అతిథి ఆగయా | Cyberia Crowns And Other Birds Migrate To Hyderabad Every Winter Season | Sakshi
Sakshi News home page

అతిథి ఆగయా

Published Wed, Nov 20 2019 8:48 AM | Last Updated on Wed, Nov 20 2019 8:48 AM

Cyberia Crowns And Other Birds Migrate To Hyderabad Every Winter Season - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సనత్‌నగర్‌ శీతాకాలం.. చలిపులిని వెంటబెట్టుకుని రావడమే కాదు.. ఖండాంతరాల్లో ఉన్న ప్రకృతి ప్రసాద విహంగాలకూ ఆహ్వానం పలుకుతుంది. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఎన్నో రకాల పక్షులకు నగరం ఆతిథ్యమిస్తుంది. చలి కాలం ప్రారంభమైందంటే చాలు.. ప్రతి ఏటా వర్ణశోభితమైన పక్షులు నగరంలోని పలు తటాకాల్లో సోయగాల సరాగాలు ఆలపిస్తుంటాయి. కిలకిలారావాలతో ప్రకృతి రమణీయతను ఇనుమడింపజేస్తుంటాయి. రంగురంగుల విహంగాలతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ప్రస్తుతం నగర శివారులోని అమీన్‌పూర్, గండిపేట చెరువులకు విదేశీ వలస పక్షులు వస్తుండటంతో ఈ తటాకాలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి.

వెర్డిటెర్‌ ఫ్లై క్యాచర్‌  

ఎక్కడెక్కడి నుంచో.. 
సైబీరియా నుంచి హైదరాబాద్‌కు సుమారు  20 వేల కి.మీ దూరం ఉంటుందని అంచనా. పక్షులు అంత దూరం నుంచి ప్రయాణించి నగరానికి వలస రావడం గమనార్హం. శీతాకాలంలో అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లోకి వెళ్లడం, తద్వారా వాటికి ఆహార సమస్య ఎదురవడం వంటి కారణాలతో అత్యంత సురక్షిత ప్రాంతంతో పాటు ఆహారం దొరికే ప్రాంతంగా హైదరాబాద్, శివారు ప్రాంతాలను వలస పక్షులు ఎంచుకుంటాయి. ఈ క్రమంలో ఇక్కడి ఆతిథ్యం కోసం నెలల పాటు ప్రయాణం చేసి వస్తుంటాయి. సైబీరియాతో పాటు యూరప్, దక్షిణ యూరేషియా, సెంట్రల్‌ ఏషియా, రష్యా, టర్కీ, ఆఫ్రికా, ట్రాన్స్‌– హిమాలయాల నుంచి వివిధ రకాల పక్షులు వలస వస్తుంటాయి. అవి వచ్చే క్రమంలో మధ్యమధ్యలో డే హాల్ట్‌ (పగలు) చేస్తూ రాత్రి వేళ తమ గమ్యం వైపు సాగిపోతాయి. ఉదాహరణకు సైబీరియా నుంచి వచ్చే పక్షులు చైనా భూభాగంలోని తిపత్, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాల్లోని చెరువుల వద్ద కొద్ది రోజులు బస చేసి మళ్లీ హైదరాబాద్‌ వైపు గమ్యం సాగిస్తుంటాయి. అలా దాదాపు నెల, రెండు నెలల పాటు తమ ప్రయాణం కొనసాగిస్తుంటాయి. ప్రతి పక్షి హిమాలయాలను టచ్‌ చేసి రావాల్సిందే. నగరంలో కొన్ని నెలల పాటు బస చేసి దిగువ ప్రాంతాలకు పయనమై తిరిగి వేసవి కాలం నాటికి స్వస్థలాలకు వెళ్తుంటాయి.

ఎల్లో వాగ్‌టేల్‌   

కచ్చిత గమ్యాన్ని ఎలా చేరుకుంటాయి..?  

పక్షులు కచ్చితమైన గమ్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి పంథాను అనుసరిస్తాయనే సందేహం రావడం సహజం. మనుషులు మొదటిసారి కొత్త గమ్యానికి వెళ్లాలంటే తెలిసిన వారిని అంటిపెట్టుకుని వెళ్లడమో లేదా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జీపీఎస్‌ ఆధారంగానో వెళ్తుంటారు. ఒకసారి గమ్యాన్ని చేరుకున్నారంటే మరోసారి సులువుగా ఎవరి సహాయం అవసరం లేకుండా ఆ గమ్యాన్ని చేరుకోవచ్చు. అలాగే ఒకసారి దారిని కనిపెట్టిన పక్షులు మరోసారి అవలీలగా ఆ మార్గాన్ని అనుసరిస్తూ వస్తుంటాయి. ఈ క్రమంలో రాత్రివేళల్లో ఆకాశంలోని నక్షత్రాలను, చంద్రుడి దిశలను గుర్తుపెట్టుకుంటాయి. కాలానుగుణంగా నక్షత్రాలు, చంద్రుడి దిశలు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ఎన్ని డిగ్రీల కోణంలో ప్రయాణం చేస్తే తమ గమ్యం చేరుకుంటామో పక్షుల మైండ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఆ మేరకు నక్షత్రాలు, చంద్రుడిని అనుసరిస్తూ రాత్రివేళల్లోనే ఎక్కువగా పక్షులు ప్రయాణం చేస్తుంటాయి. నక్షత్రాలు, చంద్రుడి కిరణాల ప్రసరణతో పైకి ఎగురుకుంటూ వెళ్లే క్రమంలో కింద ఉన్న చెరువులు, కుంటలను కూడా స్పష్టంగా పసిగడతాయి. ఒకవేళ కొత్తగా వలస వచ్చే పక్షులైతే ఇంతకముందు వలస వచ్చిన పక్షులను అనుసరిస్తూ ఉంటాయి. అలా గ్రూపులు గ్రూపులుగా మధ్యమధ్యలో ఆగుతూ చివరకు నగరాన్ని చేరుకుంటాయి.

కామన్‌ స్టోన్‌చాట్‌ 

నగరాన్నే ఎందుకు ఎంచుకుంటాయి..? 
చలికాలంలో పక్షులకు సురక్షితమైన ప్రాంతంగా హైదరాబాద్‌ ఉంటుంది. చలిని తట్టుకునే ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడంతో పాటు ఆహారానికి కూడా అనువుగా ఉంటాయి. సహజసిద్ధమైన వాతావరణం వలస పక్షులకు ఇక్కడ లభిస్తుంది. చెరువుల చుట్టూ భారీ చెట్లు ఉండటం వలస పక్షులకు అనుకూల అంశం. చెరువుల చెంతనే చెట్లపై గూళ్లు కట్టుకోవడానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. చెరువుల మధ్యలో అక్కడక్కడా రాతి శిలలతో పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసిన స్టాండ్‌లు ఉండటం వల్ల ఫ్లెమింగో వంటి పక్షులు వాటిపై గంటల పాటు స్టే చేస్తూ చేపలను అన్వేషిస్తుంటాయి. ఇలా తమ ఆహారాన్ని సేకరించుకోవడానికి అనువుగా ఉంటుంది. చేపల జోలికి వెళ్లని కొన్ని రకాల పక్షులు చెరువు ఒడ్డు ప్రాంతంలో సంచరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. పక్షులకు అనువైన వాతావరణంతో పాటు వనరులు ఇక్కడ పుష్కలంగా అందుబాటులో ఉండడంతో వలస పక్షులు ఏటా ఇక్కడ వచ్చి విడిది చేస్తుంటాయి. 

బ్లాక్‌–టేల్డ్‌ గాడ్‌విట్‌ పక్షి  

మొత్తం 380 రకాల పక్షి జాతుల్లో దాదాపు 70– 80 వలస పక్షులు ప్రతి ఏటా చలికాలంలో నగరాన్ని ముద్దాడుతుంటాయి. ఇందులో విదేశాలకు చెందిన 40– 45  రకాల పక్షులు విహారం చేస్తుంటాయి. ఇందులో ప్రధానంగా ఫ్లెమింగ్‌లోని పలు రకాల పక్షులు, వెర్డిటెర్‌ ఫ్లై క్యాచర్, కామన్‌ స్టోన్‌చాట్, నార్తరన్‌ షోవలర్, బ్లాక్‌ టెయిల్డ్‌ గాడ్‌విట్, ఎల్లో వాగ్‌టెయిల్, హారియర్స్‌లో పలు రకాల పక్షులు, 12 జాతులకు చెందిన డక్స్, ఈగల్స్, వాడర్స్, లిటిల్‌ టెర్న్‌ వంటి ఎన్నో రకాల రంగురంగుల వలస పక్షులను ఈ వింటర్‌ సీజన్‌లో చూడవచ్చు.   

పర్యావరణానికి సంకేతం.. 

పర్యావరణం ఎలా ఉందో వలస పక్షుల రాకను బట్టి చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా వస్తున్నాయంటే ఇక్కడి వాతావరణం ఆమోదయోగ్యంగా ఉందనే భావించాలి. ఒకవేళ వలస పక్షుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయంటే అంతకుముందు కంటే పర్యావరణం దెబ్బతిందన్న సంకేతంగా చెప్పుకోవచ్చని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గత పదేళ్లతో పోలిస్తే వలస పక్షుల రాక కొంచెం తగ్గిందంటున్నారు. పర్యావరణానికి కాస్త విఘాతం కలిగి ఉండవచ్చు లేక వాటి ప్రయాణంలో అవాంతాలు ఎదురై ఉండవచ్చని భావిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో ఇటీవల రాజస్థాన్‌లో ఒక రకమైన బ్యాక్టీరియా కారణంగా కొన్ని వేల వలస పక్షులు చనిపోయాయి. అలాంటి సంఘటనలు జరగడం ద్వారా కూడా నగరానికి వలస వచ్చే పక్షుల సంఖ్య తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా శీతాకాలం వలస పక్షులను నగరం మురిసిపోతుందనడంలో సందేహం లేదు. 

నార్తర్న్‌ షోవెలర్‌ 

చెరువులు కాలుష్యం కాకుండా చూడాలి..
వలస పక్షులపై విశ్లేషణ చేయడంతో పాటు ఫొటోలు తీసి ‘బర్డ్స్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌’ గ్రంథంలో ప్రస్తావించాను. ఇప్పటివరకు నేను 226 రకాల పక్షుల ఫొటోలను తీశాను. వీటిలో దాదాపు 80 రకాల వలస పక్షులు శీతాకాలంలో నగరానికి రావడం గమనించాను. పక్షులు విరివిగా రావాలంటే మన చెరువులను కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్‌ మంగ,‘బర్డ్స్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌’ రచయిత 

వలస పక్షుల రాక తగ్గింది.. 

గత పదేళ్లుగా నగరానికి దాదాపు 50 శాతం మేర వలస పక్షులు రావడం తగ్గింది. అక్టోబర్‌ 15 నాటికి వలస పక్షులు రాక మొదలవుతుంది. వేసవికాలం ప్రారంభమయ్యే ముందు తిరిగి వెళతాయి. పక్షులకు అనువైన వాతావరణం కల్పించి తగిన ఆతిథ్యం ఇస్తే బాగుంటుం  ది. పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం.         
– చెల్‌మల శ్రీనివాస్, ఓయూ జంతుశాస్త్ర సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement