కీవ్: రష్యా దాడుల పర్యవసానంగా ఉక్రెయిన్ జనాభాలో 2% మంది నివాసాలను వదిలిపెట్టి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కేవలం వారం రోజుల్లోనే 10 లక్షల మంది వలసబాటపట్టారని తెలిపింది. ఈ శతాబ్దంలోనే అత్యంత వేగవంతమైన వలసలుగా అభివర్ణించింది. దేశంలోని రెండో అతిపెద్ద నగరంతోపాటు, వ్యూహాత్మకమైన రెండు నౌకాశ్రయాలపై రష్యా సైన్యం దాడులు ముమ్మరమయ్యాయి. సుమారు 15 లక్షల జనాభా కలిగిన ఖర్కీవ్ నగర జనావాసాలపై ఒక వైపు బాంబుదాడులు జరుగుతున్నా ప్రజలు అక్కడి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఐరాస వలసల విభాగం తెలిపింది.
ఖర్కీవ్ రైల్వే స్టేషన్‌లో పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా వచ్చిన రైళ్లలోకి ఎక్కి వెళ్లిపోతున్నారని పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెలుపల భారీ సంఖ్యలో బారులు తీరిన ట్యాంకులు, ఇతర వాహనాలు రెండు రోజులుగా అక్కడే తిష్టవేశాయని తెలిపింది. అజోవ్ సముద్ర తీర నగరం మరియుపోల్‌ను రష్యా బలగాలు దిగ్బంధించాయని, నల్లసముద్రంలోని మరో కీలక నౌకాశ్రయం పరిస్థితి అస్పష్టంగా ఉందని బ్రిటన్ రక్షణ మంత్రి చెప్పారు. మరో పెద్ద నగరం ఖెర్సన్ తమ పూర్తి అధీనంలోకి వచ్చిందని రష్యా బలగాలు ప్రకటించుకున్నాయి.
దాడులు మొదలైనప్పటి నుంచి 227 మంది పౌరులు చనిపోగా, 525 మంది క్షతగాత్రులైనట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ తెలపగా, 2 వేల మందికి పైగానే చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అయితే, సైన్యానికి జరిగిన నష్టాన్ని తెలపలేదు. మొదటిసారిగా, రష్యా కూడా తమ బలగాలకు వాటిల్లిన నష్టం వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు సుమారు 500 సైనికులు చనిపోగా, 1,600 మంది గాయపడినట్లు పేర్కొంది.
ఇదే ప్రతిఘటనను కొనసాగించండి
రష్యా సేనలను ప్రజలు ప్రతిఘటిస్తున్న తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రశంసలు కురిపించారు. ఇదే ప్రతిఘటనను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్రమణదారులను ప్రశాంతంగా ఉండనివ్వవద్దన్నారు. వారు నైతిక స్థైర్యం కోల్పోతారన్నారు. రష్యా సైనికులు సూపర్‌పవర్ సైనికులు కాదు, అయోమయంలో ఉన్న పిల్లలని అభివర్ణించారు.
(చదవండి: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థిపై కాల్పులు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment