‘ఆధారం’ తెగిపోనుందా?
‘ముంబాయ్.. దుబాయ్.. బొగ్గుబాయి .. తెలంగాణ ప్రజల బతుకంతా ఇదేకాదా..!’
- ముఖ్యమంత్రి కేసీఆర్
ఉద్యమ సమయంలో తరుచుగా చేసిన వ్యాఖ్యలు
మెతుకుసీమ, పాలమూరు వాళ్లకు త్యాగం ఎక్కువ. ఎక్కడెక్కడికో వలస పోయి కుటుంబానికి దూరంగా ఉండి నాలుగు రాళ్లు సంపాదించి.. భార్యా పిల్లలకు పంపి పోషించుకుంటారు.
- దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వ్యక్తం చేసిన ఆవేదన
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: తెలంగాణ ప్రజల బతుకంతా వలసలే. ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క పొట్టచేత పట్టుకొని ముంబాయ్, దుబాయ్ లాంటి సుదూర ప్రాంతాలకు వలసలు పోతారు. చంటి పిల్లలను ముసలి తల్లుల మీద వదిలేసి పని వెతుకుంటూ దేశం గాని దేశానికి వలస పోవటం మెతుకుసీమ పల్లెల్లోనూ నిత్యకృత్యం. జిల్లా నుంచి ఏటా మూడు లక్షల మంది కూలీలు జానెడు పొట్ట నింపుకునేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు అంచనా. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజవర్గాల్లో వలసలు తీవ్రంగా ఉండగా, మిగిలిన ప్రాంతాల్లోనూ ఓ మోస్తరుగా ఉన్నాయి.
వీళ్లు ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఇంటికి వచ్చిపోతుంటారు. కష్టం తెలిసిన మెతుకుసీమ బిడ్డ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ విషయాలు తెలియని కావు. అన్ని తెలిసిన ఆయనే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ‘ఆధార్’ కార్డును ముడిపెట్టడం వివాదాస్పదమవుతోంది. సుప్రీంకోర్టే ఆధార్ ‘ఆధారం’గా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ, మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును ముడిపెట్టడంతో వలస కూలీలకు శాపంగా మారింది. రేషన్ కార్డుల ఏరివేత నుంచి మొదలుకుని దళితుల భూ పంపిణీ వరకు ప్రభుత్వం ఆధార్ కార్డునే కీలక ‘ఆధారం’గా తీసుకోవడంతో వలస కూలీల కుటుంబాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడింది.
‘ఆధార్’తోనే దూరం చేస్తున్నారు
ఇటీవల చేపట్టినబోగస్ రేషన్ కార్డుల ఏరివేతను కూడా ఆధార్ కార్డు ఆధారంగానే గుర్తించారు. వలస కూలీలు పిల్లల పెళ్లిళ్ల సమయంలో సొంత గ్రామాలకు వచ్చి ఆ తంతు ముగిసిన వెంటనే మళ్లీ వలస వెళ్లిపోతారు. ఓ తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేస్తే ఇక ఆ జంట వేరుగానే బతుకుతుంది. ఎవరి పిల్లలు వాళ్లకు ఉంటారు. పంచుకోవడానికి ఆస్తిపాస్తులు ఏమి ఉండవు కాబట్టి ప్రత్యేకంగా వేరు పడటం అంటూ ఏమీ ఉండదు. పైగా ఆధార్ కార్డు తీసే సమయానికి వాళ్లు అసలు ఊళ్లోనే ఉండరు. అధికారులు ఇవేమి పరిగణలోకి తీసుకోకుండా దాన్ని ఉమ్మడి కుటుంబంగా పరిగణించి, దాన్ని ఆధార్ కార్డుతో ముడిపెట్టి వాళ్లను ప్రభుత్వ సంక్షమ పథకాలకు దూరం చేస్తున్నారు.
దళితుల్లోనే వలసలు ఎక్కువ
ప్రభుత్వం దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమికి కూడా అర్హుల జాబితాను ఆధార్ కార్డు ఆధారంగానే రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు గుంట జాగా కూడా లేని దళితులు.. శ్రమనే నమ్ముకొని బతికారు. ఎక్కడ పని దొరికితే అక్కడకు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. వలసలు కూడా దళిత కుటుంబాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వలసలు వెళ్లిన చాలా మంది దళితులకు ఆధార్‌కార్డులు లేవు. కానీ ప్రభుత్వం వలస కూలీల కుటుంబాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేవలం గ్రామంలో ఉన్న వారినే పరిగణలోకి తీసుకొని వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం వలన అర్హులైన పేదలంతా వలస జీవులుగానే మిగిలిపోయే ప్రమాద ం ఉంది.
ఆధార్ లేని వలస కూలీలు ఈ రాష్ట్రం వాళ్లు కాదా?
ఈ నెల 19న సర్వే చేపట్టబోతున్న ప్రభుత్వం వలస జీవులను పూర్తిగా విస్మరించినట్లు ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించి స్థానికులు ఇంటి వద్ద ఉండేటట్టు చర్యలు చేపట్టింది. కానీ ఊరు వదిలివె ళ్లిన వలస కూలీల పరిస్థితి ఏమిటీ? ఇప్పటికే రాష్ట్రం సరిహద్దులు దాటి వెళ్లిపోయిన వారికి సర్వే జరుగుతుందనే విషయం ఎలా తెలియాలి? ఎవరు చెప్పాలి? వారిని ఎవరు స్థానిక ప్రాంతాలకు తీసుకురావాలి? జిల్లా నుంచి ఎంత మంది వలసలు వెళ్లారన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు.
అసలు జిల్లా చెందిన ఎంతమంది కార్మికులు వలస వెళ్లారని డీఆర్‌డీఏ, డ్వామా, రెవిన్యూ, కార్మిక శాఖ అధికారులను అడిగితే ఏ ఒక్కరి దగ్గర కూడా వివరాలు లేవు. ప్రతి శాఖ అధికారులు కూడా అది తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని చెప్పారు. ఇప్పటికే వాళ్లకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు. ఇక ప్రస్తుతం చేపట్టనున్న ఇంటింటి సర్వే సమయంలో వలస కూలీలు అందుబాటులో లేకుంటే ఇక వారు ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కాకుండా మిగిలిపోవాల్సిందేనా?