పని కోసం పట్నం బాట | Villagers Going To City For Work | Sakshi
Sakshi News home page

పని కోసం పట్నం బాట

Published Sat, Mar 16 2019 4:34 PM | Last Updated on Sat, Mar 16 2019 4:47 PM

Villagers Going To City For Work - Sakshi

మాల్తుమ్మెదలో వలస వెళ్లడంతో తాళం వేసి ఉన్న ఇల్లు

సరైన వర్షాలు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. కరువు పరిస్థితులతో వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ఉన్న ఊళ్లో చేయడానికి పనులు లేవు. దీంతో పని వెతుక్కుంటూ చాలా కుటుంబాలు వలసవెళ్తున్నాయి. పల్లెలు ఖాళీ అవుతున్నాయి.

సాక్షి, నాగిరెడ్డిపేట (కామారెడ్డి ): రోజురోజుకు ముదురుతున్న ఎండలతో భూగర్భజలాలు సైతం పాతాళానికి చేరుతున్నాయి. బోరుబావులు ఒక్కొక్కటిగా వట్టిపోతున్నాయి. కొత్తగా బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండడం లేదు. కరువు పరిస్థితులతో నాగిరెడ్డిపేట మండలంలోని చాలా గ్రామాల్లో వ్యవసాయభూములు బీడుగానే ఉన్నాయి. కొందరు రైతులు ధైర్యంచేసి అక్కడక్కడా వేసిన పంటలు సైతం సాగునీరందక ఎండుముఖం పడుతున్నాయి. దీనికితోడు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సైతం అంతంతమాత్రంగానే ఉండడంతో పల్లె ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పనికోసం వలస బాట పడుతున్నారు.

మండలంలోని మాల్తుమ్మెద, గోపాల్‌పేట, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, తాండూర్, ధర్మారెడ్డి, రాఘవపల్లి, కన్నారెడ్డి, మాసాన్‌పల్లి, ఆత్మకూర్, జలాల్‌పూర్, జప్తిజాన్కంపల్లి, బొల్లారం తదితర గ్రామాల నుంచి ప్రజలు పొట్ట చేతబట్టుకొని ఇతరప్రాంతాలకు భారీగా వలసవెళ్లారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపేట మండలంతోపాటు ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి మండలాల్లోని పలుగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్, ఆర్మూర్‌ తదితర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు.

ఆదుకోని ఉపాధి హామీ.. 
పేదలకు అండగా ఉండాల్సిన ఉపాధి హామీ పథకం ఈసారి పెద్దగా పనులు కల్పించలేకపోయింది. వరుసగా వస్తున్న ఎన్నికలతో ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉంటోంది. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో సకాలంలో పనులను గుర్తించలేకపోయారు. మరోవైపు వరుణుడి కరుణ లేకపోవడంతో వ్యవసాయ పనులూ అంతంతగానే ఉన్నాయి. దీంతో గ్రామాలలో చేయడానికి పనులు లేకుండాపోయాయి.

ఇళ్లకు తాళాలు వేసి..
గ్రామాల్లో పనిలేకపోవడంతో చాలాకుటుంబాలు ఇళ్లకు తాళాలువేసి పట్టణాలకు వలసవెళ్తున్నాయి. కొందరు కుటుంబ సభ్యులందరికీ తీసుకుని ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్తుండగా.. మరికొంతమంది వృద్ధులు, పిల్లలను ఇంటివద్దనే వదిలి వలసబాట పడుతున్నారు. పిల్లలు చదువుకు దూరమవకూడదని, వృద్ధులు ఉంటే ఇంటికి కాపలాగా ఉంటారని భావించి కేవలం భార్యాభర్తలు మాత్రమే పనికోసం పట్టణాలకు వెళ్తున్నారు. మాల్తుమ్మెద గ్రామంలో 500లకుపైగా కుటుంబాలుండగా సుమారు వంద కుటుంబాలు బతుకుదెరువు కోసం వలస వెళ్లడం సమస్య తీవ్రతను తెలుపుతోంది.

పిల్లల చదువు కోసం నేనిక్కడ ఉన్న
ఊళ్లె పనిలేక ఆరునెలల కింద నా కొడుకు, కోడలు హైదరాబాద్‌కు వలసపోయిండ్రు. నా మువవడు, మనుమరాలి సదువు కోసం నేను ఇంటికాడ్నే ఉంటున్న. నా కొడుకు, కోడలు పనిచేసి పైసలు పంపిస్తుండ్రు. ఆ పైసలతోనే మేము బతుకుతున్నం.
– తలారి దుర్గమ్మ, మాల్తుమ్మెద

ఇంటికి కాపలాగా..
ఈడ పని దొరక్క ఏడాదికింద నా కొడుకులు, కోడళ్లు బతకపోయిండ్రు. నా మనుమళ్లను గోపాల్‌పేటలోని హాస్టళ్ల ఏసిండ్రు. నేను మాత్రం ఇంటికి కాపాలాగా ఉన్న. ఆళ్లు పైసలు పంపిస్తే నేను బతుకుతున్న. ఊళ్లె పనిలేక మస్తుమంది బతుకవోతుండ్రు.
– నక్క పోచమ్మ, మాల్తుమ్మెద

షాతకాదని ఇంటికాడ్నే ఉంటున్న 
నా కొడుకు, కోడలు పనికోసం ఏడాదికింద ఆర్మూర్‌కు పోయిండ్రు. నాకు షాతకాదని ఇంటికాడ్నే ఉంటున్న. ఆళ్లు ఆర్మూర్‌లో కూలిపని చేసుకుంటుండ్రు. ఈ ఏడాది కాలం కాక పొలాలు కూడా పండుతలేవు. దీంతో ఊళ్లెకెళ్లి చానామంది బతుకడానికి యాడపని ఉంటే ఆడికి పోతుండ్రు.
– వదల్‌పర్తి గంగమ్మ, మాల్తుమ్మెద

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement