగిన పనులకు గత 18 నెలల కాలంలో రూ.690.20 కోట్ల పాత బకాయిలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. మొత్తం 7,95,494 పనుల్లో రూ.5 లక్షలు అంతకంటే తక్కువ విలువ గల 7,28,527 పనులకు గాను రూ.490 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
టీడీపీ సభ్యుల ఆందోళన
విద్యుత్ సుంకం (సవరణ), భూమి హక్కుల యాజమాన్యం, దిశ, ఏపీ విత్త బాధ్యత.. బడ్జెట్ నిర్వహణ (సవరణ), రాష్ట్ర అభివృద్ధి సంస్థ, ద్రవ్య వినిమయ బిల్లులను ఆయా శాఖల మంత్రులు మండలి ఆమోదం కోసం ప్రతిపాదించారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి జవాబిచ్చిన తర్వాత కూడా ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టి వెల్‌లో బైఠాయించారు. సభ మూడుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో.. చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించిన అనంతరం శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment