
ఈ చిత్రంలో వృద్ధురాలి వద్ద కనిపిస్తున్న చిన్నారుల పేర్లు అరవింద్, మాన్విత. వీరి తల్లిదండ్రులు అశోక్, సునీతమ్మలు పొట్టకూటి కోసం బెంగుళూరుకు వలస వెళ్లారు. తమ పిల్లలను తల్లి సునందమ్మ వద్దే వదిలేసి వెళ్లారు. వీరి ఆలనా పాలన ఆమె చూసుకుంటోంది. పొట్టకూటి కోసమే తమ తల్లిదండ్రులు వలస వెళ్లారని, వారిని విడిచి ఉండటం కష్టంగానే ఉన్నా తప్పడం లేదని ఈ చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం, శెట్టూరు : కుమారులు దూరమయ్యారని ఓ తల్లి ఆవేదన. తమ తల్లిదండ్రులు తమ దగ్గరలేరని చిన్నారుల గగ్గోలు. తమను పట్టించుకునే దిక్కేలేదని వృద్ధ దంపతుల ఘోష. జనావాసం లేక బోసిపోయిన గ్రామాలు. తాళాలతో వెక్కిరిస్తున్న ఇళ్లు... ఇలా అన్నింటికీ కారణం ‘కరువు రక్కసే’. ఉన్న ఊరిలో ఉపాధి పనులు చేసుకుందామనుకుంటే బిల్లులే రావు.. బయట పనులు చేసుకుందామంటే కరువు దెబ్బతో ఏ పనీ దొరకదు. ఇక చేసేది లేక బతుకు జీవుడా అంటూ వలసబాట పట్టిన ఉపాధి కూలీలు, రైతులు వ్యథ అంతా ఇంతా కాదు.
కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 68,429 జాబ్‌కార్డులుండగా 1200కు పైగా 100 రోజుల పని దినాలు పూర్తయ్యాయి. ఆయా జాబ్‌కార్డుదారులంతా దినసరి కూలీలుగా వెళ్తూ కాలం వెళ్లదీసేవారే. అయితే అనంతపురం జిల్లాకు పిలవని బంధువులా ప్రతియేటా వస్తున్న కరువు ఈసారి కూడా ఖరీఫ్ రైతును కాటేసింది. ఇప్పటికే జూన్‌నెలలో సాగు చేసిన వేరుశనగ నియోజకవర్గ వ్యాప్తంగా 12 వేల హెక్టార్లలో ఎండిపోయినట్లు ప్రాథమిక అంచనా. మరోవారం రోజుల్లో వర్షం కురవకపోతే ఇప్పటి వరకు సాగైనా 40 వేల హెక్టార్ల వేరుశనగ పంట ఎండిపోయే ప్రమాదముంది. ఇదే జరిగితే నియోజకవర్గంలో వేరుశనగ సాగు చేసిన రైతుల పెట్టుబడి రూ.100 కోట్లు నేలపాలైనట్లే.
ఉపాధిలేక...
ఉన్న ఊర్లో ఉపాధి హామీ పథకం ఉన్నా నెలల తరబడి చేసిన పనులకు కూలీ డబ్బు రాక వలస బాట పడుతున్నవారే అధికంగా ఉన్నారు. ఉన్న ఊర్లో ఉపాధి కల్పిస్తున్నామని ఉపాధి అధికారులు కాకిలెక్కలు చెబుతున్నారు , ఏ గ్రామంలో కూడా వలసలు లేవంటూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నారు.