రికార్డులలో పేర్లున్నాయ్‌ కానీ.. ఊళ్లు లేవ్‌ | Kurnool: Kowthalam Mandal Some Villages Not In Use But In Records | Sakshi
Sakshi News home page

రికార్డులలో పేర్లున్నాయ్‌ కానీ.. ఊళ్లు లేవ్‌

Published Thu, Dec 2 2021 1:59 PM | Last Updated on Thu, Dec 2 2021 2:02 PM

Kurnool: Kowthalam Mandal Some Villages Not In Use But In Records - Sakshi

కలవలగుండు గ్రామం ఉన్న చోట రోలు

చరిత్ర పుటల్లో చెదరని చరితం 
ఆ గ్రామాల సొంతం. భౌతికంగా అక్కడ ఊళ్లు లేకపోయినా రికార్డుల్లో చిరునామాలు మాత్రం ఉన్నాయి. గతంలో అక్కడ ప్రజలు నివసించే వారని చెప్పేందుకు ఆనవాలుగా శిథిల గోడలు, బావులు, గ్రామ చావిడిలు దర్శనమిస్తున్నాయి. ఇదీ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోని ఈచనహాల్, గుర్రాలదొడ్డి, కాటదొడ్డి, కోసిగి మండలంలోని బాత్ర బొమ్మలాపురం, కలవలగుండు, పుట్టకుంట, పెండేకల్లు, ఎండపల్లి గ్రామాల పరిస్థితి.  

దొంగల బెడదతో..  
కౌతాళం–ఉరకుంద గ్రామ రోడ్డులో ఈచనహాల్‌ గ్రామం ఉండేది. ఒకప్పుడు దాదాపు 40 కుటుంబాలు ఆ ఊళ్లో నివాసం ఉండేవి. గ్రామం వంకను ఆనుకుని ఉండటం.. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో రాత్రిళ్లు దొంగలు ఇళ్లలో ప్రవేశించి విలువైన వస్తువులు అపహరిస్తుండేవారట. దొంగల బెడద భరించలేక అక్కడ ఉన్న కుటుంబాలు ఓబుళాపురం, కామవరం, కౌతాళం గ్రామాలకు వలస వెళ్లి పోయారు. బంగారమ్మవ్వ, ఆంజనేయస్వామి ఆలయాలు, శిథిలమైన గ్రామచావిడి, రాతి బావి ఇప్పటికీ గ్రామానికి సాక్షీభూతంగా నిలిచాయి. రెవెన్యూ రికార్డులలో 816 ఎకరాల సాగుభూమి ఈచనహాల్‌ గ్రామ పంచాయతీ పేరుపైనే ఉండటం విశేషం. 


ఈచనహాల్‌ గ్రామానికి చెందిన గ్రామ చావిడి (శిథిలస్థితిలో)   

పట్నం బాటలో పెండేకల్లు   
కోసిగి మండల కేంద్రానికి ఈశాన్య దిశగా పెండేకల్లు ఉండేది. చాలా కాలం క్రితం దాదాపు 35 కుటుంబాలు అక్కడ నివాసం ఉండేవి. ఏళ్ల క్రితం నుంచి ఒక్కొక్కరు మండల కేంద్రానికి వలసబాట పట్టారు. కోసిగిలో వారిని పెండేకల్లు ఇంటిపేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. దాదాపు 150 కుటుంబాలు కోసిగిలో ఉన్నాయి. గ్రామ గుర్తుగా పెండేకల్లు ఆంజనేయస్వామి ఆలయం ఉంది. గ్రామానికి సంబంధించి రెవెన్యూ రికార్డులో 1423.16 ఎకరాల సాగుభూమి ఉంది.  

వరద పోటుతో..   
కౌతాళం మండలంలో తుంగభద్ర నది ఒడ్డున ఒకప్పుడు కాటదొడ్డి, గుర్రాలదొడ్డి ఉండేవి. ఏళ్ల క్రితం గుర్రాలదొడ్డి పూర్తిగా కనుమరుగైంది. ఆ పక్కనే ఉన్న కాటదొడ్డిలో 20 కుటుంబాలకుపైగా ఉండేవి. వరద పోటుకు కుటుంబాలన్నీ గుడికంబాలి, కుంభళనూరు గ్రామాలకు వలస వెళ్లాయి. రెవెన్యూ రికార్డుల్లో 418 ఎకరాలు సాగుభూమి కాటదొడ్డి గ్రామం పేరుపైనే ఉంది. గుర్రాలదొడ్డి గ్రామం పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు.  కోసిగి మండలంలోని బాత్ర బొమ్మలాపురం ప్రస్తుత ఆర్డీఎస్‌ ఆనకట్టను ఆనుకుని ఉండేది. వరదల కారణంగా ఊరంతా కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. కొందరు అగసనూరు, సాతనూరు, కందకూరు గ్రామాల్లో స్థిరపడ్డారు. బాత్ర బొమ్మలాపురం పేరుపై 600 ఎకరాల భూములు రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఉన్నాయి. గ్రామం గుర్తుగా మారెమ్మ ఆలయం మాత్రం దర్శనమిస్తుంది. 

ప్లేగు వ్యాధి కారణంగా..   
ప్లేగు వ్యాధి కారణంగా ఎన్నో పల్లెలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతోంది. ఈ కోవలోనే కోసిగి మండలం కలవలగుండు, పుట్టకుంట, ఎండపల్లి గ్రామాలు కనుమరుగైనట్లు పెద్దలు పేర్కొంటున్నారు. కలవలగుండు గ్రామంలో 574.95 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం పొలాలు పల్లెపాడు, చింతకుంట, పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు. కలవలగుండు ప్రాంతంలో సుంకులమ్మ ఆలయం, కొండపై, కింద భాగాల్లో రాతి రోళ్లు ఉన్నాయి. కోసిగి మండలం అర్లబండ, కడదొడ్డి గ్రామాల మధ్యలో పుట్టకుంట అనే గ్రామం ఉండేది. అంతుచిక్కని వ్యాధి కారణంగా కుటుంబాలు అర్లబండ బాట పట్టాయి. కోసిగి మండలం దుద్ది గ్రామం దక్షిణ దిశగా ఎండపల్లి గ్రామం ఉండేదట. శతాబ్దాల క్రితమే గ్రామం కనుమరుగై పోయింది. దుద్ది, కోసిగి గ్రామాల్లో ఎండపల్లి వాసులు నివాసం ఉంటున్నారు. కొందరు ఎండపల్లి ఇంటి పేరుగా కొనసాగుతున్నారు.  

ప్లేగు వచ్చి ఊరు వదిలారు 
నా పేరు శివారి గజ్జయ్య. మాది కోసిగి మండలం పల్లెపాడు గ్రామం. మా గ్రామానికి దక్షిణ దిక్కున నాలుగు తరాల క్రితం కలవలగుండు అనే ఊరు ఉండేదని మా పెద్దలు చెప్పేవారు. ఇప్పటికీ ఆ గ్రామం ఆనవాలుగా బండరాళ్లపై రోళ్లు, పాడుబడిన గోడలు ఉన్నాయి. అక్కడే సుంకులమ్మ ఆలయం, కొంత దూరంలో ఆంజనేయస్వామి విగ్రహాలున్నాయి. అప్పట్లో ప్లేగు వచ్చి ఊరు ఖాళీ అయ్యిందట.  

మా ముత్తాతల నాడే వలస 
నా పేరు గోపాలు. మా ముత్తాతలు ఈచనహాల్‌ నుంచి కౌతాళం మండల కేంద్రానికి వచ్చారట. అందుకే మా ఇంటి పేరు ఈచనహాల్‌గా మారిందట. దోపిడీ దొంగల బెడద కారణంగా మా ముత్తాతలు ఊరిని వదిలేసి వచ్చారని చెబుతారు. ఇప్పటికీ మాకు ఆ గ్రామ పొలిమేరలోనే రెండు ఎకరాల భూమి ఉంది. 

వరదలకు ఊరు ఖాళీ 
నా పేరు ఈరన్న. మాది కాటదొడ్డి గ్రామం. గ్రామంలో గతంలో 20 కుటుంబాలకుపైగా ఉండేవారు. గతంలో వరదలకు ఊరు ముంపునకు గురి కావడంతో కుటుంబాలన్నీ కుంబళనూరుకు మారాయి. ఆంజనేయస్వామి గుడి ఉండటంతో పూజారులుగా మా మూడు కుటుంబాలు ఇక్కడే ఉండిపోయాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement