ప్రతీకాత్మక చిత్రం
ఉన్న ఊళ్లో పని లేక పోవడంతో పేదలు పొట్ట చేత పట్టుకుని పట్నాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగానే పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి పథకం కూడా వారిని ఆదుకోకపోవడంతో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. నివారణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో ఇప్పటికే 50వేల మందికి పైగా సుగ్గిబాట పట్టారు.
కర్నూలు(అర్బన్): జిల్లాలోని పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పనులు పూర్తి కావడంతో వేలాది మంది వ్యవసాయ కూలీలు పొట్ట చేతపట్టుకొని ఇళ్లకు తాళాలు వేసి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఉపాధి కూలీ గిట్టుబాటు కాకపోవడం, ఏడాది క్రితం చేసిన పనులకే వేతనాలు అందకపోవడం వలసలకు కారణమని తెలుస్తున్నా అధికారులు చూసీచూడనట్లున్నారనే ఆరోపణలున్నాయి. బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు కడప, గుంటూరు, విజయవాడ పట్టణాల్లోని భవన నిర్మాణ, ఇతర వ్యవసాయ పనుల్లో జిల్లా వాసులు మగ్గుతున్నారు.
ప్రస్తుతం చేపడుతున్న పనులు ..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చేపట్టిన ఫారంపాండ్స్‌ను మార్చి నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. జిల్లాలో 45 వేల ఫారంపాండ్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 12 వేలు మాత్రం పూర్తి కాగా, 20 వేలు వేర్వేరు దశల్లో కొనసాగుతున్నాయి. ఇంకా 13 వేల ఫారంపాండ్స్ పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్ పనులతో పాటు భూమి అభివృద్ధి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆట స్థలాలు, సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు.
పెండింగ్‌లో రూ.15 కోట్ల వేతనాలు..
కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులకు సంబంధించి బడ్జెట్ సకాలంలో విడుదల చేయకపోవడం, విడుదల చేసినా అరకొరగా ఉండటంతో ఏడాది కాలంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని కూలీలకు రూ.15 కోట్ల మేర బకాయిలున్నాయి. బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ సక్రమంగా ఉన్న కూలీలకు రూ.9 కోట్ల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉండగా, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్ అనుసంధానంలో దొర్లిన పొరపాట్లు, ఇతరత్రా సాంకేతిక కారణాల వల్ల రూ.6 కోట్లు ఆయా బ్యాంకుల్లోని సస్పెన్షన్ ఖాతాల్లోనే మూలుగుతున్నాయి.
145 గ్రామ పంచాయతీల్లోప్రారంభం కాని పనులు..
జిల్లాలోని 889 గ్రామ పంచాయతీలకు గానూ 145 పంచాయతీల్లో ఎలాంటి ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. రుద్రవరం మండలంలో 17, బనగానపల్లె మండలంలో 10 పంచాయతీల్లో పనులు చేపట్టడం లేదు. జిల్లాలోని 10 క్లస్టర్లలో 95,977 మంది కూలీలకు పనులు కల్పించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటి వరకు ఆయా క్లస్టర్లలోని గ్రామ పంచాయతీల్లో కేవలం 30 వేల మంది కూలీలు మాత్రమే ఉపాధి పనులకు హాజరు కావడం గమనార్హం.
♦ కోసిగి మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో 69 వేల జనాభా ఉంది. ఈ మండలంలో 2,990 మంది ఉపాధి కూలీలు పనులు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే గ్రామాలకు గ్రామాలు వలస వెళ్లడంతో ప్రస్తుతం 561 మంది మాత్రమే 12 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులను చేస్తున్నారు. మిగిలిన 5 గ్రామ పంచాయతీల్లో కూలీలు లేకపోవడంతో ఎలాంటి పనులు నేటి వరకు కల్పించలేకపోతున్నారు. ఈ మండలం నుంచే దాదాపు 10 వేలకు పైగా వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
మార్చి నాటికి 60 లక్షల పనిదినాలు పూర్తి చేసేందుకు చర్యలు
ఈ ఏడాది మార్చి నాటికి 60 లక్షల పనిదినాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో కూలీల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. నంద్యాల డివిజన్‌లో ఇంకా వ్యవసాయ పనులు ఉండటంతో ఉపాధి పనులు పుంజుకునేందుకు కొంత సమయం పడుతుంది. వలసలను నివారించేందుకు పడమటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాం. వేతనాలు గిట్టుబాటయ్యేలా ఫారంపాండ్స్, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డ్వామా పీడీ
Comments
Please login to add a commentAdd a comment