
సంగారెడ్డి పట్టణం
తరతరాల కరువుకు పుట్టిళ్లు ఆ పల్లెలు. నీళ్లు లేక రాళ్లు తేలిన భూముల్లో సాగు పాణం మీదకొస్తోంది. విధిలేక భూమి మీద భరోసా వదిలి బువ్వ కోసం మైళ్లకు మైళ్లు వెళ్లే వలస పక్షులు అక్కడి జనం.
- ఏటా వలస గోసే
- బుక్కెడు బువ్వ కోసం మైళ్లకు మైళ్లు..
- ప్రత్యేక రాష్ట్రంలోనూ తీరని ‘ఆకలి’
- ‘కొత్త’ ఆకాంక్ష నెరవేర్చని పాలకులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తరతరాల కరువుకు పుట్టిళ్లు ఆ పల్లెలు. నీళ్లు లేక రాళ్లు తేలిన భూముల్లో సాగు పాణం మీదకొస్తోంది. విధిలేక భూమి మీద భరోసా వదిలి బువ్వ కోసం మైళ్లకు మైళ్లు వెళ్లే వలస పక్షులు అక్కడి జనం. తెలంగాణ కల సిద్ధించిన వేళ ఈ ప్రాంత కరువును తరిమికొట్టాలి. పడావు పడిన భూముల్లో పారిశ్రామిక విప్లవం రావాలి. వలస గోసతోనే నిర్వీర్యమైపోతున్న యువతకు శాశ్వత ఉపాధి దొరకాలి.
నారాయణఖేడ్ ఆకలి తీరాలి. మారుమూల పల్లెల్లో పరిశ్రమలు నిలబడాలంటేæ ప్రత్యేక రాయితీ కావాలి. అందుకు పారిశ్రామిక వెనుకబాటు ఉన్న మెదక్ జిల్లానే గత్యంతరం. తాత్కాలిక వనరుల కల్పనను, లేని ఉద్వేగాలను కారణంగా చూపించి రాజకీయ నేతలు సంగారెడ్డిలో కలపాలనుకోవడం చారిత్రక తప్పిదం అవుతోందని, యువత భవిష్యత్తు ఉపాధిని విధ్వంసం చేసిన వారు అవుతారని సమాజిక పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
పారిశ్రామికంగా అత్యంత పురోగతిలో ఉన్న జిల్లా సంగారెడ్డి. దేశంలోనే పెద్ద ఇండస్ట్రీయల్ కారిడార్ పటాన్‌చెరు, నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరాలో కెమికల్, ఫార్మా పరిశ్రమలు, అందోల్ ప్రాంతంలో బీరు పరిశ్రమల, సంగారెడ్డిలో పెప్సీకోలా, గణపతి షుగర్స్, ఓడీఎఫ్, బీడీఎల్, రామచంద్రాపురంలో బీహెచ్‌ఈఎల్, సదాశివపేటలో ఎమ్మార్‌ఎఫ్ తదితర ఇంటర్నెషనల్ కంపెనీలు ఇప్పటికే స్థిరపడ్డాయి.
మరో వైపు జహీరాబాద్‌లో 12 వేల ఎకరాలతో పారిశ్రామిక పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ఏర్పాటు చేస్తున్నారు. నిమ్జ్ ప్రారంభమైతే వేలాది పరిశ్రమలు ఇక్కడకు వస్తాయి. ఇక సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం పరిశ్రమల కోసం ప్రత్యేక రాయితీలు ప్రకటించాల్సిన అవసరం అసలు ఉండదు. ప్రస్తుత ప్రదిపాదనల ప్రకారం వెనుకబడిన నారాయణఖేడ్‌ను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచితే అది యువత భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతోందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2.50 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 80 వేల ఎకరాల భూమి వ్యవసాయానికి అంత యోగ్యమైనది కాదని కేవలం పారిశ్రామిక అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని ఇప్పటికే నిపుణులు తేల్చారు. హైదరాబాద్ చుట్ట పక్కల ప్రాంతాల కంటే అత్యంత చౌకగా భూములు దొరుకుతాయి.
పైగా బీదర్, లాతూర్ లాంటి ముఖ్యపట్టణాలు అతి సమీపంగానే ఉన్నాయి. అన్నిటికీ మించి శ్రామిక శక్తి పుష్కలంగా ఉంది. అయినా ఇప్పటి వరకు పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టకపోవడం ప్రభుత్వ పరమైన ప్రోత్సాహం లేకపోవటం. ప్రత్యేక రాయితీ ద్వారా ఇక్కడ పరిశ్రమలను పోత్సహించాల్సి ఉంటుంది. అది జరుగాలంటే నారాయణఖేడ్‌ను నూటికి నూరుపాళ్లు మెదక్ జిల్లాలోనే ఉంచాలని పారిశ్రామిక వేత్తలు చెప్తున్నారు.
ప్రతిపాదిత మెదక్ జిల్లాలో చేగుంట, చిన్నశంకరంపేట, కొంత మేరకు తూప్రాన్ బెల్టులో మినహాయిస్తే ఎక్కడ కూడా పరిశ్రమలు లేవు. భవిష్యత్తులో మెదక్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన జిల్లా. పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లాను ప్రోత్సహించడం కోసం కచ్చితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీ ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే వేలాది పరిశ్రమలు మెదక్ జిల్లాను తాకుతాయి.
ప్రస్తుతం నారాయణఖేడ్ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న పారిశ్రామిక భూమి లభ్యతను బట్టి వందల్లో మల్టీనేషన్ కంపెనీలు, వేలాదిగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అక్కడ స్థిరపడే అవకాశం ఉందని, ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది స్థానిక యువతకు భవిష్యత్తులో ఉపాధి లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రవాణాపరంగా ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనల ప్రకారం మెదక్ జిల్లాకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం అక్కన్నపేట- మెదక్ రైల్వే పనులు కొనసాగుతున్నాయి. ఈ రైలు మార్గాన్ని బీదర్ వరకు పొడగించే ప్రతిపాదనలపై అధ్యయనం జరుగుతోంది. మరో వైపు నిజాంపేట నుంచి బీదర్ వరకు దాదాపు 50 కిలోమీటర్ల పొడవుతో 50వ నెంబర్ జాతీయ రహదారి పనులు ప్రారంభం కాబోతున్నాయి.
ఇంకో వైపు మెదక్ పట్టణం నుంచి నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలకు అనుమతి లభించింది. డివిజన్ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావటానికి గరిష్టంగా 5నుంచి 10 ఏళ్లకు మించి పట్టదు. ఆ తరువాత పారిశ్రామిక వేత్తలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతారు. దీంతో రైతుల భూములకు కూడా మంచి డిమాండ్ వస్తుంది, అక్కడి యువతకు కరువుతీరా శాశ్వత ఉపాధి దొరుకుతుంది.